NTV Telugu Site icon

Shocking Study: “కారు” వల్ల క్యాన్సర్ ప్రమాదం.. షాకింగ్ స్టడీ..

Car

Car

Shocking Study: ఇండియాలో ఆటోమొబైల్స్ ఇండస్ట్రీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా భారత్ ఉంది. ప్రస్తుతం ప్రతీ కుటుంబం కూడా ఒక కారు ఉంచుకునేందుకు ప్రాధాన్యత ఇస్తోంది.  అందుకు ఇంతపెద్ద మార్కెట్‌ని సొంతం చేసుకునేందుకు ప్రపంచంలోని కార్ కంపెనీలతో సహా ఇండియన్ కార్ మేకర్స్ కొత్త కొత్త మోడళ్లలో కార్లను విడుదల చేస్తున్నారు. ఒకప్పటిలా కాకుండా దేశంలో జీవన ప్రమాణ స్థాయిలు పెరగడం, ఆదాయం పెరగడంతో కార్ ఒక స్టేటస్ సింబల్ నుంచి నిత్యావసరంగా మారుతోంది.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఒక సర్వే మాత్రం కారు వినియోగదారులను షాకింగ్‌కి గురిచేస్తోంది. కార్‌లు క్యాన్సర్లకు కారణం అయ్యే అవకాశం ఉందని డ్యూక్ యూనివర్శిటీ నిర్వహించిన ఇటీవలి పరిశోధన మరియు ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ & టెక్నాలజీ జర్నల్‌లో ప్రచురించబడింది. కార్ల ఇంటీరియర్‌లో ఉండే ‘‘ఫ్లేమ్ రిటార్డెంట్స్’’ క్యాన్సర్లకు కారణమవుతుందని స్టడీ హైలెట్ చేసింది. కార్ లోపల అన్ని భాగాల్లో ఈ ఫ్లేమ్ రిటార్డెంట్లు కనిపిస్తాయి. మన కార్లలో వీటి వల్ల కలుషితమైన గాలి క్యాన్సర్లకు కారణమయ్యే అవకాశం ఉందని అధ్యయనం సూచిస్తోంది.

Read Also: Patnam Sunita Mahender Reddy: కూకట్పల్లి నియోజకవర్గంలో పట్నం సునీత మహేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం..

ఫ్లేమ్ రిటార్డెంట్స్ అంటే ఏమిటి..?

ఫ్లేమ్ రిటార్డెంట్లు మంటలు మొదలవకుండా లేదా నిరోధించడానికి లేదా వాటి వ్యాప్తిని తగ్గించడానికి మెటీరియల్స్‌కి జోడించే రసాయనాలు. ఎలక్ట్రానిక్స్, ఫర్నీచర్, వెహికల్ ఇంటీరియర్స్‌తో సహా వివిధ రకాల వినియోగ ఉత్పత్తుల్లో వీటిని సాధారణంగా ఉపయోగిస్తారు. గత కొన్ని దశాబ్ధాలుగా కార్లలోని సీట్ ఫోమ్, ఇతర ఫ్రాబ్రిక్స్‌లో ఈ రసాయనాలను వాడుతున్నారు.

పరిశోధకులు 101 కార్‌ల లోపలి భాగాలను పరిశీలించారు. గాలి నాణ్యత, వాహనాల్లో ఉపయోగించే మెటీరియల్స్‌పై దృష్టిపెట్టారు. దాదాపుగా అన్ని కార్లలోని గాలిలో ఫ్లేమ్ రిటార్డెంట్‌లను కలిగి ఉన్నట్లు కనుగొన్నారు. ట్రిస్ (1-క్లోరో-ఐసోప్రొపైల్) ఫాస్ఫేట్ (TCIPP) వంటి నిర్దిష్ట రసాయనాలు ఉన్నాయని వారు కనుగొన్నారు. ఇది క్యాన్సర్లకు కారణమయ్యే సామర్థ్యం దీనికి ఉన్నట్లు పరిశోధనలో తేలింది. కారులోని పరిస్థితులు ముఖ్యంగా ఉష్ణోగ్రత, గాలిలోని రసాయనాల స్థాయిని ప్రభావితం చేస్తాయని అధ్యయనం వెల్లడించింది. వేసవిలో కార్లలో సాధారణంగా అధిక క్యాబిన్ ఉష్ణోగ్రత ఉంటుంది. ఇది ఫ్లేమ్ రిటార్డెంట్ల సాంద్రతను మరింతగా పెంచుతోంది.

ఆరోగ్య సమస్యలు:

కొన్ని ఫ్లేమ్ రిటార్డెంట్లకు గురికావడం వల్ల పిల్లల్లో IQ పాయింట్లు కోల్పోవడానికి, పెద్దలలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఎక్కువ దూరం ప్రయానించే డ్రైవర్లకు, పెద్దవారితో పోలిస్తే వారి శరీర బరువు కన్నా ఎక్కువ గాలి పీల్చే పిల్లలకు సంబంధించి సమస్యగా మారుతుంది.

భద్రతా ప్రమాణాల్లో రాజీ పడకుండా ఫ్లేమ్ రిటార్డెంట్ల స్థానంలో వేరే మెటీరియల్స్ ఉపయోగించాలని అధ్యయనం సూచిస్తోంది. కారు కిటికీలను తెరిచి ఉండడం, కార్ క్యాబిన్ భాగాన్ని చల్లగా ఉంచడం, కారుని నీడ ఉన్న ప్రదేశాల్లో పార్కింగ్ చేయడం, క్రమం తప్పకుండా కారు లోపల శుభ్రపరచడం వంటివి చేయడం వల్ల ఫ్లేమ్ రిటార్డెంట్ల సాంద్రతను తగ్గించవచ్చు.