Renault Duster Hybrid Launched: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెనో డస్టర్ హైబ్రిడ్ ఎస్యూవీ ఎంట్రీ ఇచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలోనే ఈ కారును కంపెనీ ప్రపంచానికి పరిచయం చేసినప్పటికీ, ధరల వివరాలను మాత్రం తాజాగా వెల్లడించింది. ఒకప్పుడు ఇండియన్ మార్కెట్లో డస్టర్ డీజిల్ ఇంజిన్‌తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. అయితే కాలక్రమేణా కంపెనీ డీజిల్ కార్ల విక్రయాలను నిలిపివేయడంతో, డీజిల్‌కు చక్కటి ప్రత్యామ్నాయంగా ఈ కొత్త స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ సరికొత్త ఎస్‌యూవీలో అత్యంత ప్రధానమైన హైలైట్ ఏంటంటే..? ఇది లీటరుకు ఏకంగా 29 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. మిడ్-సైజ్ ఎస్యూవీ సెగ్మెంట్లో మరే ఇతర కారుకు లేనంత గరిష్ట మైలేజీ ఇదే కావడం విశేషం. దీనికి ప్రధాన పోటీదారులైన టొయోటా హైరైడర్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా హైబ్రిడ్ కార్లు లీటరుకు 27.97 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుండగా, రెనో డస్టర్ వాటిని వెనక్కి నెట్టింది. అంతేకాకుండా, ఇందులో 50 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఇవ్వగా, ఫుల్ ట్యాంక్ చేస్తే ఏకంగా 1,400 కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించవచ్చని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.
ఇక పనితీరు విషయానికి వస్తే, ఈ కారులో శక్తివంతమైన 1.8 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు, బ్యాటరీ సెటప్‌ను అమర్చారు. రెనోకు చెందిన అత్యాధునిక ‘ఈ-టెక్ 160’ టెక్నాలజీతో పాటు ‘సీఎంఎఫ్-బీ’ (RGMP) ప్లాట్‌ఫారమ్‌పై దీన్ని రూపొందించారు. ఈ ఫ్యూచర్ రెడీ ప్లాట్‌ఫారమ్‌పై భవిష్యత్తులో పెట్రోల్, హైబ్రిడ్, సీఎన్జీ, ఎలక్ట్రిక్ వంటి విభిన్న పవర్‌ట్రెయిన్ కార్లను తయారు చేయవచ్చు. ఈ ఇంజిన్ 110 పీఎస్ శక్తిని, 175 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఇందులో 1.4 కిలోవాట్ బ్యాటరీని పొందుపరిచారు. బ్యాటరీ, మోటార్, ఇంజిన్ వేర్వేరు పద్ధతుల్లో పనిచేసేలా మొత్తం 6 ఆపరేటింగ్ మోడ్స్ ఇందులో అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా ఈ సిస్టమ్ 160 పీఎస్ శక్తిని, 208 ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది. కేవలం 9.6 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని కంపెనీ తెలిపింది. ధరల విషయానికొస్తే.. ఈ హైబ్రిడ్ ఎస్యూవీ మూడు వేరియంట్లలో లభించనుంది. దీని ప్రారంభ ధర ఎక్స్-షోరూమ్ ప్రకారం రూ. 16.99 లక్షలుగా (ఎవల్యూషన్ వేరియంట్) నిర్ణయించారు. టెక్నో వేరియంట్ ధర రూ. 18.99 లక్షలు కాగా, టాప్-ఎండ్ ఎమోషన్ వేరియంట్ ధర రూ. 19.49 లక్షలుగా ఉంది. ఇవి పరిచయ ఆఫర్ కింద ఇస్తున్న ధరలే. ఇక సాధారణ డస్టర్ మోడల్స్ ధరలు రూ. 10.49 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. అంతేకాదు.. ఈ కారుతో పాటు 7 ఏళ్ల వారంటీని అందిస్తుండగా, బ్యాటరీపై మాత్రం 8 ఏళ్లు లేదా 1.6 లక్షల కిలోమీటర్ల వరకు వారంటీ ఇస్తున్నారు.

