ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారు ఈ-విటారా కారును భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ- విటారా ఎస్‌యూవీ లాంచ్‌కు సిద్ధమవుతోంది. మార్చి 2025లో లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. జపాన్, యూరప్‌లతోపాటు 100కి పైగా దేశాలకు ఈ-విటారా కారును ఎగుమతి చేస్తామని మారుతి సుజుకి వెల్లడించింది. ఇటీవల ఈ-విటారా ముందస్తుగా బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కంపెనీ కలిగించింది. 25,000 టోకెన్ మొత్తం చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు. తాజాగా ఈ కారుకు సంబంధించి ఆశ్చర్యకరమైన వార్త వచ్చింది. విడుదలకు ముందే ఈ కారు డీలర్‌షిప్‌లను చేరుకుంది. దీని ధరను కూడా కంపెనీ ఇంకా ప్రకటించలేదు. రూ. 17 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం కావచ్చని అంచనా వేస్తున్నారు. దీన్ని డీలర్‌షిప్ వద్ద చెక్ చేసుకోవచ్చు.
సేఫ్టీకి 7 ఎయిర్‌బ్యాగ్‌లు..
ఈ-విటారా ముందు భాగంలో Y-పరిమాణ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్ లను కలిగి ఉంది. వెనుకవైపు 3-పీస్ లైటింగ్ ఎలిమెంట్‌తో కనెక్ట్ చేస్తూ.. ఎల్‌ఈడీ టెయిల్ లైట్‌ని అమర్చారు. దీని ముందు బంపర్ పెద్దగా ఆకర్శణీయంగా ఉంది. ఇందులో ఫాగ్ లైట్లు ఉన్నాయి. క్యాబిన్ లోపల, విభిన్న టెర్రైన్ మోడ్‌ల కోసం రోటరీ డయల్ కంట్రోల్‌తో కూడిన సెంటర్ కన్సోల్, సన్‌రూఫ్, హిల్ హోల్డ్, ఆల్ వీల్ డ్రైవ్ అందించారు. ఈ-విటారా గ్లోబల్ స్పెక్ వెర్షన్‌లో కనిపించే మోడల్‌ను పోలి ఉంటుంది. ఈ కారులో 7 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా అందించారు.
కొత్త సుజుకి ఈ-విటారా ఫీచర్లు
డిజైన్ వారీగా.. ఈ-విటారా చుట్టూ మందపాటి క్లాడింగ్, చంకీ వీల్ ఆర్చ్‌లు, Y-ఆకారపు LED హెడ్‌ల్యాంప్‌లు, కనెక్ట్ చేయబడిన టెయిల్‌ల్యాంప్‌లు, మంచి క్వాలిటీతో కూడిన వెనుక బంపర్ ఉన్నాయి. ఛార్జింగ్ పోర్ట్ ముందు భాగంలో ఎడమ ఫెండర్‌పై అమర్చారు. వెనుక డోర్ హ్యాండిల్స్ సి-పిల్లర్‌పై ఉన్నాయి. ఈ-విటారాలో డ్యూయల్ డ్యాష్‌బోర్డ్ స్క్రీన్‌లు, వైర్‌లెస్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, క్రూయిజ్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా, ఆటో హోల్డ్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, లెవెల్ 2 ADAS సూట్‌లతో కూడిన ఫీచర్-ప్యాక్డ్ క్యాబిన్ లభిస్తుంది.
బ్యాటరీ ప్యాక్- రేంజ్..
కంపెనీ మారుతి ఈ-విటారాను రెండు విభిన్న బ్యాటరీ ప్యాక్‌లతో (49kWh – 61kWh) పరిచయం చేసింది. దీనిలో, పెద్ద బ్యాటరీ ప్యాక్‌కి డ్యూయల్-మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ (AWD) సెటప్ ఇచ్చారు. దీనికి కంపెనీ ఆల్ గ్రిప్-E అని పేరు పెట్టింది. ఇది చైనీస్ కార్ కంపెనీ బిల్డ్ యువర్ డ్రీమ్ (BYD) నుంచి తీసుకున్న బ్లేడ్ సెల్ లిథియం ఐరన్-ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఫ్రంట్ యాక్సిల్‌పై ఒకే మోటారుతో 49kWh బ్యాటరీ 144hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. సింగిల్-మోటార్ పెద్ద 61kWh బ్యాటరీ ప్యాక్ 174hp వరకు పవర్ అవుట్‌పుట్ ఇస్తుంది. ఈ రెండు వెర్షన్లు 189Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. అయితే, e-AllGrip (AWD) వేరియంట్ వెనుక యాక్సిల్ వద్ద అదనంగా 65hp మోటారును జోడిస్తుంది. దీని కారణంగా మొత్తం పవర్ అవుట్‌పుట్ 184hpకి, టార్క్ 300Nmకి పెరుగుతుంది.