NTV Telugu Site icon

Koti Deepotsavam 2024 Day 15: ఇల కైలాసంలో.. శ్రీసీతారాముల కల్యాణోత్సవం

Koti Deepostavam

Koti Deepostavam

కార్తిక మాసం శుభవేళ భక్తి టీవీ, ఎన్టీవీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘కోటి దీపోత్సవం’ 15వ రోజు ఘనంగా ముగిసింది. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగింది. కోటి దీపోత్సవం కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఆ పరమశివుడి సేవలో పాల్గొన్నారు. అంతేకాకుండా.. దీపాలను వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు. పిల్లా, పెద్ద అని తేడా లేకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని 15వ రోజు విజయవంతం చేశారు. కోటి దీపోత్సవం వేళ హైదరాబాద్‌ సహా పరిసర ప్రాంతాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి.. కోటి దీపోత్సవంలో పాల్గొని పునీతులవుతున్నారు. మరోవైపు.. శనివారం జరిగిన కోటిదీపోత్సవానికి ముఖ్య అతిథిగా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరై.. విశేష కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. జానకిరాముల వైభవం, కొండగట్టు అంజన్నకు కోటితమలపాకుల అర్చన, శ్రీసీతారాముల కల్యాణోత్సవం వేదికపై ఉండి వీక్షించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. సీతారాముల కల్యాణంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. 13 ఏళ్ల పాటు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమానికి దేశంలోనే ముఖ్యమైన వ్యక్తులు పాల్గొనడం.. ఇంతటి గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని హైదరాబాద్ లో నిర్వహించడం సంతోషంగా ఉందని మంత్రులు చెప్పారు.

15వ రోజు కోటి దీపోత్సవంలో భాగంగా.. శ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ (పెజావర్ మఠాధిపతి, ఉడుపి), శ్రీ మాధవానంద భారతి మహాస్వామీజీ (శ్రీమన్నెలేమావుమఠం శ్రీసంస్థానం, కర్ణాటక)లు అనుగ్రహ భాషణం చేశారు. బ్రహ్మశ్రీ డా.కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు ప్రవచనామృతం వినిపించారు. అలాగే.. వేదికపై కోటి తమలపాకుల అర్చన, అయోధ్య బాలరాముని మహాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులచే ఆంజనేయ విగ్రహాలకు కోటితమలపాకుల అర్చన చేయించారు. అలాగే.. ఘనంగా శ్రీ సీతారాముల కల్యాణోత్సవం జరిపించారు. హనుమంత వాహన సేవ కూడా చేశారు. చివరలో సప్త హారతి, లింగోద్భవం, పరమేశ్వరుడికి మహానీరాజనం కార్యక్రమంతో 15వ రోజు కోటి దీపోత్సవం వేడుక విజయవంతంగా ముగిసింది.

Show comments