Amazon layoffs 2026: ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ కంపెనీలలో ఒకటైన అమెజాన్ మరోసారి భారీగా లేఆఫ్స్ ప్రకటించనుంది. వచ్చే వారం నుంచే కంపెనీ రెండో విడత ఉద్యోగాల తొలగింపునకు సిద్ధమవుతున్నట్లు సమాచారం అందింది. మొత్తం మీద సుమారు 30 వేల మంది కార్పొరేట్ ఉద్యోగులను తగ్గించాలనే లక్ష్యంతో అమెజాన్ ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే గతేడాది అక్టోబర్‌లోనే అమెజాన్ దాదాపు 14 వేల మంది వైట్ కాలర్ ఉద్యోగులను తొలగించింది. ఇప్పుడు జరగబోయే ఈ రెండో విడతలోనూ దాదాపు అంతే సంఖ్యలో ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని కంపెనీకి చెందిన వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రక్రియ మంగళవారం నుంచే ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయం గురించి అమెజాన్ అధికారికంగా ప్రకటించలేదు. అమెజాన్ ప్రతినిధి స్పందించేందుకు నిరాకరించారు.
READ MORE: Barabar Premista: ఫిబ్రవరి 6న యాటిట్యూడ్ స్టార్ బరాబర్ ప్రేమిస్తా!
ఈ ఉద్యోగాల కోత ప్రభావం అమెజాన్ వెబ్ సర్వీసెస్, రిటైల్ వ్యాపారం, ప్రైమ్ వీడియో, అలాగే హ్యూమన్ రిసోర్సెస్ విభాగాలపై పడే అవకాశముందని సమాచారం. అయితే ఎంతమంది ఉద్యోగులు ఏ విభాగంలో ప్రభావితమవుతారన్న పూర్తి వివరాలు ఇంకా స్పష్టంగా లేవు. చివరి నిమిషంలో కంపెనీ నిర్ణయాలు మారే అవకాశం ఉందని ఆ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఏఐ కారణంగా ఉద్యోగాలు తొలగిస్తున్నామని గత ఏడాది లేఆఫ్స్‌లో భాగంగా కంపెనీ వివరణ ఇచ్చింది. ఏఐ వల్ల సంస్థలు వేగంగా కొత్త మార్పులు తీసుకురాగలుగుతున్నాయని కంపెనీ అంతర్గత లేఖలో ప్రస్తావించింది. కంపెనీ సీఈవో ఆండీ జాసీ గతంలో మాట్లాడుతూ.. అసలు సమస్య కంపెనీలో పెరిగిపోయిన అధిక స్థాయి అధికార వ్యవస్థ అని చెప్పారు. మేనేజ్‌మెంట్ వల్ల అవసరానికి మించి ఉద్యోగులు చేరారు.. తగ్గించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇప్పటికే 2025 ప్రారంభంలోనే ఏఐ వల్ల పనులు వేగంగా పూర్తవుతుండటంతో, కార్పొరేట్ ఉద్యోగుల సంఖ్య క్రమంగా తగ్గుతుందని గుర్తు చేశారు.
READ MORE: How to Remove Shoe Odour: షూ వాసన ఇబ్బంది పెడుతుందా..? ఉతకకుండానే ఇలా వదిలించుకోవచ్చు..
ఈ మధ్య కాలంలో చాలా పెద్ద కంపెనీలు ఏఐ సాయంతో సాఫ్ట్‌వేర్ కోడ్ రాయించడం, రోజువారీ పనులను ఆటోమేటిక్‌గా చేయించడం మొదలుపెట్టాయి. దీని వల్ల ఖర్చులు తగ్గుతాయని, మనుషులపై ఆధారపడటం తగ్గుతుందని భావిస్తున్నాయి. అమెజాన్ కూడా గత డిసెంబర్‌లో జరిగిన తన క్లౌడ్ కాన్ఫరెన్స్‌లో కొత్త ఏఐ మోడళ్లను పెద్దగా ప్రదర్శించింది. మొత్తం 30 వేల ఉద్యోగాల కోత అమెజాన్‌లో పనిచేస్తున్న 15 లక్షల మందిలో చిన్న శాతమే అయినా, కార్పొరేట్ ఉద్యోగుల్లో దాదాపు 10 శాతం వరకు ప్రభావం చూపనుంది. అమెజాన్‌లో ఎక్కువ మంది ఉద్యోగులు గోదాములు, డెలివరీ కేంద్రాల్లో పనిచేస్తున్నారు. అయితే కార్పొరేట్ స్థాయిలో ఇది కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద ఉద్యోగాల తొలగింపుగా నిలవనుంది. ఇంతకు ముందు 2022లో సుమారు 27 వేల ఉద్యోగాలను అమెజాన్ తగ్గించింది. మొత్తానికి ఇక్కడ పోయేది 30 వేల ఉద్యోగాలు కాదు. 30 వేల కుటుంబాల జీవనాధారం..
