NTV Telugu Site icon

Blockbuster Vs Netflix: ఓటమి అంచుల నుంచి.. విజయ తీరాలకు. తెలుసుకోవాల్సిన ‘బ్లాక్‌బస్టర్’ స్టోరీ

Blockbuster Vs Netflix

Blockbuster Vs Netflix

Blockbuster Vs Netflix: ఒక్కోసారి పక్కోడి శాపాలు మనకు వరాలుగా మారుతుంటాయి. అప్పటివరకు మనం ఏ నంబర్‌ వన్‌ స్థానం కోసమైతే పోరాడుతుంటామో అది మనకు సునాయాసంగా దక్కుతుంది. అయితే.. మనం ఆ పక్కోడితో నువ్వా నేనా అనే రేంజ్‌లో పోరాటం చేస్తేనే ఈ సూత్రం వర్తిస్తుంది. దీన్నే.. ‘‘కాలం కలిసి రావటం’’ అని కూడా అంటారు. వీడియో స్ట్రీమింగ్‌ రంగంలో మనందరం ఇప్పుడు చెప్పుకుంటున్న నెట్‌ఫ్లిక్స్‌కి ఇది బాగా సూటవుతుంది. ఇది పూర్తిగా అర్థంకావాలంటే ఇన్నాళ్లూ మనకు తెలియని బ్లాక్‌బస్టర్‌ స్టోరీ గురించి ఇప్పుడు చెప్పుకోవాలి.

బ్లాక్‌బస్టర్‌ అనేది ఒక కంపెనీ పేరు. ఈ సంస్థ.. అగ్రరాజ్యం అమెరికాలో ఎంటర్టైన్‌మెంట్‌ ఫీల్డును చానాళ్లపాటు శాసించింది. ఒకప్పుడు.. అంటే.. 1990 ఆ రోజుల్లో.. ప్రజలు సినిమా చూడాలంటే.. దగ్గరలోని వీడియో స్టోర్‌కి వెళ్లి.. అక్కడి లైబ్రరీలో వెతికి మరీ సంబంధిత సినిమా వీడియోను దొరకబుచ్చుకోవాల్సి వచ్చేది . దీన్నే.. ‘‘వీడియో హోమ్‌ సిస్టమ్‌ టేప్‌ రెంటల్స్‌’’ అనేవారు. అంటే.. వీడియోని అద్దెకు తీసుకొని ఇంటికి పట్టుకెళ్లటం అన్నమాట. ఈ విధానానికి బ్లాక్‌ బస్టర్‌ అనే కంపెనీ బాగా పాపులర్‌.

read more: STUMAGZ: మధ్యతరగతి విద్యార్థుల ప్రతిభకు పట్టం కట్టే ప్రపంచ స్థాయి వేదిక.. స్టుమాగ్‌

చేతిలో కూడా పూర్తిగా పట్టనంత పెద్ద సైజులో నల్లగా ఉండే క్యాసెట్‌ను ఇంటికి తీసుకెళ్లి వీడియో ప్లేయర్‌లో పెట్టి టీవీకి కనెక్ట్‌ చేసి సినిమా చూసేవాళ్లు. సినిమాలను అద్దెకు ఇవ్వటం అనే ఈ వ్యాపారంలో బ్లాక్‌ బస్టర్‌ సంస్థ రాటుదేలింది. ఈ కంపెనీకి అప్పట్లోనే 9 వేలకు పైగా స్టోర్లు ఉండేవంటే అర్థంచేసుకోవచ్చు. బ్లాక్‌ బస్టర్‌ సంస్థ ఆ రోజుల్లోనే 6 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించేది. అప్పట్లో ఈ కంపెనీకి తిరుగే లేకుండా పోయిందని చెప్పటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

