NTV Telugu Site icon

Axis Bank: స్టాక్ ట్రేడింగ్ స్కామ్‌ పేరుతో మోసం.. రూ.97 కోట్లు నొక్కేసిన మేనేజర్ బృందం

Axisbank

Axisbank

బెంగళూరులో స్టాక్ మార్కెంటింగ్ పేరుతో రూ. 97 కోట్ల కుంభకోణానికి పాల్పడిన యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ మరియు ముగ్గురు సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లతో సహా ఎనిమిది మందిని బెంగళూరు పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వీళ్లంతా స్టాక్ ట్రేడింగ్‌కు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితులు స్టాక్ ఇన్వెస్ట్‌మెంట్ల ద్వారా భారీ రాబడిని సంపాదించవచ్చంటూ ఖాతాదారులను మోసం చేశారు. ఆరు బ్యాంకు ఖాతాల ద్వారా నిందితులు రూ.97 కోట్లు నొక్కేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఈ స్కామ్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా 254 కేసులు నమోదైనట్లు సైబర్ క్రైమ్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. బ్యాంకు సిబ్బంది ప్రారంభించిన ఆరు బ్యాంకు ఖాతాల ద్వారా రూ.97 కోట్ల మోసపూరిత లావాదేవీలు జరిగాయని పేర్కొన్నారు. అరెస్టయిన వారిని పశ్చిమ బెంగళూరులోని యాక్సిస్ బ్యాంక్ నాగరభావి బ్రాంచ్‌లో బ్యాంక్ మేనేజర్ కిషోర్ సాహు, సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు మనోహర్, కార్తీక్, రాకేష్‌లుగా పోలీసులు గుర్తించారు. మ్యూల్ అకౌంట్లు నిర్వహించిన లక్ష్మీకాంత, రఘురాజ్, కెంగేగౌడ, మాల సీపీని కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ కుంభకోణంపై యాక్సిస్ బ్యాంక్ ప్రతినిధి ఒక ప్రకటనలో ఇలా అన్నారు. ‘‘ఈ విషయం ప్రస్తుతం విచారణలో ఉంది. ప్రక్రియను వేగవంతం చేయడానికి దర్యాప్తు అధికారులకు యాక్సిస్ బ్యాంక్ పూర్తిగా సహకరిస్తోంది.’’ అని తెలిపారు.

ఉత్తర బెంగళూరులోని యలహంక నివాసి మార్చిలో ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభమైంది. స్టాక్ ట్రేడింగ్ చిట్కాలను అందించిన వాట్సాప్ గ్రూప్‌లో తనను జోడించారని, ట్రేడింగ్ ఖాతాలో పెట్టుబడికి 10 రెట్లు రాబడి వస్తుందని ఆ వ్యక్తి ఫిర్యాదులో పేర్కొన్నాడు.