భారత మార్కెట్‌లోకి మరో కొత్త కారు విడుదలైంది.. 2012 నాటి భారత ఆటో మార్కెట్‌ను గుర్తు చేసుకుంటే.. రోడ్లపై హ్యాచ్‌బ్యాక్‌ల హవా, SUV అంటే లగ్జరీ లేదా సాధారణ ప్రజలకు అందని కల.. ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేసిన కారు ఒక్కటే.. అదే రెనాల్ట్ డస్టర్.. సరసమైన ధరలో SUV అనుభూతిని అందిస్తూ, భారత మార్కెట్‌లో కొత్త ట్రెండ్‌కు డస్టర్ నాంది పలికింది. ఇప్పుడు దాదాపు దశాబ్దంన్నర తర్వాత, అదే డస్టర్ మరింత ఆధునిక రూపంలో మళ్లీ భారతీయ రోడ్లపైకి వచ్చింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా చెన్నై జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో రెనాల్ట్ ఇండియా కొత్త తరం డస్టర్‌ను అధికారికంగా ఆవిష్కరించింది. ఆధునిక టెక్నాలజీ, హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్, ప్రీమియం ఫీచర్లతో కొత్త డస్టర్ పూర్తిగా కొత్త SUV అనుభూతిని అందించనుంది.
భారత మార్కెట్‌కు ప్రత్యేకంగా డిజైన్
రెనాల్ట్ ఇండియా CEO స్టీఫెన్ డెబ్లేస్ మాట్లాడుతూ.. కొత్త డస్టర్ కేవలం పోటీ కోసం కాదు, భారతదేశంలో మరోసారి కొత్త సెగ్మెంట్‌ను సృష్టించేందుకు తీసుకువచ్చామని తెలిపారు. రెనాల్ట్ గ్రూప్ చీఫ్ ఇంజనీర్ డాక్టర్ వి. విక్రమన్ ప్రకారం, ఈ SUV ప్రత్యేకంగా భారత మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన RGMP (Renault Group Modular Platform) పై నిర్మించబడింది. డస్టర్‌లోని భాగాల్లో 90 శాతం వరకు దేశీయంగా తయారవడం వల్ల ధరలు పోటీతత్వంగా ఉండనున్నాయి.
ఆకట్టుకునే లుక్ మరియు డిజైన్
కొత్త డస్టర్ ఫ్రంట్ లుక్ మరింత బోల్డ్‌గా కనిపిస్తుంది. ఐబ్రో-షేప్డ్ LED DRLsతో కూడిన హెడ్‌లైట్స్, ప్రత్యేక గ్రిల్ డిజైన్, వెండి రంగు బంపర్ గార్నిష్ SUV క్యారెక్టర్‌ను హైలైట్ చేస్తాయి. సైడ్ ప్రొఫైల్‌లో బ్లాక్ క్లాడింగ్, రూఫ్ రెయిల్స్, C-పిల్లర్‌పై డోర్ హ్యాండిల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వెనుక భాగంలో లైట్ బార్‌తో కనెక్ట్ అయిన LED టెయిల్‌లైట్స్ కొత్త లుక్‌ను ఇస్తాయి.
మూడు ఇంజిన్ ఎంపికలు
కొత్త రెనాల్ట్ డస్టర్ మూడు ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులోకి రానుంది. 1.8 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ E-Tech పెట్రోల్ ఇంజిన్ – నగరంలో 80 శాతం వరకు EV మోడ్‌లో నడుస్తుందని కంపెనీ తెలిపింది. 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ – 163 PS పవర్, 280 Nm టార్క్‌తో స్పోర్టీ డ్రైవింగ్ అనుభూతి ఇవ్వనుంఇ.. 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ – నగర, హైవే ప్రయాణాలకు సరైన బ్యాలెన్స్ చేయనుంది..
ప్రీమియం క్యాబిన్ అండ్ స్మార్ట్ ఫీచర్లు
ఇంటీరియర్ విషయంలో కొత్త డస్టర్ పూర్తిగా ప్రీమియం టచ్‌ను అందిస్తుంది. లెథరెట్ సీట్లు, బ్లాక్ థీమ్ క్యాబిన్, గ్రీన్ యాక్సెంట్స్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పెద్ద టచ్‌స్క్రీన్ ప్రత్యేక ఆకర్షణ. 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ Android Auto & Apple CarPlay, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. మరోవైపు.. భద్రత విషయంలో కొత్త డస్టర్ సెగ్మెంట్‌లోనే బెస్ట్‌గా నిలుస్తోంది. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్‌తో పాటు లెవల్-2 ADAS ఫీచర్లు అందించనుంది. ADASతో వచ్చిన తొలి రెనాల్ట్ కారుగా ఇది రికార్డ్ సృష్టించనుంది.
బుకింగ్స్, ధర మరియు డెలివరీ వివరాలు
రెనాల్ట్ ఇండియా కొత్త డస్టర్ బుకింగ్స్‌ను అధికారికంగా ప్రారంభించింది. కస్టమర్లు రూ.21,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. మార్చి మధ్యలో ధరలు ప్రకటించనున్నట్లు, ఏప్రిల్ మధ్య నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. హైబ్రిడ్ వేరియంట్ డెలివరీలు దీపావళి నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
