29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..

  • రెనాల్ట్ డస్టర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఈ-టెక్ 160 భారత్‌లో లాంచ్
  • మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చిన కొత్త డస్టర్
  • 1.8 లీటర్ పెట్రోల్ ఇంజిన్, రెండు ఎలక్ట్రిక్ మోటార్లు
  • 1.4kWh బ్యాటరీ ప్యాక్‌తో హైబ్రిడ్ సిస్టమ్..
Renault Duster Hybrid E Tech

Renault Duster Hybrid E Tech

Renault Duster Hybrid E-Tech 160 Launched: రెనాల్ట్ ఇండియా (Renault India) డస్టర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఈ-టెక్ (Duster Strong Hybrid E-Tech) 160ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కారుతో రెనాల్ట్ గ్లోబల్ స్ట్రాంగ్-హైబ్రిడ్ టెక్నాలజీని తొలిసారిగా భారత్‌లో ప్రవేశపెట్టింది. ఈ SUV మూడు వేరియంట్లలో లభిస్తుంది. కొత్త డస్టర్‌లో 1.8 లీటర్ పెట్రోల్ ఇంజిన్, రెండు ఎలక్ట్రిక్ మోటార్లు, 1.4kWh బ్యాటరీ ప్యాక్ ఉన్నాయి. ఇవన్నీ కలిసి 160PS పవర్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇది ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కాదు. బ్యాటరీని ప్రత్యేకంగా ఛార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా డ్రైవింగ్ సమయంలో రీజెనరేటివ్ బ్రేకింగ్, ఎనర్జీ రికవరీ ద్వారా ఛార్జ్ అవుతుంది.

ఈ హైబ్రిడ్ సిస్టమ్‌లో ఫార్ములా-1 స్ఫూర్తితో రూపొందించిన మల్టీ-మోడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందించారు. ఇందులో రెండు ఎలక్ట్రిక్ గేర్లు, నాలుగు పెట్రోల్ గేర్లు ఉండగా.. మొత్తం 15 డ్రైవ్ కాంబినేషన్లను సిస్టమ్ ఎంచుకోగలదు. కంపెనీ ప్రకారం.. Duster Strong Hybrid ARAI సర్టిఫైడ్ 29kmpl మైలేజ్ అందిస్తుంది. అనుకూల పరిస్థితుల్లో నగర ప్రయాణాల్లో 80% వరకు పూర్తిగా ఎలక్ట్రిక్ మోడ్‌లో ప్రయాణించవచ్చు. సమానమైన డీజిల్ వాహనంతో పోలిస్తే 29% వరకు ఇంధనాన్ని ఆదా చేయవచ్చని కంపెనీ చెబుతోంది. ఫీచర్ల విషయానికి వస్తే.. కొత్త డస్టర్‌లో 212mm గ్రౌండ్ క్లియరెన్స్, పనోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ టెయిల్‌గేట్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, 10.1 అంగుళాల OpenR Link ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. టాప్-స్పెక్ ఎమోషన్ వేరియంట్‌లో డ్యూన్ బ్రౌన్ లెదరెట్ అప్‌హోల్‌స్టరీ కూడా లభిస్తుంది.

రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ ధరలు (ఎక్స్-షోరూమ్):

* ఎవల్యూషన్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఈ-టెక్ 160 – రూ.16.99 లక్షలు.
* టెక్నో స్ట్రాంగ్ హైబ్రిడ్ ఈ-టెక్ 160 – రూ.18.99 లక్షలు.
* ఎమోషన్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఈ-టెక్ 160 – రూ.19.49 లక్షలు.