Kartika Shobha for Bhadradri: భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో నేటి నుంచి కార్తీక మాస పూజోత్సవాలు నిర్వహించనున్నారు. రామాలయంతో పాటు, అన్నపూర్ణతో పాటు కాశీ విశ్వేశ్వర స్వామి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ప్రతి కార్తీక సోమవారం నాడు జ్యోతిర్లింగ, ఆకాశ దీపోత్సవాలు, నీరాజన మంత్ర పుష్ప పూజలు నిర్వహిస్తారు. 4న స్వామివారికి భస్మాభిషేకం, 11న చందనోత్సవం, 15న రుద్రాభిషేకం, 17న స్వామివారికి కల్యాణ మహోత్సవం, 18న పుష్పోత్సవం, 25న మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన నిర్వహించనున్నారు. ప్రతి సోమవారం ఉదయం, సాయంత్రం ప్రసాద వినియోగం, ప్రవచనాలు ఉంటాయి. శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో నిర్దేశిత ప్రత్యేక రోజుల్లో సత్యనారాయణ స్వామి వ్రతాలు, 27న నాడి హారతి నిర్వహిస్తారు. దేవస్థానం ఆధ్వర్యంలో వ్యాపారాలకు నేడు బహిరంగ వేలం నిర్వహించనున్నారు.
శివాలయంలో నేటి పూజలు
దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శివాలయంలో కార్తీక మాసం సందర్భంగా శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు వేదపండితులు సన్యాసి శర్మచే కార్తీక పురాణ ప్రవచనం, 6.30 గంటలకు లలిత సహస్రనామార్చన, రాత్రి 7 గంటలకు భద్రాచలం వాస్తవ్యులు లలిత, వాణిలచే భక్తి సంగీతం, రాత్రి 7.30 గంటల నుంచి నృత్య ప్రదర్శనలు ఉంటాయని ఆలయ అధికారులు తెలిపారు.
రాముడికి బంగారు కవచం..
ఆలయ ప్రవేశ మందిరంలో శుక్రవారం స్వామివారి విగ్రహాలు బంగారు కవచం ధరించి భక్తులకు దర్శనమిచ్చాయి. తెల్లవారుజామునే గర్భాలయంలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, పూజలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నిత్య కల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విష్వక్సేన పూజ, పుణ్యవచనం నిర్వహించారు. నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ చేసి శాస్త్రోక్తంగా నిర్వహించారు. శుక్రవారం శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Karthika Masam: ఆ చెట్టు కింద భోజనాలు చేస్తే అశ్వమేధ యాగం ఫలితం దక్కుతుంది..