Amazon Layoffs 2026: అమెజాన్‌లో మరోసారి ఉద్యోగాల కోత.. పొద్దు పొద్దున్నే 250 మంది ఉద్యోగులకు షాక్!

  • అమెజాన్‌లో 250 ఉద్యోగాలకు కోత
  • సాఫ్ట్‌వేర్ టీమ్‌లపై ప్రభావం
Amazon

Amazon

Amazon Layoffs 2026: టెక్ దిగ్గజం అమెజాన్ మరోసారి ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. ఈ నెలలో రెండోసారి తొలగింపులను ప్రకటించిన సంస్థ, తన డివైసెస్ అండ్ సర్వీసెస్ విభాగంలో సుమారు 250 ఉద్యోగులను తొలగిస్తోంది. అంతకుముందు ఈ నెలలోనే కంపెనీ ప్రధాన రిటైల్ వ్యాపార విభాగంలో దాదాపు 1,000 ఉద్యోగాలను తగ్గించింది. ఈ పరిణామంతో టెక్ రంగంలో ఉద్యోగ భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఈసారి తొలగింపుల్లో ప్రధానంగా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ బృందాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రభావితమయ్యారు. కంపెనీ తన పనితీరును మరింత సమర్థవంతంగా మార్చుకోవడం, భవిష్యత్తు ఉత్పత్తుల ప్రణాళికలకు అనుగుణంగా సంస్థాగత నిర్మాణాన్ని మార్చుకోవడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఉద్యోగులకు బుధవారం ఉదయం ఈమెయిల్, టెక్స్ట్ మెసేజ్‌ల ద్వారా తొలగింపుల గురించి సమాచారం అందించినట్లు నివేదిక తెలిపింది. అమెజాన్ డివైసెస్ అండ్ సర్వీసెస్ విభాగంలో మానవ వనరుల ఉపాధ్యక్షురాలు చెరి రాబిన్సన్ పంపిన సందేశంలో, సంస్థాగత నిర్మాణాన్ని సమగ్రంగా సమీక్షించిన తర్వాత కొన్ని ఉద్యోగాలను తొలగించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారని రాయిటర్స్ వెల్లడించింది. ఈ నిర్ణయం ఉద్యోగుల్లో ఆందోళనకు కారణమైంది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, కొత్త ఉత్పత్తుల రూపకల్పన వంటి విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందిపై ఈ కోతల ప్రభావం ఉండనుంది.

రాయిటర్స్ ప్రశ్నలకు స్పందించిన అమెజాన్ ప్రతినిధి ఉద్యోగాల కోతను ధృవీకరించినట్లు వెల్లడించింది. సంస్థలో కొంతమంది ఉద్యోగుల స్థానాలను తొలగించడం కష్టమైన నిర్ణయమని కంపెనీ తెలిపింది. పనితీరును మెరుగుపరచడం, సంస్థలోని వనరులను సమర్థంగా వినియోగించడం, ఉత్పత్తుల ప్రణాళికలకు అనుగుణంగా బృందాలను సిద్ధం చేయడం ఈ మార్పుల ప్రధాన ఉద్దేశమని అమెజాన్ వివరించింది. ఈ ఏడాది జనవరిలో అమెజాన్ సుమారు 16,000 ఉద్యోగాల కోతను ప్రకటించింది. అంతకుముందు 2025 అక్టోబర్‌లో దాదాపు 14,000 ఉద్యోగాలను తగ్గించింది.

విశేషమేమిటంటే, అమెజాన్ తన కిండిల్ ఈ-రీడర్లు, టాబ్లెట్లు వంటి ఉత్పత్తులను పరిచయం చేసిన కొన్ని వారాలకే ఈ తాజా లేఆఫ్స్ చోటుచేసుకున్నాయి. బుధవారం అలెక్సా సదుపాయం కలిగిన కొత్త అలారం గడియారం, ఫోటో ఫ్రేమ్‌ను కూడా కంపెనీ ప్రకటించింది. కొత్త ఉత్పత్తులపై దృష్టి పెడుతూనే సంస్థలోని బృందాల నిర్మాణాన్ని మార్చడం ద్వారా ఖర్చులను నియంత్రించడం, ఉత్పాదకతను పెంచడం కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

టెక్ రంగంలో ఉద్యోగాల కోతల వివరాలను సేకరించే ట్రూఅప్ సంస్థ గణాంకాల ప్రకారం, 2026లో అప్పటివరకు 670 టెక్ కంపెనీలు ఉద్యోగాల కోతలను ప్రకటించాయి. దీంతో 1,97,123 మంది ఉద్యోగులు ప్రభావితమైనట్లు నివేదిక పేర్కొంది. అంటే సగటున రోజుకు 655 మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. 2025లో 783 టెక్ కంపెనీలు కలిపి 2,45,953 ఉద్యోగాల కోతలను ప్రకటించినట్లు అదే నివేదికలో పేర్కొన్నారు. ఆ ఏడాది సగటున రోజుకు 674 మంది ఉద్యోగాల కోతల వల్ల ప్రభావితమయ్యారు.