అయితే.. బ్లాక్‌ బస్టర్‌ సాగిస్తున్న ఈ దూకుడుకి రీడ్‌ హ్యాస్టింగ్స్‌ అనే వ్యక్తి బ్రేక్‌లు వేయటానికి ప్రయత్నించాడు. నెట్‌ఫ్లిక్స్‌ అనే సంస్థను స్థాపించి బ్లాక్‌ బస్టర్‌కి పోటీగా నిలిచాడు. ఇంటికి తీసుకెళ్లిన వీడియో క్యాసెట్‌ని సకాలంలో తిరిగి ఇవ్వకపోతే బ్లాక్‌ బస్టర్‌ కంపెనీ భారీగా.. అంటే.. రోజుకి ఒక డాలర్‌ ఫైన్‌ వేసేది. ఈ జరిమానాల ద్వారానే ఏడాదికి దాదాపు 800 మిలియన్‌ డాలర్లను సొమ్ముచేసుకునేది. ఇది.. రీడ్‌ హ్యాస్టింగ్స్‌కి అస్సలు నచ్చలేదు. దీనికి బదులుగా.. జీరో లేట్‌ ఫీజ్‌తో వీడియో క్యాసెట్లను అద్దెకు ఇస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించాడు.

మార్క్‌ రాండోల్ఫ్‌ అనే మిత్రుడితో కలిసి నెట్‌ఫ్లిక్స్‌ కంపెనీకి శ్రీకారం చుట్టాడు. వీడియో క్యాసెట్లను అద్దెకు ఇచ్చేందుకు సరికొత్త విధానానికి తెర తీశాడు. ఈ బిజినెస్‌ ప్రారంభించేందుకు మార్క్‌ రాండోల్ఫ్‌కి అతని తల్లి పాతిక వేల డాలర్ల డబ్బు ఇచ్చి ప్రోత్సహించారు. నెట్‌ఫ్లిక్స్‌వాళ్లు.. బ్లాక్‌ బస్టర్‌ సంస్థ మాదిరిగా వీడియో క్యాసెట్ల స్టోర్లను ఏర్పాటుచేయకుండా ఆన్‌లైన్‌ విధానాన్ని ఆరంభించారు. సినిమా వీడియోలను ఇ-మెయిల్‌ ద్వారా పంపాలని భావించారు. కానీ.. అది వర్కౌట్‌ కాలేదు.

సినిమా వీడియోల నిడివి చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఇ-మెయిల్‌ ద్వారా పంపటం సాధ్యం కాలేదు. ఒకవేళ పంపినా కూడా అందుకు బాగా డబ్బు ఖర్చయ్యేది. దీనికి ప్రత్యామ్నాయంగా DVDలను కనిపెట్టారు. ఈ డిస్క్‌లు చాలా సింపుల్‌గా ఉండేవి. వీడియో క్యాసెట్‌లాగ పెద్దగా ఉండకుండా లైట్‌ వెయిట్‌ మాత్రమే కలిగి ఉండేవి. 1997, 98 ఆ రోజుల్లో అమలుచేసిన ఈ ఐడియా సూపర్‌ డూపర్‌గా క్లిక్‌ అయ్యింది. నెట్‌ఫ్లిక్స్‌కి డిస్క్‌ల సేల్స్‌ శరవేగంగా పెరిగాయి.

కానీ.. బ్లాక్‌ బస్టర్‌ కంపెనీ వసూలు చేసే లేట్‌ ఫీజు సమస్య దీంతో పూర్తిగా తొలిగిపోలేదు. ఈ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్‌ అనూహ్యంగా సబ్‌స్క్రిప్షన్‌ అనే మోడల్‌ని ప్రవేశపెట్టింది. ఇప్పుడు అమలవుతున్న విధానం ఇదే కావటం గమనించాల్సిన విషయం. ఇందులోభాగంగా నెలకు దాదాపు 18 డాలర్లు చెల్లిస్తే ఒక కస్టమర్‌ మూడు DVDలను రెంట్‌కి తీసుకోవచ్చు. ఎన్నాళ్లపాటు అద్దెకు ఉంచుకోవాలంటే అన్నాళ్లు అనుమతించేవారు. ఆలస్య రుసుం అనేది లేదు. ఇది.. ఈ రెండు కంపెనీల మధ్య పోటీని మలుపు తిప్పింది.

