NTV Telugu Site icon

Tata Nexon EV Fire Case: టాటా నెక్సాన్ EV కేసు.. రూ. 19.55 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశం..

Nexon Ev

Nexon Ev

Tata Nexon EV Fire Case: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం బాగా పెరిగింది. గత కొన్నేళ్లుగా ఎలక్ట్రిక్ కార్లు, బైకులు, గూడ్స్ రవాణా వాహనాలను విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే, కొన్ని సందర్భాల్లో మాత్రం ఎలక్ట్రిక్ బైకుల నుంచి మంటలు చెలరేగిన సంఘటనలు చూశాం. కార్‌ల విషయానికి వస్తే అత్యంత అరుదుగా ఫైర్ యాక్సిడెంట్ కేసులు నమోదయ్యాయి. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌లో టాటా నెక్సాన్ EV మంటల్లో చిక్కుకుంది. జొనాథన్ బ్రెయినార్డ్ అనే యజమాని ఈ ఘటనపై హైదరాబాద్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమీషన్‌ని సంప్రదించాడు. తాను చెల్లించిన డబ్బుని పూర్తిగా వాపస్ ఇవ్వాలని కేస్ ఫైల్ చేశాడు. తాజాగా వినియోగదారుల కోర్టు బాధితుడికి పరిహారం చెల్లించాలని టాటా మోటార్స్‌ని ఆదేశించింది.

Read Also: Budget EV Cars: చౌకైన ఎలక్ట్రిక్ కార్లు(రూ.10 లక్షలలోపు).. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 365 కి.మీ.

కారు కొనుగోలు సమయంలో చెల్లించిన పూర్తి మొత్తం రూ. 16.95 లక్షలకు 9 శాతం వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని టాటా మోటార్స్‌ని కోర్టు ఆదేశించింది. అదనంగా టాటా మోటార్స్ వినియోగదారుడికి కోర్టు ఖర్చులు రూ. 10,000లని చెల్లించాలని తీర్పు చెప్పింది. కారు ప్రమాదం వల్ల వినియోగదారుడికి కలిగిన మానసిక వేధనకు పరిహారంగా మరో రూ. 2.50 లక్షలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

టాటా నెక్సాన్ EV కొన్న కొత్తలో మంచి ఓనర్‌షిప్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చిందని యజమాని బ్రెయినార్డ్ చెప్పారు. అయితే, కొన్న తర్వాత మొదటి 11 నెలల్లో సమస్యలు రావడం ప్రారంభమైనట్లు చెప్పాడు. ఛార్జింగ్ 18 శాతం ఉన్నప్పటికీ, కారు రన్నింగ్‌లో ఆగిపోయిందని పేర్కొన్నాడు. డ్రైవింగ్ మోడ్స్‌ ఒక్కోసారి మారడం లేదని చెప్పారు. దీంతో అతడి కారుకి కొత్త బ్యాటరీ ప్యాక్‌ని అందించింది కంపెనీ. అయితే, ఈ కొత్త బ్యాటరీ ప్యాక్‌ని రీప్లేస్ చేసిన 12 రోజుల తర్వాత కారులో మంటలు చెలరేగాయి. పెద్ద శబ్ధంతో కారు ఆగిపోయిందని, దీంతో అతను కారుని చెట్టుకి ఢీకొట్టానని, బయటకు రాగానే కారు మంటల్లో చిక్కుకున్నట్లు తెలిపాడు.

Show comments