భారత రోడ్లపై ఎలక్ట్రిక్ కార్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కొత్త మోడళ్లు నిత్యం ఆటో మార్కెట్‌లోకి వస్తున్నాయి. అయితే అధిక సంఖ్యలో వినియోగదారులు మాత్రం ‘మారుతి’ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నేడు ఆ నిరీక్షణకు తెరపడనుంది. దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి అధికారికంగా తన మొదటి ఎలక్ట్రిక్ కారు ‘మారుతి ఇ విటారా’ను ఈరోజు విడుదల చేయనుంది. ఈ సంవత్సరం ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో మారుతి ఇ విటారాను ప్రదర్శించారు. ఈ కారు భారతదేశంలో లాంచ్ కావడానికి ముందే విదేశాలకు ఎగుమతి అయింది.
గుజరాత్‌లోని హన్సల్‌పూర్ ప్లాంట్‌లో కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారును ఉత్పత్తి చేస్తోంది. గత ఆగస్టు 26న ప్రధాని నరేంద్ర మోడీ ప్లాంట్‌లో ఈ కారును జెండా ఊపి ప్రారంభించారు. ఆ తర్వాత ఎగుమతులు ప్రారంభమయ్యాయి. ఈ కారును ప్రపంచవ్యాప్తంగా 100 దేశాలకు ఎగుమతి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. మారుతి సుజుకి 2026 ఆర్థిక సంవత్సరంలో 67,000 ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేయాలని టార్గెట్ పెట్టుకుంది. వీటిలో ఎక్కువ భాగం ఎగుమతి చేయబడుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తుల స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఇప్పటివరకు సుమారు 7,000 యూనిట్లు ఎగుమతి చేయబడ్డాయి. జపాన్, యూరప్‌తో సహా అనేక దేశాలలో మారుతి ఇ విటారా కార్లు రయ్ రయ్ మంటున్నాయి.
గుజరాత్‌లోని పిపావా పోర్టు నుంచి మొదటి బ్యాచ్‌లో భాగంగా 2,900 కార్లను మారుతి సుజుకి ఎగుమతి చేసింది. ప్రారంభంలో ఈ కారును యూకే, జర్మనీ, నార్వే, ఫ్రాన్స్, డెన్మార్క్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, స్వీడన్, హంగేరీ, ఐస్లాండ్, ఆస్ట్రియా, బెల్జియంతో సహా 12 దేశాలకు రవాణా చేశారు. చివరగా ఇప్పుడు భారతదేశంలో లాంచ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో సుజుకి ఇ విటారా రెండు బ్యాటరీ ఎంపికలతో ( 49kWh, 61kWh) అందుబాటులో ఉంది. రెండు బ్యాటరీలు ఫ్రంట్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారుకు శక్తినిస్తాయి. అయితే 61kWh ప్యాక్‌ను రెండవ మోటారుతో జత చేయవచ్చు, ఇది ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌కు సపోర్ట్ చేస్తుంది. 500 కిమీ వరకు డ్రైవింగ్ రేంజ్ అని కంపెనీ ప్రకటించింది. భారతదేశంలో ఫ్రంట్-వీల్-డ్రైవ్ (FWD) వేరియంట్‌లను మాత్రమే లంచ్ చేయనుంది కంపెనీ. ఆల్-వీల్-డ్రైవ్ (AWD) వేరియంట్‌లను తరువాత లాంచ్ చేయాలనీ కంపెనీ భావిస్తోంది.
Also Read: Iphone 16 Price Drop: నెవర్ బిఫోర్ డీల్ అమ్మ.. అతి తక్కువ ధరకు ఐఫోన్ 16!
మారుతి ఇ విటారా కారు ఒకే గ్లాస్ ప్యానెల్ కింద డ్యూయల్-స్క్రీన్ సెటప్‌ను కలిగి ఉంది. కంపెనీ ముందు వెంటిలేటెడ్ సీట్లను ఇచ్చింది. ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, AWD వెర్షన్ కోసం ట్రైల్తో సహా డ్రైవ్ మోడ్‌లు, హిల్ డీసెంట్ కంట్రోల్, సింగిల్-జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటి ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, కీలెస్ ఎంట్రీ, పవర్డ్ డ్రైవర్ సీటు, సన్‌రూఫ్, సబ్ వూఫర్‌తో కూడిన ఇన్ఫినిటీ ఆడియో సిస్టమ్ ఉంది. భద్రతా పరంగా ఏడు ఎయిర్‌బ్యాగులు, లెవల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఉన్నాయి. ఈ కారు ప్రారంభ ధర రూ.18-19 లక్షలు ఉండే అవకాశం ఉంది.
