Ayush Singh: డిగ్రీ లేదు.. ఉద్యోగం లేదు.. కానీ ఏఐ (AI) తో నెలకు రూ.కోటి సంపాదన! ఎలాగో తెలుసా?

Ayush Singh

Ayush Singh

Ayush Singh: ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (AI) అనే పదం మారుమోగిపోతోంది. ప్రపంచాన్ని టెక్నాలజీ శాసిస్తున్న ఈ తరుణంలో.. కేవలం ఒక 19 ఏళ్ల భారతీయ యువకుడు ఏఐ ద్వారా నెలకు ఏకంగా రూ.కోటి సంపాదిస్తున్నాడనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపిస్తోంది. ఆయుష్ సింగ్ అనే ఈ కుర్రాడి విజయగాథ ఇప్పుడు లక్షలాది మంది యువతకు స్ఫూర్తినిస్తోంది. మనోడి కథలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆయుష్ సింగ్‌కి ఐఐటీ (IIT) లేదా ఎంఐటీ (MIT) వంటి ఎలాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లోనూ డిగ్రీ లేదు. కేవలం తన సొంత ఇంట్రస్ట్‌తో, ఇంటర్నెట్ సాయంతో ఏఐ, మెషిన్ లెర్నింగ్ రంగాలపై పట్టు సాధించాడు. సాధారణంగా 13 ఏళ్ల వయసులో పిల్లలు ఆటపాటల్లో మునిగితేలుతుంటారు. కానీ ఆయుష్ మాత్రం ఆ చిన్న వయసులోనే కోడింగ్, మెషిన్ లెర్నింగ్ లోతుపాతులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. ముఖ్యంగా లాక్‌డౌన్ సమయంలో దొరికిన ఖాళీ టైంని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్వేషణకు పూర్తిగా ఉపయోగించుకున్నాడు.

కోటీశ్వరుడిని చేసిన ‘టాప్‌మేట్’ బిజినెస్ మోడల్

ఓర్పు, నేర్చుకోవాలనే పట్టుదల ఆయుష్‌కి ఏఐ రంగంలో అపారమైన జ్ఞానాన్ని సంపాదించి పెట్టింది. ఇదే సమయంలో ఆయన తాను నేర్చుకున్న విద్యను ఇతరులకు కూడా నేర్పించాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా ఏఐ, మెషిన్ లెర్నింగ్, నూతన సాంకేతికతలపై ఆన్‌లైన్ కోర్సులను స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం ఆయుష్ తన ఏఐ కోర్సులను ప్రసిద్ధ మెంటార్‌షిప్ ప్లాట్‌ఫామ్ ‘టాప్‌మేట్’ (Topmate) ద్వారా విక్రయిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న వేలాది మంది విద్యార్థులు, నిపుణులు భారీగా ఫీజులు చెల్లించి ఇతని కోర్సుల్లో చేరుతున్నారు. ఈ కోర్సులు నేర్పడం ద్వారా అతనికి లక్షల నుంచి ఏకంగా కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నట్లు తెలుస్తోంది.

×
×
Ad

ఆయుష్ సింగ్ సాధించిన ఈ అరుదైన విజయంపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి కామెంట్స్ చేస్తున్నారు. 19 ఏళ్లకే ఈ స్థాయికి ఎదగడం సామాన్యమైన విషయం కాదని, దేశ యువతకు ఆయుష్ ఒక రోల్ మోడల్ అని చాలా మంది కొనియాడుతున్నారు. ఇదే సమయంలో మరికొందరు నెట్టిజన్లు ఈ వార్తలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఒక పెద్ద “కోర్సుల అమ్మకం మోసం” అని విమర్శిస్తున్నారు. అతను ఏఐ టెక్నాలజీని ఉపయోగించి వ్యాపారం చేయడం లేదని, కేవలం ఏఐ నేర్పిస్తానంటూ కోర్సులు అమ్మి సొమ్ము చేసుకుంటున్నాడని కొందరు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఈ కోర్సులు కూడా నాణ్యంగా లేవని, ఇదంతా కేవలం పబ్లిసిటీ స్టంట్ అని కొందరు పెదవి విరుస్తున్నారు. ఈ విమర్శలు ఎలా ఉన్నప్పటికీ, సాంకేతికతను అందిపుచ్చుకుని ఇంత చిన్న వయసులో కోట్ల రూపాయల టర్నోవర్ సాధించిన ఆయుష్ సింగ్ ఉదంతం మాత్రం ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.