ప్రముఖ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ ఫిబ్రవరి 2025కి సంబంధించి అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. ఈ నెలలో కంపెనీ 25,000 యూనిట్లను విక్రయించింది. ఇది గత ఏడాది ఫిబ్రవరి కంటే 25.86% తక్కువ. ఫిబ్రవరి 2024లో కంపెనీ 33,722 యూనిట్లను అమ్మింది. అయితే, అమ్మకాలు తగ్గినప్పటికీ.. ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికీ భారతదేశ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లో 28% మార్కెట్ వాటాతో అతిపెద్ద కంపెనీగా కొనసాగుతోంది.
అమ్మకాలు ఎందుకు తగ్గాయి?
వాహన రిజిస్ట్రేషన్ ఏజెన్సీలతో తన ఒప్పందాలను సవరించినట్లు ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది. ఖర్చులను తగ్గించడానికి, రిజిస్ట్రేషన్ ప్రక్రియను మెరుగుపరచడానికి ఈ చర్య తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. దీని కారణంగా ఫిబ్రవరిలో వాహన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ సంఖ్యలు తాత్కాలికంగా తగ్గాయని వెల్లడించింది. జనవరి 2025 తో పోలిస్తే.. ఫిబ్రవరిలో అమ్మకాలు దాదాపు సమానంగానే ఉన్నాయి. జనవరిలో కంపెనీ 24,330 యూనిట్లు విక్రయించింది. ఓలా S1 సిరీస్ స్కూటర్ ను 4,000 కి పైగా సొంతం చేసుకున్నారు.
కాగా.. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ ఇటీవల మూడోతరం జనరేషన్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందిన విద్యుత్ ద్విచక్ర వాహనాలను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఎస్1 ఎక్స్, ఎస్1 ఎక్స్+, ఎస్1 ప్రో, ఎస్1 ప్రో+ పేరిట మొత్తం నాలుగు రకాల స్కూటర్లను వివిధ బ్యాటరీ ఆప్షన్లలో తీసుకొచ్చింది. వీటి ధరలు రూ.79 వేల నుంచి ప్రారంభమై గరిష్ఠంగా రూ.1.69 లక్షల వరకు ఉన్నాయి. గతంలో ఉన్న మోడళ్లకు అదనంగా ఎస్1 ప్రో+ మోడల్‌ను తీసుకురావడం గమనార్హం.
మోడళ్లు ఇవే..
ఓలా ఎలక్ట్రిక్ సంస్థ ఎస్1 ప్రో+ పేరిట కొత్త స్కూటర్‌ను మార్కెట్లోకి ఓలా పరిచయం చేసింది. ఇది 5.3kWh, 4kWh బ్యాటరీ ఆప్షన్లతో వస్తోంది. వీటి ధరలు రూ.1,69,999 రూ.1,54,999గా కంపెనీ నిర్ణయించింది. ఎస్ 1 ప్రో 4kWh బ్యాటరీ వేరియంట్ ధర రూ.1,34,999; 3kWh బ్యాటరీ వేరియంట్ ధర రూ.1,14,999గా నిర్ణయించారు. ఎస్ 1ఎక్స్ 2kWh బ్యాటరీ వేరియంట్ ధర రూ.79,999గా నిర్ణయించారు. 3kWh వేరియంట్ ధర రూ.89,999, 4kWh ధర రూ.99,999గా కంపెనీ వెల్లడించింది. ఎస్1 ఎక్స్+ 4kWh బ్యాటరీ ఆప్షన్‌తో మాత్రమే వస్తోంది. దీని ధరను కంపెనీ రూ.1,07,999గా నిర్ణయించారు.