NTV Telugu Site icon

Maha shivaratri: శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ ఎందుకు చేయాలి?

మహాశివరాత్రి పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. అందుకే శివరాత్రి పర్వదినం రోజు శివయ్య భక్తులు ఉపవాసం, జాగరణ చేస్తుంటారు. అయితే చాలా మందికి శివరాత్రి రోజు ఉపవాసం ఎందుకు చేయాలనే సందేహాలు తలెత్తుతుంటాయి. పరమేశ్వరుడు శివలింగంగా ఆవిర్భవించింది ఈ రోజే. పార్వతిని వివాహం చేసుకున్నది కూడా ఇదే రోజు. అందుకే శివనామస్మరణతో శివుడికి దగ్గరగా ఉంటే ఆయన కటాక్షం పొందవచ్చని వేద పురాణాలు చెప్తున్నాయి. ఉపవాసం అంటే ఉప + ఆవాసం అన్నమాట. అందుకే శివరాత్రి రోజు ఎలాంటి ఆహారం తీసుకోకుండా శివుడిని పూజించడం, అభిషేకించడం వంటివి చేస్తుంటారు.

ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యపరంగానూ ఉపవాసం అనేది అందరికీ మేలు చేస్తుంది. మాఘమాసం వరకు మందగించి ఉండే జీర్ణవ్యవస్థ వేసవి రాకతో తీవ్రం అవుతుంది. శీతకాలం, వేసవి సంధికాలంలో వచ్చే శివరాత్రి నాడు ఉపవాసం చేయడంతో శరీరం వాతావరణంలో జరిగే మార్పులకు తగినట్లుగా సిద్ధమవుతుందని చెబుతారు. అయితే ప్రస్తుతం మారిన జీవన విధానాల వల్ల అసలు ఆహారం తీసుకోకుండా మనుషులు పూజలు చేయలేకపోతున్నారు. దీంతో పూర్తి ఆహార నియమాలు పాటించలేని వారు ద్రవ పదార్థాలు తీసుకుంటూ శంకురుడిని పూజించవచ్చు. ఉపవాస నియమాలను భక్తిశ్రద్ధలతో పాటిస్తే పుణ్యఫలం దక్కుతుంది. శివరాత్రి రోజు జాగరణ చేయడం వల్ల రాత్రిపూట చేసే శివార్చన, శివాభిషేకం వల్ల శరీరంలో తేజస్సు వస్తుందని ధర్మశాస్త్రాలు వెల్లడిస్తున్నాయి.