NTV Telugu Site icon

Business Headlines: బ్యాంకుల్లో మూలుగుతున్న 48,262 కోట్ల రూపాయలు ఎవరివో?

Business Headlines

Business Headlines

Business Headlines: దేశంలోని వివిధ బ్యాంకుల్లో 48 వేల 262 కోట్ల రూపాయలు మూలుగుతున్నాయి. ఆ డబ్బులు మావేనంటూ ఎవరూ క్లెయిమ్‌ చేసుకోలేదని ఆర్బీఐ తెలిపింది. పదేళ్లకు పైగా పట్టించుకోకుండా ఉన్న సేవింగ్స్‌, కరంట్‌ అకౌంట్లలోని అమౌంట్లతోపాటు టర్మ్‌ డిపాజిట్లలోని డబ్బులను అన్‌క్లెయిమ్డ్‌గా పేర్కొంటారు. ఇలాంటి ఖాతాలు ఏపీ, తెలంగాణ సహా 8 రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది.

ఇవాళ రెండో రోజూ ‘5జీ’ వేలం

5జీ స్పెక్ట్రం వేలం ఇవాళ రెండో రోజూ కొనసాగనుంది. నిన్న తొలి రోజు ఆక్షన్‌లో 1.45 లక్షల కోట్ల రూపాయల విలువైన బిడ్లు దాఖలైనట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. 80 వేల కోట్ల రూపాయల విలువైన బిడ్లు వస్తాయని టెలికం శాఖ అంచనా వేయగా అంతకన్నా 80 శాతం ఎక్కువ స్పందన రావటం విశేషమని చెప్పారు. విజేతలకు ఆగస్టు 15 నాటికి స్పెక్ట్రం కేటాయింపులు చేస్తామని పేర్కొన్నారు.

read more: Lucky Family: అదృష్ట కుటుంబమంటే ఇదే.. అప్పులతో కాసేపట్లో ఇల్లు అమ్మాల్సిన స్థితిలో..

హెచ్‌డీఎఫ్‌సీ ‘డిపాజిట్‌’ డ్రైవ్‌

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఇవాళ, రేపు రెండు రోజులపాటు ఎన్‌ఆర్‌ఈ డిపాజిట్‌ డ్రైవ్‌ నిర్వహించనుంది. విదేశాల్లోని భారతీయుల నుంచి ఇండియాలోకి డాలర్ల ప్రవాహాన్ని పెంచేందుకు ప్రత్యేక ఆఫర్‌ ప్రకటించింది. ఇప్పుడిస్తున్న వడ్డీ కన్నా 50 బేసిస్‌ పాయింట్ల వరకు ఎక్కువ వడ్డీ చెల్లించనుంది. మినిమం 2 కోట్ల రూపాయలు డిపాజిట్‌ చేయాలి. 12 నుంచి 15 నెలల కాలానికి డిపాజిట్‌ చేస్తే 6 పాయింట్‌ 8 శాతం వడ్డీ ఇవ్వనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

సెల్ఫ్‌ రెగ్యులేటరీపై ఫోకస్‌

ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, గూగుల్‌ తదితర గ్లోబల్‌ ఇంటర్నెట్‌ కార్పొరేషన్లు స్వీయ నియంత్రణ వ్యవస్థ ఏర్పాటుపై దృష్టి పెట్టాయి. మన దేశంలో ఎదురవుతున్న కంటెంట్‌ సమస్యల పరిష్కారం కోసం ఈ సంస్థను తెర మీదికి తెచ్చాయి. వివిధ సామాజిక మాధ్యమాలకు సంబంధించి యూజర్ల నుంచి వస్తున్న ఫిర్యాదులపై విచారణ కోసం కమిటీని ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ అప్‌డేట్‌ రావటం ప్రాధాన్యత సంతరించుకుంది.

‘జీడీపీ’ని తగ్గించిన ఐఎంఎఫ్‌

అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఇండియా స్థూల దేశీయ ఉత్పత్తి అంచనాని 8 పాయింట్‌ 2 శాతం నుంచి 7 పాయింట్‌ 4 శాతానికి తగ్గించింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగా ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. నిత్యావసరాల ధరలను అదుపు చేసేందుకు ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచుతుండటం, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, కరోనా సంక్షోభం, ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపు అంచనాలను కారణాలుగా పేర్కొంది.

‘విండో’ ఫండ్‌ రైజింగ్‌

బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్న సోషల్‌ కామర్స్‌ టెక్నాలజీ స్టార్టప్‌ అయిన విండో.. 15 లక్షల డాలర్లను సమీకరించింది. యూనికార్న్‌ ఇండియా వెంచర్స్‌ ఆధ్వర్యంలో ఈ ఫండ్‌ రైజింగ్‌ జరిగినట్లు తెలిపింది. రాపిడో ఇండియా, పోర్టీ, క్యాప్రీ గ్లోబల్‌తోపాటు మరికొంతమంది పెట్టుబడిదారులు ఇందులో పాల్గొన్నారని పేర్కొంది.

స్టాక్‌ మార్కెట్‌ అప్‌డేట్‌

స్టాక్‌ మార్కెట్‌లో పరిస్థితి మూడో రోజూ మారలేదు. ఈ రోజు కూడా నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 100 పాయింట్లు తగ్గింది. నిఫ్టీ 16450 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ అవుతోంది. షాపర్స్‌స్టాప్‌ షేర్లు 11 శాతం పెరిగి 52 వారాల గరిష్టానికి చేరాయి. మారుతీ, అల్ర్టాటెక్‌, ఎన్టీపీసీలకు లాభాలు వచ్చాయి.
టైటాన్‌, కొటక్‌ బ్యాంక్‌, రిలయెన్స్‌ నష్టాలను చవిచూశాయి.

ఇన్‌క్రెడ్‌, ‘కేకేఆర్‌’ విలీనం

ఇన్‌క్రెడ్‌, కేకేఆర్‌ అనే రెండు నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్లు (ఎన్‌బీఎఫ్‌సీలు) ఒక్కటయ్యాయి. తమ రుణ వ్యాపారాలు విలీనమైనట్లు ఇవాళ వెల్లడించాయి. ఈ మేరకు 2021 ఆగస్టులోనే ముందస్తు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఏడాది పాటు జరిగిన చర్చలు ఎట్టకేలకు కొలిక్కి వచ్చాయి. ఈ రెండు సంస్థలూ ఏకమవటంతో లీడింగ్‌ ఎన్‌బీఎఫ్‌సీగా ఎదిగే అవకాశం ఉన్నట్లు ఆశాభావం వ్యక్తం చేశాయి.

Show comments