Koti Deepotsavam 2026: అంగరంగ వైభవంగా కోటి దీపోత్సవం.. మూడో రోజు విశేష కార్యక్రమాలు ఇవే..!

Koti Deepotsavam Day 3

Koti Deepotsavam Day 3

Koti Deepotsavam 2026: హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం అంగరంగ వైభవంగా సాగుతోంది.. కార్తీక మాసం సందర్భంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం 2026 వేడుకలు భక్తి పారవశ్యంతో కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నవంబర్ 16, సోమవారం మూడో రోజు పలు విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. కార్తీక సోమవారం సందర్భంగా స్వామివారి అనుగ్రహ భాషణం, ప్రవచనామృతం, ప్రత్యేక పూజలు, కల్యాణోత్సవం తదితర కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకోనున్నాయి.

మూడో రోజు కార్యక్రమాల్లో భాగంగా ముందుగా ప్రముఖ పీఠాధిపతుల అనుగ్రహ భాషణం ఏర్పాటు చేశారు. కాశీ జగద్గురువులైన శ్రీ చంద్రశేఖర శివాచార్య స్వామీజీ, కర్ణాటకలోని శ్రీ శివయోగీశ్వర సాధు సంస్థానం మఠానికి చెందిన డా. శ్రీ శివానంద భారతి మహాస్వామీజీ అనుగ్రహ భాషణం చేయనున్నారు. అనంతరం ప్రవచనామృతం కార్యక్రమంలో భాగంగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శారదా జ్ఞానసుప్రభాత ప్రవచనం అందించనున్నారు. అలాగే వేదికపై శివపార్వతులకు కోటిపుష్పార్చన, భక్తులచే శివలింగాలకు పుష్పార్చన నిర్వహించనున్నారు. కల్యాణోత్సవంలో భాగంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం జరగనుంది. చివరిగా శేష వాహన సేవతో మూడో రోజు కోటి దీపోత్సవ కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించనున్నాయి.

కోటి దీపోత్సవం 2026 మూడో రోజు విశేష కార్యక్రమాలు..

1. అనుగ్రహ భాషణం – శ్రీ చంద్రశేఖర శివాచార్య స్వామీజీ (కాశీ జగద్గురువులు), డా. శ్రీ శివానంద భారతి మహాస్వామీజీ (శ్రీ శివయోగీశ్వర సాధు సంస్థానం మఠం, కర్ణాటక)
2. ప్రవచనామృతం – శారదా జ్ఞానసుప్రభాత, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
3. వేదికపై పూజ – శివపార్వతులకు కోటిపుష్పార్చన
4. భక్తులచే పూజ – శివలింగాలకు పుష్పార్చన
5. కల్యాణం – కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం
6. వాహన సేవ – శేష వాహనం