AI Smart Helmets: ఏఐ టెక్నాలజీతో 3 స్మార్ట్ హెల్మెట్లు.. ఫీచర్స్ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..

Ultraviolette Unveils

Ultraviolette Unveils

Ultraviolette AI Smart Helmets: ఈఐసీఎంఏ 2026 (EICMA 2026) మోటార్ సైకిల్ షో వేదికగా ప్రముఖ ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీ సంస్థ అల్ట్రావయొలెట్ (Ultraviolette) సరికొత్త ఏఐ (AI) స్మార్ట్ హెల్మెట్లను ఆవిష్కరించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇటలీలోని మిలన్ వేదికగా జరుగుతున్న ఈ గ్లోబల్ ఈవెంట్ లో కేవలం బైక్‌లు, స్కూటర్లను మాత్రమే ప్రదర్శించడమే కాకుండా, అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పనిచేసే 3 కాన్సెప్ట్ హెల్మెట్లను పరిచయం చేసి అందరి దృష్టినీ ఆకర్షించింది. స్టార్ వ్యూ (Star View), ఫ్యాంగ్ 01 (Fang 01), డెసిబెల్ (Decibelle) పేర్లతో తీసుకొచ్చిన ఈ మూడు మోడల్స్ వాటి లుక్స్, డిజైన్, ఫీచర్ల పరంగా మామూలు హెల్మెట్ల కంటే చాలా భిన్నంగా ఉన్నాయి.

రైడింగ్ అనుభవాన్ని (Riding Experience) మరింత సురక్షితంగా, స్మార్ట్ గా మార్చేందుకు రూపొందించిన ‘స్టార్ వ్యూ’ హెల్మెట్ లో ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR Technology) సాంకేతికతను ఉపయోగించారు. ఇది రైడర్ కు, డిజిటల్ ప్రపంచానికి మధ్య ఒక డిజిటల్ ఇంటర్ఫేస్‌లా పనిచేస్తుంది. బైక్ నడిపే సమయంలో ప్రాథమిక భద్రతకు ఏమాత్రం భంగం కలగకుండా డిజిటల్ వరల్డ్‌తో కనెక్ట్ అవ్వడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఇక రెండో మోడల్ ‘ఫ్యాంగ్ 01’ గురించి చెప్పాలంటే, దీనిని ఒక ప్రత్యేకమైన ఎక్సోస్కెలిటన్ (Exoskeleton) డిజైన్‌తో తీర్చిదిద్దారు. చుట్టూ ఉన్న వాతావరణం, పరిస్థితులకు అనుగుణంగా స్పందించేలా దీన్ని తయారుచేశారు. అత్యంత బలమైన ఫైబర్ పదార్థంతో తయారు చేసిన ఈ హెల్మెట్ పైన కొమ్ముల వంటి ఒక ప్రత్యేక నిర్మాణం ఉంటుంది. ఇది బహుశా యాంటెన్నా (Antenna)లాగా పనిచేసే అవకాశం ఉంది. రైడర్ ముఖ భాగాన్ని పూర్తిగా కవర్ చేసే దీని చిన్ గార్డ్ (Chin Guard) ప్రమాదాల నుంచి పూర్తి రక్షణనిచ్చేలా చాలా బలంగా ఉంటుంది.

మూడో మోడల్ అయిన ‘డెసిబెల్’ హెల్మెట్ లో టెక్నాలజీ, ఫ్యాషన్, రైడింగ్ మూడింటిని కలిపేశారు. ఇందులో ఇన్-బిల్ట్ హై డెఫినిషన్ ఆడియో సిస్టమ్ (In-built HD Audio System) ను అమర్చారు. భవిష్యత్తులో రైడింగ్ అనేది కేవలం వాహనానికి మాత్రమే పరిమితం కాకుండా హెల్మెట్లు, ఇతర స్మార్ట్ పరికరాలు కూడా అందులో కీలక పాత్ర పోషిస్తాయని చూపించడమే ఈ ఉత్పత్తుల ప్రధాన ఉద్దేశం.

ఇక, బెంగళూరు కేంద్రంగా 2016లో నారాయణ్ సుబ్రమణ్యం, నీరజ్ రాజ్ మోహన్‌లు ఒక స్టార్టప్‌గా ప్రారంభించిన అల్ట్రావయొలెట్ ఆటోమోటివ్ (Ultraviolette Automotive) ప్రయాణం ఇప్పుడు విదేశాలకూ విస్తరించింది. ఎలక్ట్రిక్ వెహికల్ ప్లాట్‌ఫామ్స్ (EV platforms), బ్యాటరీ టెక్నాలజీ (Battery Technology) రంగాల్లో పని చేస్తున్న ఈ సంస్థ డిజైన్లలో విమానయాన రంగానికి (Aviation) చెందిన ఇంజనీరింగ్ మెళకువలు కనిపిస్తాయి. ప్రస్తుతం జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్, బ్రిటన్, బెల్జియం, నెదర్లాండ్స్, ఇటలీ, స్విట్జర్లాండ్, హంగేరీ సహా దాదాపు 20 దేశాలకు ఈ కంపెనీ తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతోంది.