ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘టాటా మోటార్స్’ భారత ఆటోమొబైల్ మార్కెట్‌ను మరోసారి శాసించేందుకు సిద్దమైంది. అత్యంత ప్రజాదరణ పొందిన మైక్రో ఎస్‌యూవీ ‘టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్’ను ఈరోజు అధికారికంగా లాంచ్ చేసింది. 2021 అక్టోబర్‌లో లాంచ్ అయిన టాటా పంచ్‌కు ఇది ఫేస్‌లిఫ్ట్ కావడం విశేషం. కొత్త మోడల్‌లో డిజైన్, టెక్నాలజీ, భద్రత పరంగా టాటా కంపెనీ గణనీయమైన మార్పులు చేసింది. కంపెనీ భారతదేశపు మొట్టమొదటి iCNG AMT SUVని కూడా పరిచయం చేసింది.
టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్ ఎక్కువగా పంచ్.ఈవీ మాదిరే ఉంది. ముందుభాగంలో కొత్త LED DRLs (డే టైమ్ రన్నింగ్ లైట్స్), రీడిజైన్ చేసిన బంపర్, ఆకర్షణీయమైన ఫ్రంట్ గ్రిల్ కనిపిస్తాయి. ఇవి కారుకు మరింత మోడ్రన్, ప్రీమియం లుక్‌ను తీసుకొచ్చాయి. ఇంటీరియర్‌లో కూడా భారీ అప్‌డేట్స్ ఉన్నాయి. ఇందులో 10.25 ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. కొత్త పంచ్ ఫేస్‌లిఫ్ట్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా అందిస్తోంది. ఇప్పటికే గ్లోబల్ NCAP నుంచి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన ఈ మైక్రో ఎస్‌యూవీ.. ఫామిలీ కొనుగోలు దారులకు మరింత భరోసా కల్పిస్తోంది. 2021 అక్టోబర్ 14న గ్లోబల్ NCAP రేటింగ్ పొందిన పంచ్.. భద్రతలో బెంచ్‌మార్క్‌గా నిలిచింది.
ఇప్పటివరకు భారత మార్కెట్లో 6 లక్షలకుపైగా టాటా పంచ్ యూనిట్లు అమ్ముడయ్యాయి. అంతేకాదు 2024లో భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన కారుగా కూడా రికార్డు సృష్టించింది. ఈ విజయమే ఫేస్‌లిఫ్ట్ మోడల్‌పై అంచనాలను మరింత పెంచింది. 2026 టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ రూ.5.59 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుంచి ప్రారంభమవుతుంది. టాప్ ఎండ్ Accomplished+ S పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ ధర రూ.8.99 లక్షలు. ఇక CNG మాన్యువల్ వేరియంట్ ధరలు రూ.6.69 లక్షలు నుంచి రూ.9.29 లక్షల వరకు ఉన్నాయి (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). వాయిస్-అసిస్టెడ్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రెయిన్-సెన్సింగ్ వైపర్‌లు వంటి ఫీచర్స్ టాప్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటాయి.
ఈ కొత్త పంచ్‌ను Cyantafic, Caramel, Bengal Rouge, Coorg Clouds వంటి ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో టాటా కంపెనీ అందిస్తోంది. బుకింగ్స్ కోసం టాటా మోటార్స్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా సమీప డీలర్‌షిప్‌ను సందర్శించవచ్చు. మొత్తంగా చూస్తే కొత్త డిజైన్, అధునాతన ఫీచర్లు, టాప్ క్లాస్ సేఫ్టీతో టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ మైక్రో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో తన ఆధిపత్యాన్ని మరింత బలపరచే అవకాశాలు ఉన్నాయి. ఇది నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కిగర్, మారుతి సుజుకి ఇగ్నిస్ వంటి వాటితో కూడా పోటీపడుతుంది.
