370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!

Vinfast Vf5

Vinfast Vf5

VinFast VF5 Facelift: వియత్నాంకు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్ఫాస్ట్ (VinFast) భారత మార్కెట్లో తన ఉత్పత్తుల శ్రేణిని పెంచేందుకు ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగా VF5 ఎలక్ట్రిక్ SUV ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను భారత్‌లో విడుదల చేయనుంది. ఇప్పటికే ఈ మోడల్‌ను భారత పేటెంట్ కార్యాలయంలో రిజిస్టర్ చేశారు. అంతర్జాతీయ మార్కెట్లలో అందుబాటులోకి వచ్చిన అప్‌డేటెడ్ వెర్షన్‌నే భారత్‌లోనూ ప్రవేశపెట్టనున్నారు.

స్పోర్టీగా కొత్త డిజైన్

VinFast VF5 ఫేస్‌లిఫ్ట్‌లో ఎక్స్‌టీరియర్ డిజైన్‌ను భారీగా మార్చారు. గత మోడల్‌తో పోలిస్తే కొత్త వెర్షన్ మరింత SUV తరహా రూపాన్ని సంతరించుకుంది. ముందు భాగంలో నిటారుగా ఉండే ఫ్రంట్ ఫాసియా, క్లోజ్డ్ గ్రిల్, బంపర్‌పై అమర్చిన హెడ్‌ల్యాంప్స్, నిలువుగా ఉండే ఎయిర్ ఇన్‌టేక్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. క్రోమ్ యాక్సెంట్లు, మధ్యలో V లోగో, కొత్త బంపర్ డిజైన్ ప్రీమియం లుక్‌ను అందిస్తున్నాయి.

సైడ్ ప్రొఫైల్‌లో బాడీ క్లాడింగ్, బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, బ్లాక్‌డ్ అవుట్ పిల్లర్లు, టర్న్ ఇండికేటర్లతో కూడిన డ్యూయల్ టోన్ ORVMలు ఉన్నాయి. 205 సెక్షన్ టైర్లతో కూడిన 17 ఇంచుల డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ స్పోర్టీ లుక్‌ను ఇస్తాయి. వెనుక భాగంలో షార్క్ ఫిన్ యాంటెన్నా, రూఫ్ స్పాయిలర్, కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్, కొత్త బంపర్ డిజైన్ ఉన్నాయి. నాలుగు చక్రాలకూ డిస్క్ బ్రేకులు అందించారు.

విశాలమైన క్యాబిన్

కొత్త VF5 ఫేస్‌లిఫ్ట్ పొడవు 3,987 మి.మీ., వెడల్పు 1,772 మి.మీ., ఎత్తు 1,595 మి.మీ.గా ఉంది. పాత మోడల్‌తో పోలిస్తే పొడవు 20 మి.మీ., వెడల్పు 49 మి.మీ., ఎత్తు 16 మి.మీ. పెరిగాయి. వీల్‌బేస్ 2,514 మి.మీ.గా కొనసాగనుంది. వేరియంట్‌ను బట్టి గ్రౌండ్ క్లియరెన్స్ గరిష్ఠంగా 178 మి.మీ. వరకు ఉంటుంది. ఇంటీరియర్‌లోనూ పలు మార్పులు చేశారు. గత మోడల్‌లోని కోణాకార డ్యాష్‌బోర్డ్ స్థానంలో ఇప్పుడు ఫ్లాట్ డిజైన్‌ను అందించారు. క్యాబిన్‌లో అనవసరమైన బటన్లు, కంట్రోల్స్‌ను తగ్గించి మరింత క్లీన్ లుక్ తీసుకొచ్చారు. పాత 8 ఇంచుల టచ్‌స్క్రీన్ స్థానంలో పెద్ద 10 అంగుళాల సెంట్రల్ టచ్‌స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌కు సంబంధించిన ఫంక్షన్లను కూడా ఇందులోనే సమీకరించారు. కొత్త టూ-స్పోక్ స్టీరింగ్ వీల్‌ను అందించారు.

వైర్‌లెస్ ఛార్జింగ్ & 360 డిగ్రీ కెమెరాలు

సెంటర్ కన్సోల్‌లో రెండు కప్‌హోల్డర్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, స్లైడింగ్ ఆర్మ్‌రెస్ట్ ఉన్నాయి. లెథరెట్ సీట్లకు డ్యూయల్ టోన్ ఫినిషింగ్ ఇచ్చారు. సీట్లు మాన్యువల్‌గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్టీరింగ్ వెనుక కుడివైపు ఉండే స్టాక్ ద్వారా డ్రైవ్ సెలెక్టర్ విధులను నిర్వహించవచ్చు. ఇతర ఫీచర్లలో గ్రీన్ టింటెడ్ విండోస్, పవర్డ్ ఫోల్డింగ్ ORVMలు, డ్రైవర్ సైడ్ ఆటో అప్/డౌన్ విండో, ఆటో HVAC ఉన్నాయి. టాప్ వేరియంట్‌లో ఆరు ఎయిర్‌బ్యాగులు, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, NFC కీ కార్డ్, స్మార్ట్‌ఫోన్ డిజిటల్ కీ, TPMS, 360 డిగ్రీ కెమెరాలు వంటి ఫీచర్లు లభిస్తాయి. బూట్ స్పేస్ 335 లీటర్లు కాగా, వెనుక సీట్లను మడిచినప్పుడు 1,015 లీటర్ల వరకు విస్తరించుకోవచ్చు.

370 కి.మీ. రేంజ్..

పాత VF5లో ఉన్న 29.6 kWh, 37.23 kWh బ్యాటరీ ప్యాక్‌ల స్థానంలో కొత్త మోడల్‌లో 37.23 kWh, 43 kWh బ్యాటరీ ఆప్షన్లు అందించారు. దీంతో NEDC ప్రమాణాల ప్రకారం గరిష్ఠంగా 370 కిలోమీటర్ల రేంజ్ లభిస్తుంది. 6.6 kW AC ఛార్జింగ్, 60 kW DC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఉంది. ఈ ఎలక్ట్రిక్ SUVలో ముందు భాగంలో అమర్చిన మోటార్ 96.5 bhp పవర్, 180 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని అందుకోవడానికి 13 సెకన్లు పడుతుంది. ఇందులో ఎకో, స్పోర్ట్ అనే రెండు డ్రైవింగ్ మోడ్‌లతో పాటు నాలుగు రీజెనరేటివ్ బ్రేకింగ్ మోడ్‌లు ఉన్నాయి.

రెండు వేరియంట్లలో లాంచ్

అంతర్జాతీయ మార్కెట్లో VinFast VF5 ఫేస్‌లిఫ్ట్ NP గ్రీన్, NP ప్రీమియం అనే రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. భారత్‌లోనూ ఈ అప్‌డేటెడ్ మోడల్‌ను ప్రవేశపెట్టేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. అయితే ఇండియా లాంచ్ తేదీ, ధర, వేరియంట్లకు సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ ఇంకా ప్రకటించాల్సి ఉంది.