Sapta Jyotirlinga Darshan Yatra: భారతీయ రైల్వే అనుబంధ సంస్థ ఐఆర్‌సీటీసీ (IRCTC), పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ‘భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు’ ద్వారా “సప్త (07) జ్యోతిర్లింగ దర్శన యాత్ర” (టూర్ కోడ్: SCZBG68) అనే ప్రత్యేక ప్యాకేజీని ప్రవేశపెట్టింది. 10 రాత్రులు, 11 రోజుల పాటు సాగే ఈ పవిత్ర ఆధ్యాత్మిక యాత్ర నవంబర్ 10, 2026న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమవుతుంది. ప్రసిద్ధి చెందిన ప్రధాన జ్యోతిర్లింగ క్షేత్రాలను ఒకే ప్రయాణంలో దర్శించుకునేలా భక్తుల సౌకర్యార్థం ఈ టూర్‌ను రూపొందించారు.
సందర్శించే పుణ్యక్షేత్రాలు:
ఈ యాత్రలో భాగంగా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని (శ్రీ మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం, మహాకాల్ కారిడార్), ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు. ఆ తర్వాత గుజరాత్‌లోని ద్వారక (నాగేశ్వర్ జ్యోతిర్లింగం, ద్వారకాధీశ్ ఆలయం, బేట్ ద్వారక), ప్రథమ జ్యోతిర్లింగమైన సోమనాథ్ ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత మహారాష్ట్రలోని పుణే సమీపంలోని భీమాశంకర్ జ్యోతిర్లింగం, ఓఝర్ అష్టవినాయక గణపతి ఆలయం, నాసిక్‌లోని త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం, చివరగా ఛత్రపతి శంభాజీనగర్‌లోని ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయాలను దర్శించుకుని యాత్ర ముగుస్తుంది.
బోర్డింగ్ స్టేషన్లు & సీట్ల వివరాలు:
ఈ రైలులో మొత్తం 705 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో స్లీపర్ క్లాస్‌కు 237 సీట్లు, 3AC కి 416 సీట్లు, 2AC కి 52 సీట్లు కేటాయించారు. తెలుగు రాష్ట్రాలు మరియు పరిసర ప్రాంతాల భక్తుల సౌకర్యార్థం సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, ముద్ఖేడ్, నాందేడ్, పూర్ణా జంక్షన్లలో రైలు ఎక్కడానికి అలాగే దిగడానికి బోర్డింగ్/డీ-బోర్డింగ్ సదుపాయం కల్పించారు.
ప్యాకేజీ ఛార్జీలు:
కేంద్ర ప్రభుత్వం భారత్ గౌరవ్ రైలు పథకం కింద అందించే దాదాపు 33% రాయితీతో ఈ ప్యాకేజీ ధరలను నిర్ణయించారు. జీఎస్టీతో కలిపి ఒక్కో ప్రయాణికుడికి.. ఎకానమీ (Sleeper)లో పెద్దలకు రూ. 18,000/-, పిల్లలకు (5-11 సం.) రూ. 16,700/- గా నిర్ణయించారు. ఇక స్టాండర్డ్ (3AC)లో పెద్దలకు రూ. 27,400/-, పిల్లలకు రూ. 25,900/-గా ధరలు ఉన్నాయి. అదే కంఫర్ట్ (2AC)లో పెద్దలకు రూ. 35,500/-, పిల్లలకు రూ. 33,600/- గా నిర్ణయించారు.
లభించే సదుపాయాలు:
ఈ ప్యాకేజీలో రైలు ప్రయాణం, హోటళ్లలో రాత్రి బస లేదా రిఫ్రెష్మెంట్ రూములు, స్థానిక ఆలయాల సందర్శనకు వాహన సదుపాయం, ఉదయం టీ, అల్పాహారం, నాణ్యమైన శాఖాహార మధ్యాహ్న మరియు రాత్రి భోజనాలు చేర్చబడ్డాయి. వీటితో పాటు ట్రావెల్ ఇన్సూరెన్స్, రైలులో భద్రత, ఐఆర్‌సీటీసీ టూర్ మేనేజర్ల పర్యవేక్షణ ఉంటుంది. అయితే దర్శన ప్రత్యేక టికెట్లు, బోటింగ్ ఛార్జీలు, వ్యక్తిగత ఖర్చులు ప్రయాణికులే స్వయంగా భరించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు నిబంధనల ప్రకారం ఎల్టీసీ (LTC) సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.
సంప్రదింపు వివరాలు:
ఆలయ ప్రాంగణంలో నిర్మాణ పనులు జరుగుతున్న కారణంగా భీమాశంకర్ జ్యోతిర్లింగ దర్శనం ఉదయం 7:00 గంటల నుండి 11:00 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రయాణికులందరూ గుర్తింపు కోసం తమ ఒరిజినల్ ఫోటో ఐడీ కార్డులను (ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్ మొదలైనవి) తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి. యాత్ర బుకింగ్, ఇతర సందేహాల కొరకు ఐఆర్‌సీటీసీ సికింద్రాబాద్ కార్యాలయాన్ని 040-27702407, 9701360701 లేదా 8287932228 నంబర్లలో, అలాగే విజయవాడ (7670900698), తిరుపతి (8287932313), విశాఖపట్నం (9281030748) ప్రాంతీయ కేంద్రాలను సంప్రదించవచ్చు. పూర్తి వివరాల కోసం https://www.irctctourism.com//packagedetails/SCZBG68.pdf ను ఒకసారి చుడండి.

