Tata Motors: టాటా పంచ్ నుంచి హారియర్ వరకు.. సెప్టెంబర్ 1 నుంచి ధరలు పెంపు

  • మరోసారి టాటా మోటార్స్ కార్ల ధరల పెరుగుదల..
  • సెప్టెంబర్ 1, 2026 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి..
  • ICE, EV మోడళ్ల ధరల పెంపు..
  • ఎక్స్-షోరూమ్ ధరలు గరిష్ఠంగా రూ.25,000 వరకు పెరగే ఛాన్స్..
  • పెరుగుతున్న ముడిసరుకు ఖర్చులు, ద్రవ్యోల్బణమే కారణం..
Tata

Tata

Tata Motors: కొత్తగా టాటా కార్లు కొనుగోలు చేయాలనుకునే వారు ఆగస్టులోనే కొనేయండి. వచ్చే నెల నుంచి టాటా తన కార్ల ధరల్ని పెంచనుంది. సెప్టెంబర్ 1, 2026 నుంచి టాటా కార్ల ధరలు పెరగనున్నాయి. టాటా మోటార్స్‌కు చెందిన పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీలతో పాటు ఎలక్ట్రిక్ కార్ల ధరలు కూడా పెరగనున్నాయి. గరిష్టంగా రూ. 25,000 వరకు పెంపు ఉండొచ్చని కంపెనీ ప్రకటించింది.

పెరుగుతున్న ముడి సరుకు వ్యయాలు, ద్రవ్యోల్బణం కారణంగా ధరలు పెంచాల్సి వస్తోందని టాటా మోటార్స్ తెలిపింది. అయితే, ఏ మోడల్‌పై ఎంత పెంపు ఉంటుందనే విషయాన్ని ఇంకా కంపెనీ వెల్లడించలేదు. ఆయా మోడళ్ల ధరలు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. 2024 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ముడిసరకు వ్యయాల్లో సుమారు 4.5 శాతం పెరుగుదల నమోదైనట్లు కంపెనీ తెలిపింది. రెండో త్రైమాసికింలో కూడా ముడి సరుకు ధర 3 శాతం పెరుగొచ్చని అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలోనే కార్ల ధరలు పెంచాల్సి వస్తోందని కంపెనీ చెబుతోంది.

ప్రస్తుతం టాటా పోర్ట్‌ఫోలియోలో టియాగో, టిగోర్, ఆల్ట్రోజ్, పంచ్, నెక్సాన్, కర్వ్, సియెర్రా, హారియర్, సఫారీ ఉన్నాయి. సఫారీ మినహా మినహా మోడళ్లన్ని EV వెర్షన్లలో కూడా లభ్యమవుతున్నాయి. ప్రస్తుతం ఈ కార్లను కొనాలని ప్లాన్ చేసుకున్నట్లైతే ఆగస్టులో కొంటే కాస్త ధర కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆగస్టు 31 వరకు కొనుగోలు చేయడం వల్ల ధరల పెంపును తప్పించుకోవచ్చు.

జూలై 2026లో టాటా పంచ్ 21,313 యూనిట్ల అమ్మకాలతో కంపెనీ అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. ఆ తర్వాత నెక్సాన్ 17,471 యూనిట్లతో రెండో స్థానంలో ఉంది. ఇక టియాగో 7,429 యూనిట్లు, సియెర్రా 6,327, హారియర్ 3,301, ఆల్ట్రోజ్ 2,862, కర్వ్ 1,697, సఫారీ 1,453, టిగోర్ 758 యూనిట్ల అమ్మకాలను నమోదు చేశాయి. జూలైలో టాటా మోటార్స్ మొత్తం 62,611 యూనిట్లను విక్రయించింది.