Diwali Bonus: దీపావళి ధమాకా.. ఆ ఉద్యోగులకు భారీగా బోనస్!

Diwali Bonus

Diwali Bonus

Diwali Bonus: పండుగ సీజన్ మొదలవుతుందంటేనే ఉద్యోగుల కళ్లన్నీ బోనస్‌ల వైపే ఉంటాయి. అలాంటిది పండుగ పూట చేతినిండా పైసలు అందుతాయంటే ఆ ఆనందమే వేరు. సరిగ్గా దీపావళికి ముందే ఆ ఉద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు చెప్పింది. ఏటా ఇచ్చే పండుగ నజరానాను ఈసారి మరింత పెంచుతూ.. ఏకంగా రూ.33,000 బోనస్ ఇస్తున్నట్లు బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారికంగా ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే రూ.2,000 అదనంగా పెంచడంతో ఉద్యోగుల ఇళ్లలో పండుగ వెలుగులు ముందే మొదలయ్యాయి.

ఈ నిర్ణయంతో కార్పొరేషన్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న దాదాపు 93,509 మంది అధికారులు, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు నేరుగా లబ్ధి చేకూరనుంది. కేవలం రెగ్యులర్ ఉద్యోగులే కాకుండా ఎయిడెడ్ పాఠశాలల టీచర్లు, నాన్-టీచింగ్ స్టాఫ్, హెల్త్ వాలంటీర్లు, కిండర్‌గార్టెన్ టీచర్లకు కూడా ఈ పండుగ కానుక అందనుంది. పండుగ షాపింగ్‌లు, ఇంటి ఖర్చుల కోసం ఎదురుచూస్తున్న వేలాది కుటుంబాలకు ఈ బోనస్ పెద్ద ఊరటనిచ్చినట్లయింది.

గత ఏడాది బీఎంసీ సిబ్బందికి రూ.31,000 బోనస్ అందగా, ఈసారి దాన్ని రూ.33 వేలకు పెంచారు. యూనియన్ల డిమాండ్లు, ఆర్థిక పరిస్థితులపై వివిధ పార్టీల ప్రతినిధులతో చర్చలు జరిపిన అనంతరం ఈ నిర్ణయంపై ఏకాభిప్రాయం కుదిరింది. నవంబర్ నెల సాధారణ జీతంతో పాటే ఈ బోనస్ మొత్తాన్ని కూడా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని మేయర్ ఇప్పటికే పరిపాలనా యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పండుగకు ముందే ఖాతాల్లో భారీ మొత్తం జమ కానుండటంతో కార్మిక వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.