బిగ్ బాస్ సీజన్ 5 లో మూడో వారం కెప్టెన్ గా ఎవరూ ఊహించని విధంగా జస్వంత్ (జెస్సీ) విజేతగా నిలవడం విశేషం. దీనికి ముందు రోజున ప్రియ నెక్లెస్ ను దొంగిలించమని రవికి బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. అందులో అతను సక్సెస్ కావడంతో రవిని కెప్టెన్సీ పోటీదారుల జాబితాలో చేర్చారు. ఇక దానికి ముందు రెండు రోజుల పాటు ఆడిన ‘అమెరికా అబ్బాయి – హైదరాబాద్ అమ్మాయి’లో అబ్బాయి టీమ్ నుండి కెప్టెన్సీ టాస్క్ కోసం ఒకరిని, అమ్మాయి టీమ్ నుండి ఒకరిని ఎంపిక చేసుకోమని బిగ్ బాస్ కోరాడు. అబ్బాయిల టీమ్ నుండి శ్రీరామ్ పేరు, అమ్మాయిల టీమ్ నుండి జస్వంత్ పేరు వచ్చాయి. ఆ ఆటలోని మిగిలిన సభ్యులు శ్వేత వర్మ పేరును కెప్టెన్సీ టాస్క్ కు సజెస్ట్ చేశారు.
కెప్టెన్ ను ఎంపిక చేయడానికి రవి, శ్రీరామ్, జెస్సీ, శ్వేత వర్మతో బిగ్ బాస్ ‘స్విమ్ జరా స్విమ్’ ఆట ఆడించారు. ఒక్కొక్కరి టేబుల్ మీద కెప్టెన్ అనే అక్షరాల గడులను పెట్టి… స్విమ్మింగ్ పూల్ లోని ఆంగ్ల అక్షరాలను తీసుకొచ్చి ఆ ఖాళీ ప్రదేశాలను పూరించమని చెప్పాడు. దీనికి లోబో సంచాలకుడిగా వ్యవహరించాడు. ఈ పోటీలో జెస్సీ అందరికంటే ముందు తన టేబుల్ మీద ఉన్న కెప్టెన్ అనే అక్షరాలను సెట్ చేయడంతో అతనే కెప్టెన్ గా గెలిచాడని బిగ్ బాస్ ప్రకటించాడు. సిరి, విశ్వ తర్వాత కెప్టెన్ అయిన మూడో వ్యక్తిగా జెస్సీ నిలిచాడు. అతను రేషన్ మేనేజర్ గా షణ్ముఖ్ ను, కిచెన్ ఇన్ ఛార్జ్ గా ప్రియాంకను నియమించాడు. ఇదిలా ఉంటే… షణ్ముఖ్ తనను కావాలనే దూరం పెడుతున్నాడంటూ సిరి కన్నీళ్ళు పెట్టుకుంది. అతను తనతో మాట్లాడకపోవడంతో లోన్లీనెస్ ఫీల్ అవుతున్నానని వాపోయింది. బట్… షణ్ముఖ్ మాత్రం ఆమె పట్ల వ్యూహాత్మక మౌనం పాటిస్తుండటం విశేషం.
మరపురాని తొలి ప్రేమ!
కెప్టెన్సీ టాస్క్ పూర్తి కాగానే బిగ్ బాస్ మరో ఆట మొదలెట్టేశాడు. ‘మరపురాని తొలి ప్రేమ’ అనే పేరుతో బిగ్ బాస్ హౌస్ లోని సభ్యులంతా తమ జీవితంలోని తొలి ప్రేమ విశేషాలు చెప్పమని బిగ్ బాస్ కోరాడు. దాంతో షణ్ముఖ్ ఎనిమిదో తరగతి నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకూ తాను మౌనంగా ప్రేమించిన ఐషూ గురించి చెప్పాడు. సిరి… లివిన్ రిలేషన్ గడిపిన తర్వాత ఏర్పడిన మనస్పర్థల కారణంగా తాను కోల్పోయిన విష్ణు గురించి కన్నీళ్ళు పెట్టుకుంటూ తెలిపింది. విశ్వ తన తొలి ప్రేయసి సుమలత గురించి, ప్రియాంక… తాను గాఢంగా ప్రేమించిన రవి గురించి, యాని తనను పూర్తిగా అర్థం చేసుకున్న భర్త ప్రమోద్ గురించి చెప్పారు. రవి తాను వివాహమాడిన నిత్యే తొలి లవర్ అని స్పష్టం చేశాడు. నటరాజ్ తన భార్య నీతును ఫస్ట్ లవర్ అని చెప్పగా, జస్వంత్ ఇప్పటికీ తాను ప్రేమిస్తున్న చిన్ని గురించి చెప్పాడు. కేక్ అని ప్రేమగా తాను పిలుచుకునే భర్త గురించి ప్రియ తెలిపింది. ప్రేమతో పెళ్ళి చేసుకుని ఓ బాబుని కూడా కన్న తర్వాత ఇప్పుడు తన మేరిటల్ స్టేటస్ ఏమిటో అర్థం కావడం లేదని వాపోయింది. తాను మ్యారిడా? సింగిలా? డైవర్సీనా అనేది చెప్పకలేకపోతున్నానని ప్రియా ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే సందర్భంలో తాను ప్రేమించి పెళ్ళి చేసుకున్న బుజ్జి గురించి చెబుతూ, ఆ సమయంలో తల్లిదండ్రులను తెలియకుండానే ఎంత ఇబ్బంది పెట్టిందో కాజల్ తెలిపింది. లోబో కూడా తన ఫస్ట్ లవ్ శ్రుతిని గురించి చెబుతూ, తన భార్య తన కోసం చేసిన త్యాగాలను వివరించాడు. అప్పటికే సమాయాభావం అవ్వడంతో మిగిలిన వారి ‘మరపురాని తొలి ప్రేమ’లకు బిగ్ బాస్ కామా పెట్టాడు. సో… మిగిలిన వారి ఫస్ట్ లవ్ గురించి తెలియాలంటే మరో 24 గంటలు వేచి ఉండాల్సిందే!