Site icon NTV Telugu

Tesla: కేవలం 600 ఆర్డర్లే.. టెస్లా కార్‌లపై ఇంట్రెస్ట్ చూపని భారతీయులు..

Tesla

Tesla

Tesla: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తన టెస్లా కార్ల అమ్మకాలను భారతదేశంలో ప్రారంభించారు. అయితే, అనుకున్నంగా ఈ కార్లకు భారతీయుల నుంచి స్పందన రావడం లేదు. జూలై 15న అమ్మకాలు ప్రారంభించినప్పటి నుంచి, తన మోడల్ Y కోసం 600 వరకు ఆర్డర్లు వచ్చినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ఇది కంపెనీ నిర్దేశించుకున్న అంతర్గత లక్ష్యాల కన్నా చాలా తక్కువగా ఉంది. టెస్లా తన వార్షిక కోటాలో 2500 వాహనాలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుందని నివేదిక తెలిపింది. నివేదిక ప్రకారం, టెస్లా ప్రస్తుతం 2025లో భారతదేశానిక 350 నుంచి 500 కార్లను రవాణా చేయాలని చూస్తోంది. మొదటి బ్యాచ్ సెప్టెంబర్ ప్రారంభంలో చైనా షాంఘై ప్లాంట్ నుంచి వస్తుంది. ప్రారంభ డెలవరీలు ముంబై, ఢిల్లీ, పూణే, గురుగ్రామ్‌లకు పరిమితం చేయబడుతాయి.

అయితే, మొదట టెస్లా ఊహించింది ఒకటైతే, ఇప్పుడు జరిగేది మరొకటి. భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం తర్వాత దిగుమతి సుంకాల్లో రాయితీ వస్తుందని టెస్లా ఆశపడింది. కానీ, రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుందనే కుంటి సాకులు చెబుతూ, ట్రంప్ భారత్‌ పై 50 శాతం సుంకాలు విధించడం టెస్లాకు ప్రతిబంధకంగా మారింది. టెస్లా ఎలక్ట్రిక్ కార్ల ధరల్లో ఎలాంటి తగ్గింపు రాకపోవడంతో భారతీయ వినియోగదారులు ఈ కార్లపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.

Read Also: Pakistan: వరదలకు పాకిస్తాన్ రక్షణ మంత్రి వింత పరిష్కారం.. ఏం చెప్పారంటే..

టెస్లాతో పోలిస్తే తక్కువ ధరలకే, మంచి ఫీచర్లలో, పెద్ద బ్యాటరీ ప్యాక్స్‌తో టాటా, మహీంద్రా వంటి భారతీయ ఆటోమొబైల్ దిగ్గజాలు ఎలక్ట్రిక్ కార్లను అందిస్తుండటంతో వీటిపై వినియోగదారులు ఆసక్తి కనబరుస్తు్న్నారు. టెస్లా Y మోడల్ ఎలక్ట్రిక్ కారు ధర ఇండియాలో రూ. 59 లక్షల నుంచి రూ. 68 లక్షల వరకు ఉంది. కేవలం రూ. 30 లక్షల నుంచి 40 లక్షల లోపే భారత కంపెనీలు హైఎండ్ ఎలక్ట్రిక్ కార్లను అందిస్తున్నాయి. దీంతో వినియోగదారులు వీటి వైపే ఆసక్తి కనబరుస్తున్నాడు.

మరోవైపు, ప్రపంచ వ్యాప్తంగా కూడా టెస్లా కార్లకు డిమాండ్ తగ్గుతోంది. ఈ నేపథ్యంలోనే అతిపెద్ద వాహన మార్కెట్ కలిగిన భారత్‌ని టెస్లా టార్గెట్ చేసింది. ఇక్కడ తన కార్లను అమ్ముకోవాలని చూసింది. తన మొదటి షోరూమ్‌ని జూలై 15న ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ప్రారంభించింది. రెండో టెస్లా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ఆగస్టు 11న ఢిల్లీలోని ఏరోసిటీలో తెరిచింది.

Exit mobile version