ప్రముఖ విమానయాన సంస్థ ‘ఎయిర్ ఇండియా’ తమ ప్రయాణికులకు షాక్ ఇచ్చేలా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా విమాన ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోతుండటం, నిర్వహణ వ్యయం భారంగా మారడంతో తన దేశీయ విమాన సర్వీసులను భారీగా తగ్గించుకుంటున్నట్లు ప్రకటించింది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. ఎయిర్ ఇండియా తన దేశీయ సర్వీసులలో ఏకంగా 20 నుంచి 22 శాతం వరకు విమానాలను రద్దు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఈ సంస్థ, ఇప్పటికే తన అంతర్జాతీయ సర్వీసులను కూడా దాదాపు 27 శాతం మేర తగ్గించిన సంగతి తెలిసిందే. ఎయిర్ ఇండియా నెట్‌వర్క్ పరిధిని పరిశీలిస్తే, సంస్థ ప్రతి వారం దాదాపు 4,400 విమాన సర్వీసులను నడుపుతోంది. దేశీయ సర్వీసులు వారానికి సుమారు 3,600 విమానాల, అంతర్జాతీయ సర్వీసులు వారానికి సుమారు 800 విమానాలు నడుపుతున్నారు. ప్రస్తుత నిర్ణయం ప్రకారం.. వారానికి నడిచే 3,600 దేశీయ విమాన సర్వీసులలో సుమారు 22 శాతం వరకు కోత పడనుంది.
ఎయిర్ ఇండియా అధికారిక ప్రకటన..
ఈ తాత్కాలిక మార్పులపై ఎయిర్ ఇండియా బుధవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. జూన్, ఆగస్టు 2026 మధ్య కాలానికి సంబంధించి ఇప్పటికే అంతర్జాతీయ సర్వీసులలో కొన్ని సర్దుబాట్లు చేశామని, దానికి కొనసాగింపుగానే ఇప్పుడు దేశీయ రూట్లలో కూడా కార్యకలాపాలను తాత్కాలికంగా క్రమబద్ధీకరిస్తున్నామని స్పష్టం చేసింది. ఎంపిక చేసిన కొన్ని నిర్దిష్ట మార్గాలలో మాత్రమే విమానాల ఫ్రీక్వెన్సీని తగ్గిస్తున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. నిరంతరం పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావం వల్లే ఈ కఠిన నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని ఎయిర్ ఇండియా యాజమాన్యం పేర్కొంది. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాక, మార్కెట్ డిమాండ్, నిర్వహణ పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తూ.. రద్దు చేసిన విమాన సర్వీసులను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటామని సంస్థ తెలిపింది.
