Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!

Employees Bonus

Employees Bonus

Employees Bonus: పండుగల సీజన్ స్టా్ర్ట్ కావడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో బోనస్ సందడి మొదలైంది. ఏటా దసరా, దీపావళి వేళ గ్రూప్-బి, గ్రూప్-సి నాన్-గెజిటెడ్ ఉద్యోగులకు అందే ‘ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్’ (PLB)పై ఈసారి మునుపెన్నడూ లేని విధంగా తీవ్ర చర్చ నడుస్తోంది. బోనస్ ఎప్పుడు వస్తుందనే దానికంటే.. ఉద్యోగుల ఖాతాల్లో పడే ‘మొత్తం’ ఈసారి సంచలనంగా మారబోతోందా అనేదే ప్రస్తుతం కేంద్ర వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం అమల్లో ఉన్న పాత నిబంధనలను సవరించి, బోనస్ లెక్కింపు పరిమితిని ఏకంగా మూడు రెట్లు పెంచాలంటూ ఉద్యోగ సంఘాలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి.

బోనస్ పరిమితి రూ.7 వేల నుంచి రూ.21 వేలకు పెంపు?

కేంద్ర ఉద్యోగులకు బోనస్ లెక్కించే గరిష్ట వేతన పరిమితిని ప్రస్తుతం నెలకు రూ.7,000గా పరిగణిస్తున్నారు. దీని ప్రకారం 30.4 రోజుల సగటును లెక్కిస్తే ఉద్యోగికి కేవలం రూ.6,908 మాత్రమే బోనస్‌‌గా అందుతోంది. ప్రస్తుత ధరల పెరుగుదల, పెరిగిన జీవన వ్యయాల దృష్ట్యా ఈ మొత్తం ఏమాత్రం సరిపోదని ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. దీనిపై నేషనల్ కౌన్సిల్ ఫర్ జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ (NC-JCM) కార్యదర్శి శివ గోపాల్ మిశ్రా కేబినెట్ కార్యదర్శికి రాసిన లేఖలో కీలక అంశాలను ప్రస్తావించారు. కేంద్ర కార్మిక శాఖ స్వయంగా కనీస వేతనాన్ని దాదాపు రూ.21,000గా నిర్ధారించినప్పుడు, బోనస్ లెక్కింపు పరిమితి మాత్రం అంతకంటే తక్కువగా ఎందుకు ఉండాలని ఆయన ప్రశ్నించారు. కార్మిక సంఘాల డిమాండ్‌ను కేంద్రం పరిగణనలోకి తీసుకుని బోనస్ పరిమితిని రూ.21,000కి పెంచితే, ఉద్యోగుల ఖాతాల్లోకి దాదాపు రూ.20,724 వరకు బోనస్ జమ అయ్యే అవకాశం ఉంది. అంటే సాధారణంగా వచ్చే మొత్తం కన్నా ఏకంగా మూడు రెట్లు ఎక్కువ లభించే సూచనలు కనిపిస్తున్నాయి.

ఖాతాల్లో డబ్బులు ఎప్పుడు పడతాయి?
ప్రతి ఏటా దసరా పండుగకు ముందే ప్రభుత్వం బోనస్‌ను విడుదల చేయడం ఆనవాయితీ. ఈసారి దసరా పండుగ అక్టోబర్ 20న, దుర్గాపూజ అక్టోబర్ 21న ఉండటంతో.. అంతకంటే ముందే ఉద్యోగుల ఖాతాల్లో సొమ్ము జమ చేయాలని పోస్టల్ ఉద్యోగుల జాయింట్ కౌన్సిల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ సెక్రటరీకి విజ్ఞప్తి చేసింది. ఆల్ ఇండియా డిఫెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (AIDEF) ప్రతినిధులు, భారత్ పెన్షనర్స్ సమాజ్ వర్గాల సమాచారం ప్రకారం.. అక్టోబర్ ఫస్ట్ వీక్‌లోనే బోనస్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆ వెంటనే పండుగ కంటే ముందే డబ్బులు ఉద్యోగుల ఖాతాల్లో జమ కానున్నాయి. మరోవైపు బోనస్ చెల్లింపు వ్యవధి విషయంలో కొన్ని విభాగాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కాన్పూర్, షాజహాన్‌పూర్, ఆవడి, హజ్రత్‌పూర్‌లలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల సిబ్బందికి పూర్తి 30 రోజులకు బదులుగా కేవలం 18.56 రోజులకే బోనస్ చెల్లించేలా కేంద్రం నిర్ణయం తీసుకోవడంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వివక్ష లేకుండా తమకూ 30 రోజుల లెక్కన, రూ.21,000 పరిమితి ఆధారంగానే బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆయా కర్మాగారాల ఉద్యోగులు నిరసనలకు దిగారు. పండుగ వేళ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాల డిమాండ్‌పై ఎలాంటి సానుకూల నిర్ణయం తీసుకుంటుందో, పాత లెక్కల ప్రకారమే సొమ్ము చెల్లిస్తుందా లేక పరిమితి పెంచి రూ.21 వేల భారీ బొనాంజా ప్రకటిస్తుందా అన్నది వేచి చూడాలి.