హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం, మాఘ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని ‘జయ ఏకాదశి’ అని పిలుస్తారు. ఈ ఏకాదశికి ఆధ్యాత్మికంగా , పౌరాణికంగా అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ వ్రతాన్ని అత్యంత నిష్ఠతో ఆచరించడం వల్ల బ్రహ్మహత్యా పాతకం వంటి ఘోర పాపాలు సైతం నశించిపోతాయని, మరణానంతరం పొరపాటున కూడా భూత, ప్రేత, పిశాచ జన్మల వంటి అథోగతులు కలగవని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా 2026లో ఈ ఏకాదశి శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన గురువారం నాడు రావడం, దానికి తోడు శుభప్రదమైన రవి యోగం తోడవ్వడం వల్ల ఈ రోజు చేసే జపం, తపం లేదా దానం అనంతమైన ఫలితాలను ఇస్తుందని పండితులు చెబుతున్నారు. సంసార సాగరంలోని కష్టాల నుంచి విముక్తి పొంది, సకల ఐశ్వర్యాలను ప్రసాదించే శక్తి ఈ జయ ఏకాదశి వ్రతానికి ఉంది.
Ajit Pawar: అజిత్ పవార్ విమాన ప్రమాదం.. కొత్త వీడియోలో షాకింగ్ విజువల్స్..
ముఖ్యమైన తేదీలు , సమయాలు
2026 సంవత్సరంలో జయ ఏకాదశి తిథి జనవరి 28 , 29 తేదీల్లో ఉన్నప్పటికీ, శాస్త్రోక్తంగా ‘ఉదయ తిథి’ని పరిగణనలోకి తీసుకుని జనవరి 29, గురువారం నాడే వ్రతాన్ని ఆచరించాలి. ఏకాదశి తిథి జనవరి 28, 2026 సాయంత్రం 04:35 గంటలకు ప్రారంభమై… జనవరి 29, 2026 మధ్యాహ్నం 01:55 గంటలకు ముగుస్తుంది. జనవరి 30, 2026 ఉదయం 07:10 గంటల నుండి 09:20 గంటల మధ్య పారణ (ఉపవాస విరమణ) సమయం.
భీష్మ ఏకాదశి , విష్ణు సహస్రనామ విశిష్టత
జయ ఏకాదశినే భీష్మ ఏకాదశి అని కూడా అంటారు. పద్మ పురాణం ప్రకారం, కురువృద్ధుడు భీష్మ పితామహుడు అంపశయ్యపై ఉండి, ఉత్తరాయణ పుణ్యకాలంలో ఇదే రోజున శ్రీకృష్ణుడి పరమాత్మ తత్వాన్ని కీర్తిస్తూ విష్ణు సహస్రనామాలను లోకానికి అందించారు. అందుకే ఈ రోజును విష్ణు సహస్రనామ జయంతిగా జరుపుకుంటారు. ఈ రోజున భీష్ముడిని స్మరిస్తూ తర్పణం ఇవ్వడం వల్ల పితృదేవతలకు మోక్షం లభిస్తుందని, వంశాభివృద్ధి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
రవి యోగం – ఒక అద్భుత అవకాశం
ఈ ఏడాది జయ ఏకాదశి రోజున ‘రవి యోగం’ ఏర్పడటం వల్ల ఈ సమయం మంత్రోపదేశం పొందడానికి లేదా కొత్త పనులు ప్రారంభించడానికి ఎంతో అనుకూలం. విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, స్థిరాస్తులు కలిసి వస్తాయని నమ్ముతారు. గురువారం, ఏకాదశి, రవి యోగం.. ఈ మూడు కలిసి రావడం ఒక అరుదైన ఆధ్యాత్మిక కలయిక.
పూజా విధానం , నియమాలు
- ఉపవాస నియమం: ఏకాదశి నాడు ఉదయం నుంచి మరుసటి రోజు సూర్యోదయం వరకు ఉపవాసం ఉండాలి. కుదరని వారు అల్పహారం లేదా పండ్లు తీసుకోవచ్చు, కానీ బియ్యం పదార్థాలకు (అన్నం) దూరంగా ఉండాలి.
- ఆరాధన: ఉదయాన్నే స్నానం చేసి, విష్ణుమూర్తి పటం ముందు నెయ్యితో దీపం వెలిగించాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు నశిస్తాయి.
- తులసి ప్రాముఖ్యత: ఏకాదశి రోజున తులసి దళాలతో విష్ణువును అర్చించడం వల్ల కోటి యజ్ఞాల ఫలం లభిస్తుంది. అయితే, ఏకాదశి రోజున తులసి ఆకులను కోయకూడదని గుర్తుంచుకోవాలి (ముందు రోజే కోసి పెట్టుకోవాలి).
- దానధర్మాలు: ఈ రోజున పేదలకు పసుపు రంగు వస్తువులు, పండ్లు లేదా అన్నదానం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి.
GVL Narasimha Rao: దక్షిణాది రాష్ట్రాల బీజేపీ సమన్వయకర్తగా జీవీఎల్..
