Site icon NTV Telugu

బిల్‌గేట్స్, జెఫ్ బెజోస్‌పై ట్రోలింగ్స్… ఇచ్చి పడేస్తున్న నెటిజన్‌లు

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ తన 66వ పుట్టినరోజును టర్కీ తీరంలోని సూపర్ యాచ్‌లో జరుపుకున్నారు. బిల్‌గేట్స్ తన పుట్టినరోజు పార్టీకి పిలిచిన 50 మంది అతిథుల్లో ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కూడా ఉన్నారు. ముఖ్యంగా బిల్‌గేట్స్ ఆహ్వానించిన ఈ పార్టీకి వెళ్లేందుకు బెజోస్ ప్రైవేట్ హెలికాప్టర్ వినియోగించారని డైలీ మెయిల్ ఓ కథనం ప్రచురించింది. అందుకోసం బెజోస్ 120 మైళ్ల దూరం ప్రయాణించారని అందులో పేర్కొంది. అయితే బెజోస్ ప్రయాణించిన హెలికాప్టర్ భారీస్థాయిలో కార్బన్ ఉద్గారాలను గాలిలో విడుదల చేసినట్లు సదరు కథనంలో ఆరోపించింది. దాదాపుగా బెజోస్ ప్రయాణించిన హెలికాప్టర్ 215 పౌండ్ల కార్బన్ డై ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేసినట్లు వివరించింది. ఓ విలాసవంతమైన పార్టీ కోసం బెజోస్ వాతావరణ కాలుష్యానికి కారణమయ్యాడని తీవ్ర విమర్శలు చేసింది.

దీంతో సోషల్ మీడియాలో బిల్‌గేట్స్, బెజోస్‌పై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తూ వారిని ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే నెటిజన్‌ల ఆగ్రహానికి కూడా కారణముంది. ఇటీవల వాతావరణంపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న బిల్‌గేట్స్, బెజోస్ వాతావరణ పరిరక్షణకు సంబంధించి పలు కీలకమైన అంశాలను మాట్లాడారు. ప్రపంచ దేశాలు వాతావరణాన్ని కాపాడాల్సిన ఆవశ్యకతను వివరించారు. దీంతో బెజోస్ లాంటి కపటవాదులు ఒకవైపు సూక్తులు మాట్లాడుతూ.. మరోవైపు కార్బన ఉద్గారాలకు కారణమవుతున్నారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. నాలుగు గంటలు జరిగే బిల్‌గేట్స్ బర్త్ డే పార్టీ కోసం భారీ స్థాయిలో ప్రైవేట్ హెలికాప్టర్లు వినియోగించారని.. వాటి బదులు బస్సులు వినియోగించి ఉంటే విలువను కాపాడుకునేవారని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

Exit mobile version