సోమవారం ‘వాల్ ఆఫ్ షేమ్’ సందర్భంగా జరిగిన వాడీ వేడీ చర్చలకు బిగ్ బాస్ తెలివిగా ముగింపు పలికాడు. ‘అమెరికా అబ్బాయి – హైదరాబాద్ అమ్మాయి’ స్కిట్ లో ఒక్కొక్కరికీ ఒక్కో సూటబుల్ పాత్ర ఇచ్చాడు. అందరూ కలిసి మెలిసి ఆ స్కిట్ చేసేలా ప్లాన్ చేయడంతో హౌస్ లో మళ్ళీ ఓ సందడి వాతావరణం నెలకొంది. బుధవారం బిగ్ బాస్ ఎపిసోడ్ లో ఆ హంగామా బాగా కనిపించింది. క్యారెక్టర్స్ నుండి కాసేపు బయటకు వచ్చి, ఎవరికి వారు తమ పెర్ఫామెన్స్ గురించి ఇతరులతో చర్చించినా… అది పెద్దంత వివాదాలకు దారితీయలేదు. అయితే.. స్కిట్ లో భాగంగానే షణ్ముఖ్… శ్వేతవర్మ ఏరొగెన్సీని గుర్తు చేస్తూ కామెంట్ చేయడంతో ఆమె హర్ట్ అయ్యింది. స్కిట్ నుండి ఓ ఐదు నిమిషాలు విరామం తీసుకుంది. దాంతో షణ్ముఖ్ శ్వేతకు సారీ చెప్పాడు. ‘నువ్వు చేసిన తప్పు ఏమీ లేదు’ అంటూ లోబో షణ్ముఖ్ ను వారించినా… అతను మాత్రం శ్వేతకు సారీ చెప్పడానికే సిద్ధపడటం విశేషం. సోమవారం ఒకరిపై ఒకరు వాగ్బాణాలు సంధించుకున్న ప్రియ, లహరి… ఈ స్కిట్ లో అత్త – కోడళ్ళుగా జీవించేశారు. అందులో భాగంగానే ప్రియ, లహరితో కాళ్ళు ఒత్తించుకోవడం, కాళ్ళకు దండం పెట్టించుకోవడం కొసమెరుపు.
Read Also : బిగ్ బాస్ హౌస్ లో ‘అమెరికా అబ్బాయి – హైదరాబాద్ అమ్మాయి’
లహరిని పెళ్ళాడటానికి ఇండియా వచ్చిన ఎన్.ఆర్.ఐ. గా నటించిన శ్రీరామ్ ఒకే సమయంలో ఇటు సిరి, అటు హమీదలతో లవ్ ట్రాక్ నడపడం రక్తి కట్టింది. ఇక లహరిని ప్రేమించిన పక్కింటి కుర్రాడు మానస్… పెద్దలు కుదిర్చిన పెళ్ళిని చెడగొడితే… పెళ్ళిళ్ల పేరయ్య షణ్ముఖ్ కు ఏకంగా కోటి రూపాయలు ఆఫర్ చేయడం అనేది కాస్తంత ఓవర్ గా అనిపించింది. ఇక షణ్ముఖ్ – శ్వేత – లోబో ట్రైయాంగిల్ లవ్ స్టోరీ నడపడం కూడా బాగానే ఉంది. చివరకు ఎవరూ ఊహించని విధంగా ‘అమెరికా అబ్బాయి – హైదరాబాద్ అమ్మాయి’ శ్రీరామ్ – లహరి వివాహంతో కథ సుఖాంతమైంది. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ మూవీ టైటిల్ సాంగ్ తో ఈ స్కిట్ కు బిగ్ బాస్ ముగింపు పలికాడు.
నిజానికి ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. బిగ్ బాస్ కెప్టెన్సీ కోసం ఈ స్కిట్ లో బాగా పెర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళకు కెప్టెన్ గా ఛాన్స్ ఇస్తాడనే పుకారు ఒకటి హౌస్ లో చక్కర్లు కొట్టడం మొదలైంది. దాంతో ఎవరికి వారు తామే బాగా చేశామని ఇన్ డైరెక్ట్ గా బిల్డప్ ఇవ్వడం మొదలు పెట్టారు. అయితే… కొందరు మాత్రం అందరికంటే రవి పెర్ఫార్మెన్స్ బాగుందనే అభిప్రాయానికి వచ్చారు. బిగ్ బాస్ హౌస్ లోని సభ్యుల పెర్ఫార్మెన్స్ గురించి అంత పట్టించుకుంటాడో లేదో తెలియదు కానీ వాళ్ళు మాత్రం రకరకాల ఊహాగానాలు మొదలు పెట్టేశారు. అందరూ నిద్రలోకి జారుకున్నా, రాత్రి 1.30కి హమిదా, విశ్వ మాత్రం మేలుకుని ఉండి, ఒక్కొక్కరి గురించి తమ తమ మనసులోని మాటలను బయటపెట్టారు.
బిగ్ బాస్ ఇంటి దొంగ రవి!
యాంకర్ రవి… ‘అమెరికా అబ్బాయి – హైదరాబాద్ అమ్మాయి’ స్కిట్ లో పూర్తిగా ఇన్ వాల్వ్ అయిన సమయంలోనే బిగ్ బాస్ అతనికో సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. ప్రియా కు సంబంధించిన నెక్లెస్ ను ఎవరికీ తెలియకుండా దొంగిలించమని, ఆ విషయంలో అతను సక్సెస్ అయితే… కెప్టెన్సీ టాస్క్ లో అతన్ని పరిగణనలోకి తీసుకుంటామని బిగ్ బాస్ చెప్పాడు. దాంతో ఎవరూ లేని సమయంలో ప్రియా బెడ్ దగ్గరకు వెళ్ళి ఆమె నెక్లెస్ ను రవి తీసుకుని, వేరే చోట దాచిపెట్టాడు. ఈ విషయం తెలియని ప్రియా… రాత్రి నుండి నెక్లెస్ కోసం వెదుకులాట మొదలు పెట్టింది. మరి రవి ఈ సీక్రెట్ టాస్క్ లో సక్సెస్ అవుతాడో లేదో చూడాలి!