Site icon NTV Telugu

Amazon Layoff Story: బహుశా జీవితం అంటే ఇదేనేమో ! లేఆఫ్‌కు బలైన ఉద్యోగి కన్నీటి కథ..

Amazon Layoff Story

Amazon Layoff Story

Amazon Layoff Story: ఈ రోజుల్లో సోషల్ మీడియా వాడని వారు ఉండరు అనేది అతిశయోక్తి అవుతుంది. ఎందుకంటే ప్రతిఒక్కరి జీవితంలో సోషల్ మీడియా వినియోగం అనేది జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఇదంతా ఎందుకు అంటే.. తాజాగా సోషల్ మీడియాలో ఒకరి పోస్ట్ వైరల్‌గా మారింది. వాస్తవానికి ఆయన కథ ప్రజలను కదిలించింది. ఇంతకీ ఆ కథ ఏంటో తెలుసా.. ఐటీ రంగంలో కొనసాగుతున్న తొలగింపులు, వేతన కోతల మధ్య.. 17 ఏళ్ల పాటు కంపెనీ కోసం పని చేసిన ఓ మాజీ అమెజాన్ ఉద్యోగి కథ. వాస్తవానికి ఆయన తన ఉద్యోగం కోల్పోయిన తర్వాత జీవితంలో కోల్పోయింది ఏంటో ఈ కథలో అందరికీ అర్థం అయ్యేలా చెప్పారు.. ఆయన కన్నీళ్లతో లిఖించిన ఆ కథలో ఏముందో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

READ ALSO: Rajnath Singh: సైన్యానికి కుల మతాలు లేవు.. రాహుల్‌గాంధీపై రక్షణ మంత్రి ఆగ్రహం..

ఉద్యోగం పోయిన తర్వాత కన్నీళ్లు పెట్టుకున్నా..
బ్లైండ్ అనే ప్లాట్‌ఫామ్‌లో ఆయన షేర్ చేసిన పోస్ట్‌లో.. ఆ కంపెనీ కోసం నేను 17 ఏళ్లు నిరంతరం పనిచేశానని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఆయన మాటల్లో కథ.. ‘నేను ఎప్పుడూ సెలవు తీసుకోలేదు, ఎప్పుడూ పనిని నిర్లక్ష్యం చేయలేదు. అలసట కారణంగా పిల్లలతో ఆడుకోలేక పోయినా, డిన్నర్ టేబుల్ వద్ద నా వాళ్లతో కూర్చోలేక పోయినా, నా కుటుంబం కోసమే నేను ఇలా చేస్తున్నానని నాకు నేను సర్ది చెప్పుకున్నాను. లేఆఫ్ ఇమెయిల్ వచ్చినప్పుడు, అన్నీ వదిలేసి ఏడవడం ప్రారంభించాను. దాదాపు గంట తర్వాత, నన్ను నేను ప్రశాంతంగా ఉంచుకోడానికి ప్రయత్నించాను. ఆ తర్వాత నా భార్యకు అల్పాహారం తయారు చేయడంలో సహాయం చేసి, నా పిల్లలను పాఠశాలకు దింపడానికి వెళ్ళాను. ఆ రోజు నేను నా కుటుంబ సభ్యులు నవ్వుతూ ఉండటం నిజంగా చూశా. అప్పుడు అనిపించింది బహుశా జీవితం అంటే ఇదేనేమో అని.. తర్వాత నా భార్య కేప్‌ను పిలిచి నా జాబ్ పోయిన వార్త చెప్పాను. మొదట తను షాక్‌కు గురైంది, కానీ ఆమె తర్వాత నన్ను ఓదార్చింది. అప్పుడు తను ఏం చెప్పిందో తెలుసా.. మనం కలిసి ఈ సమస్యను అధిగమిస్తామని చెప్పింది”. తాను అత్యంతం దీన స్థితిలో ఉన్నప్పుడు కేప్.. తనకు ధైర్యంగా నిలిచిందని ఆయన తన పోస్ట్‌లో వెల్లడించారు.

“ఇప్పుడు నేను నా జీవితాన్ని భిన్నంగా గడపాలి”..
అయితే తాను ఇప్పుడు ఈ ఎదురుదెబ్బను ఒక కొత్త అవకాశంగా చూస్తున్నట్లు చెప్పాడు. “తరువాత ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఉద్యోగ మార్కెట్ కఠినంగా ఉందని అందరూ అంటున్నారు. కానీ గత 17 సంవత్సరాలుగా నేను జీవించిన విధంగా నా జీవితాన్ని గడపాలని నేను కోరుకోవడం లేదు. ఇప్పుడు నాకు శాంతిని కలిగించేది ఏదైనా చేయాలనుకుంటున్నాను”. ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఆయన పోస్ట్‌కు వేలాది స్పందనలు వచ్చాయి. “ధృఢంగా ఉండండి. ఇది ముగింపు కాదు. మిమ్మల్ని మీరు నిందించుకోకండి” అని రిప్లై ఇచ్చారు.

ఈ పోస్ట్‌కి వేలాది మంది స్పందించారు. ఈ పోస్ట్ జీవితాన్ని సరళంగా ఉంచుకోవడం ముఖ్యమని తమకు గుర్తు చేస్తుందని ఒక యూజర్ కామెంట్ చేశారు. మరొకరు లేఆఫ్‌లను ఒక అవకాశంగా, తమను తాము తిరిగి ఆవిష్కరించుకునే సమయంగా పరిగణించాలని అన్నారు. కష్టపడి పనిచేసే చాలా మంది ఇప్పటికీ తమ పిల్లలను పాఠశాలలో వదిలివేసి, వారి కుటుంబాలతో సమయం గడుపుతున్నారని మూడవ వ్యక్తి రాశారు… పని ఒక సాకుగా ఉండకూడదని ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇటీవల అమెజాన్ AI ప్రాజెక్టులపై దృష్టి పెట్టడానికి కంపెనీలో సామూహిక తొలగింపులను నిర్వహించిన విషయం తెలిసిందే. దీంతో వేలాది మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఈ భావోద్వేగ పోస్ట్ ఉద్యోగం కోల్పోవడం కేవలం ఆర్థిక దెబ్బ మాత్రమే కాదు, జీవితంపై మీ దృక్పథాన్ని కూడా మార్చగలదని చెబుతుందని విశ్లేషకులు పేర్కొన్నారు.

READ ALSO: American Politics: అగ్రరాజ్యంలో ముస్లింల ఆధిపత్యం..? క్రైస్తవ దేశంలో నయా చరిత్ర!

Exit mobile version