అయినప్పటికీ నెట్‌ఫ్లిక్స్‌కి బ్లాక్‌ బస్టర్‌తో పోటీ పడటం కష్టంగా మారింది. ఎందుకంటే.. నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్య మూడేళ్లలో 3 లక్షలకు మాత్రమే చేరింది. దీనివల్ల మెయింటనెన్స్‌ ఖర్చులు తడిసిమోపెడయ్యాయి. ఫలితంగా ఏడాదికి 50 మిలియన్‌ డాలర్లకు పైగా నష్టం వచ్చేది. దీంతో ఈ నష్టాన్ని పూడ్చుకోవటానికి కంపెనీ ఓనర్లయిన హ్యాస్టింగ్స్‌ మరియు ర్యాండోల్ఫ్‌.. బ్లాక్‌ బ్లస్టర్‌ కంపెనీకి ఒక ప్రపోజల్‌ పెట్టారు. తమ సంస్థను 50 మిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేయాలని కోరారు.

ఫిజికల్‌ స్టోర్లను మీరు చూసుకోండి.. ఆన్‌లైన్‌ బిజినెస్‌ మేం చూసుకుంటాం.. ఉమ్మడి సంస్థపై అధికారాలు మాత్రం ఇరువురికీ సమానంగా ఉంటాయని ప్రతిపాదించారు. కానీ.. దీనికి బ్లాక్‌ బస్టర్‌ CEO జాన్ ఆంటియోకో ఒప్పుకోలేదు. నెట్‌ఫ్లిక్స్‌ ఓనర్ల నిస్సహాయతను చూసి ఫక్కున నవ్వాడు. కానీ.. నవ్విన నాప చేనే పండుతుందని ఊహించలేకపోయాడు. నెట్‌ఫ్లిక్స్‌.. బ్లాక్‌ బస్టర్‌ మనుగడకు ప్రమాదకరంగా మారుతుందని అంచనా వేయలేకపోయాడు.

ఫండ్స్‌ కోసం నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ 2002వ సంవత్సరం నాటికి పబ్లిక్‌ ఆఫరింగ్‌కి వెళ్లింది. తర్వాత ఏడాదికి సబ్‌స్క్రైబర్ల సంఖ్య 10 లక్షలకు చేరింది. అలా.. దినదిన ప్రవర్థమానమైంది. మరో వైపు.. బ్లాక్‌ బస్టర్‌.. నెట్‌ఫ్లిక్స్‌ని చూసి నేర్చుకునే పరిస్థితి వచ్చింది. దీంతో.. లేట్‌ ఫీజు విధానానికి గుడ్‌బై చెప్పింది. కానీ.. అప్పటికే జనానికి ఆ సంస్థపై విరక్తి కలిగింది. లేట్‌ ఫీజును క్యాన్సిల్‌ చేసినప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. లేట్‌ ఫీజును రద్దు చేయటంతో బ్లాక్‌ బస్టర్‌ నష్టాల బాట పట్టింది.

నెట్‌ఫ్లిక్స్‌పై పైచేయి సాధించేందుకు బ్లాక్‌ బస్టర్‌ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీనికితోడు కంపెనీని విస్తరించాలనే ఆశతో.. అంటే.. స్టోర్ల సంఖ్యను పెంచే క్రమంలో భారీగా రుణాలు తీసుకున్నారు. ఒక వైపు ఆదాయం పెరగకపోగా మరో వైపు అప్పులు భారంగా మారాయి. తిరిగి చెల్లించటం శక్తికి మించిన పనైంది. బ్లాక్‌ బస్టర్‌ను గట్టెక్కించేందుకు వాటాలు కొనుగోలు చేసినవాళ్లు లేట్‌ ఫీజు విధానాన్ని మళ్లీ మొదలుపెట్టారు. కాలం మనది కానప్పుడు ఏం చేసినా ముందడుగు పడదు. 2008 నాటి ఆర్థిక సంక్షోభానికి బ్లాక్‌ బస్టర్‌ నిండా మునిగింది. దివాలా తీసింది. ఇది పరోక్షంగా నెట్‌ఫ్లిక్స్‌కి బాగా ప్లస్‌ అయింది. తర్వాత చరిత్ర మనందరికీ తెలిసిందే.