Ram Mandir CEO Vacancy: అయోధ్యలోని శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ రామ మందిర ప్రధాన కార్యనిర్వహణాధికారి (సీఈవో) పదవికి దరఖాస్తులను ఆహ్వానించింది. ఆలయ దైనందిన నిర్వహణ, ఆర్థిక వ్యవహారాల పర్యవేక్షణ, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన వంటి కీలక బాధ్యతలను నిర్వర్తించేందుకు ఈ నియామకాన్ని చేపడుతోంది. దరఖాస్తుల స్వీకరణకు జూలై 18, 2026 సాయంత్రం 4 గంటల వరకు గడువు నిర్ణయించారు.
అర్హతలు ఏంటి..?
ఈ పదవికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 50 నుంచి 70 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు లేదా ప్రముఖ సంస్థల్లో కనీసం 20 సంవత్సరాల పరిపాలనా అనుభవం ఉండటంతో పాటు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. హిందీ, ఆంగ్ల భాషలపై పట్టు అవసరం. సనాతన హిందూ సంప్రదాయాలను పాటించే అభ్యర్థులకు, ముఖ్యంగా వైష్ణవ సంప్రదాయానికి చెందిన వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
ఎంపిక ప్రక్రియ కోసం ప్రత్యేక కమిటీ..
ఎంపిక ప్రక్రియలో పారదర్శకత కోసం రిటైర్డ్ న్యాయమూర్తి ప్రదీప్ కోహ్లీ, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ విష్ణుకాంత్ చతుర్వేది, సురేష్ హవాడే సభ్యులుగా ప్రత్యేక అన్వేషణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి, తుది ఎంపిక కోసం ముగ్గురు పేర్లను ట్రస్ట్‌కు సిఫారసు చేయనుంది. శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్రం (ట్రస్ట్) అర్హులైన వారి నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.. pic.twitter.com/PHa0MbT5kY
సీఈవో బాధ్యతలు ఏంటి..?
సీఈవో బాధ్యతలు కేవలం పరిపాలనా వ్యవహారాలకే పరిమితం కావు. ప్రతిరోజూ లక్షలాది భక్తుల దర్శన ఏర్పాట్లు, భద్రతా చర్యల పర్యవేక్షణ, ట్రస్ట్ నిధులు మరియు కానుకల నిర్వహణ, ఆర్థిక లావాదేవీల ఆడిట్, ఆలయ ప్రాంగణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల సమన్వయం వంటి కీలక బాధ్యతలను ఆయన నిర్వర్తించాల్సి ఉంటుంది.
జీతంతో పాటు లభించి సౌకర్యాలు ఏంటి..?
ఈ పదవికి తగినట్లుగానే ఆకర్షణీయమైన వేతన ప్యాకేజీని ట్రస్ట్ అందించనుంది. ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులు లేదా ప్రముఖ సంస్థల సీనియర్ కార్యనిర్వాహకులకు సమానమైన జీతభత్యాలతో పాటు అయోధ్యలో సకల సౌకర్యాలతో కూడిన అధికారిక నివాసాన్ని కల్పిస్తారు. అదనంగా, అధికారిక వాహనాలు, డ్రైవర్లు, భద్రతా సిబ్బంది, వైద్య బీమా, ప్రయాణ భత్యం, కమ్యూనికేషన్ సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి. అత్యున్నత పరిపాలనా అనుభవం, నిష్కళంకమైన సేవా రికార్డు కలిగిన రిటైర్డ్ సీనియర్ అధికారులు ఈ పదవికి అర్హులుగా పరిగణించబడతారు. ఈ నియామకానికి సంబంధించిన అన్ని వ్యయాలను ట్రస్ట్ తన విరాళాల నిధుల నుంచే భరిస్తుంది. దీంతో రామ మందిర నిర్వహణలో పారదర్శకత, సామర్థ్యం, ఆధునికత మరింత బలోపేతం కానున్నాయి.

