కాలుష్యం పెరిగిపోతోంది. దీనికి తోడు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా ఆకాశాన్నంటుతున్న వేళ ప్రజారవాణా, ప్రైవేట్ రవాణా వ్యవస్థలు ఎలక్ట్రిక్ బస్సుల వైపు మొగ్గుతున్నాయి. పూణే రహదారులపై మరో 100 ఓలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు రోడ్లమీదకు రావడానికి రెడీ అయ్యాయి. ఎలక్ట్రిక్ బస్సులు, ఛార్జింగ్ స్టేషన్‌ను జెండా ఊపి ప్రారంభించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇవాళ్టి పర్యటనలో మోడీ పాల్గొంటున్నారు.
పూణేలో ఇప్పటికే విజయవంతంగా నడుస్తున్నాయి 150 ఓలెక్ట్రా బస్సులు. ఎలక్ట్రిక్ మొబిలిటీలో దేశంలోనే అగ్రగామిగా కొనసాగుతున్న ఓలెక్ట్రా కంపెనీ తన ఉత్పత్తుల్ని అందరికీ చేరువ చేయనుంది. ఇప్పటికే సూరత్, ముంబై, పూణే, సిల్వాసా, గోవా, నాగ్‌పూర్, హైదరాబాద్, డెహ్రాడూన్‌లలోనూ నడుస్తున్నా ఓలెక్ట్రా బస్సులు. కాలుష్య రహిత, శబ్దం లేని ఏసీ ప్రయాణం, భద్రతకు పెద్దపీట ఒలెక్ట్రా బస్సుల ప్రత్యేకతగా చెబుతున్నారు.
పూణే నగరం వారసత్వ పటంలో ఓలెక్ట్రా బస్సులది ప్రత్యేక స్థానం అంటున్నారు ఓలెక్ట్రా గ్రీన్‌టెక్ ఎండీ కేవీ. ప్రదీవ్. పూణేలో ఇప్పటివరకు 2 కోట్ల కిలోమీటర్లకు పైగా తమ బస్సులు తిరిగాయని కేవీ ప్రదీప్ చెబుతున్నారు. లిథియం-అయాన్ (Li-ion) బ్యాటరీ ఒక ఛార్జ్‌తో 200 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. MEIL గ్రూప్ కంపెనీలలో భాగంగా ఉన్న ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణలో అగ్రగామి. త్వరలో మరిన్ని నగరాలకు ఇలాంటి సర్వీసులు అందుబాటులోకి వస్తే కాలుష్యం అదుపులోకి వస్తుందంటున్నారు పర్యావరణ నిపుణులు.