సెప్టెంబరు 7న చంద్రగ్రహణం రాబోతోంది. భాద్రపద పౌర్ణమి రోజున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం మనకు విశేషంగా శతభిష నక్షత్రంలో, కుంభ రాశిలో ఏర్పడబోతోంది. చిలకమర్తి పంచాంగ రీత్యా, దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ చంద్ర గ్రహణం రాత్రి 9గంటల 56 నిమిషాలకు ప్రారంభమై అర్ధరాత్రి ఒంటిగంట 26 నిమిషాల వరకు ఉంటుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. అయితే.. చంద్రగ్రహణం రోజు కొన్ని నియమాలు తప్పక పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
READ MORE: Bihar: ఓ ఖైదీ కీలక నిర్ణయం.. జైల్లో అత్యాచార బాధితురాలితో పెళ్లి
హిందూ సంప్రదాయం ప్రకారం గ్రహణం ఏర్పడటానికి ముందు కొంత సమయం నుంచి, గ్రహణ సమయంతో పాటు, గ్రహణం తరువాత కొంత సమయాన్ని కలిపి సూతక కాలంగా పరిగణిస్తారు. ఈ సందర్భంగా చంద్ర గ్రహణం ఏర్పడటానికి 9 గంటల ముందు సూతక కాలం మొదలవుతుంది. అంటే సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం 12.57 గంటల నుంచి సూతక కాలం ప్రారంభమవుతుంది. ఈ సూతక కాలంలో ఆలయాల తలుపులు మూసివేస్తారు. పూజలు చేయరు. గ్రహణం ముగిసిన తర్వాత ఆలయాలను, ఇంటిని సంప్రోక్షణ కార్యక్రమాలు చేసిన తరువాత మాత్రమే తిరిగి ఆలయాలు తెరచి పూజలు చేస్తారు. ఈ గ్రహణం ముగిసే వరకు ఆహారం తీసుకోరు. ఆరోగ్యం సరిగా లేని వారు ఆహారం తీసుకోకుండా ఉండలేకపోతే పాలు, పండ్ల రసం వంటివి తీసుకుంటారు.
అలాగే గ్రహణానికి ముందు వండిన ఆహారంపై దర్భ గడ్డి లేదా తులసి ఆకులు వేయడం వల్ల ఆహారం కలుషితం కాకుండా ఉంటుందని నమ్మకం. గ్రహణం సమయంలో శుభకార్యాలు, పూజలు, దేవాలయ దర్శనాలు చేయరు. ఈ సమయంలో వీలైనంత వరకు భగవన్నామ స్మరణ, ధ్యానం చేయడం వంటివి మంచివి. సెప్టెంబర్ 7 వ తేదీ ఆదివారం అర్ధరాత్రి 1:26 గంటలకు గ్రహణం ముగుస్తుంది కాబట్టి మరుసటి రోజైన సెప్టెంబర్ 8 వ తేదీ సోమవారం సూర్యోదయానికి ముందే గ్రహణ స్నానం చేయాలి. నదీస్నానం, సముద్ర స్నానం చేస్తే మంచిది. ఈ నియమాలను పక్కన పెడితే మంచిది కాదని చెబుతారు.
