JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..

Jsw Combat Suv

Jsw Combat Suv

JSW Combat SUV: భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి సరికొత్తగా ఎంట్రీ ఇస్తున్న జెఎస్‌డబ్ల్యూ (JSW) కంపెనీ నుంచి తొలిసారిగా ఓ అదిరిపోయే ఎస్‌యూవీ రాబోతోంది. దసరా లేదా దీపావళికి వస్తుందని అందరూ అనుకున్న ఈ కారు లాంచింగ్ డేట్ తాజాగా మారినట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది డిసెంబర్ 4న జెఎస్‌డబ్ల్యూ తన మొట్టమొదటి కారును మన దేశ మార్కెట్లోకి అధికారికంగా తీసుకురానుంది. ఈ కారు పెట్రోల్ లేకుండానే ఏకంగా 90 కిలోమీటర్ల దూరం దూసుకుపోనుంది.

ఇప్పటికే ఎంజీ (MG) కంపెనీతో కలిసి మన దేశంలో కార్లను లాంచ్ చేస్తున్న జెఎస్‌డబ్ల్యూ మోటార్స్, ఇప్పుడు ‘కాంబ్యాట్’ (JSW Combat) పేరుతో మరో సరికొత్త ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎస్‌యూవీని రోడ్లపైకి తెస్తోంది. గ్లోబల్ మార్కెట్లో మంచి పేరున్న ‘జెటూర్ టీ2’ (Jetour T2) మోడల్ ఆధారంగా ఈ కారును డిజైన్ చేశారు. పూర్తిగా 5 సీటర్ కెపాసిటీ ఉన్న ఈ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎస్‌యూవీని మన దేశంలోనే మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ (ఔరంగాబాద్) ప్లాంట్లో తయారు చేస్తుండటం విశేషం.

ఈ కొత్త కారులో ప్రత్యేకత ఏంటని పరిశీలిస్తే.. గ్లోబల్ మార్కెట్లో ఈ జెటూర్ టీ2 ఎస్‌యూవీ ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వేరియంట్లలో లభిస్తోంది. అయితే మన దేశానికి వచ్చే కాంబ్యాట్ మోడల్ మాత్రం 1.5 లీటర్ డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో పాటు 18.4kWh బ్యాటరీ ప్యాక్‌తో రానుంది. ఇందులో ఉండే రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఫ్రంట్ వీల్ డ్రైవ్‌ను అందిస్తాయి. దీనికి తోడు 3-స్పీడ్ డెడికేటెడ్ హైబ్రిడ్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ జతచేయబడి ఉంటుంది. ఈ పవర్ ఫుల్ ఇంజిన్ సెటప్ ఏకంగా 360 హార్స్ పవర్ శక్తిని, 610 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్రత్యేకంగా దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే పెట్రోల్ తో సంబంధం లేకుండా కేవలం బ్యాటరీ మీదనే 90 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.

ఇక లాంగ్ డ్రైవ్ ప్రియుల కోసం ఈ కారులో ఫుల్ ట్యాంక్ పెట్రోల్, ఫుల్ ఛార్జ్ కలిపి చూస్తే ఏకంగా 1100 కిలోమీటర్ల కంబైండ్ డ్రైవింగ్ రేంజ్ లభిస్తుందని కంపెనీ చెబుతోంది. చైనా మార్కెట్లో ఈ కారు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లాంచ్ అయినప్పటికీ, మన దేశానికి మాత్రం ప్రీ-ఫేస్‌లిఫ్ట్ మోడల్ బేస్డ్ వెర్షనే రానుంది. ఇండియన్ రోడ్లకు తగినట్లుగా డిజైన్ లో కొన్ని చిన్నచిన్న మార్పులు చేశారు. ముఖ్యంగా హెడ్‌లైట్లు, ఫ్రంట్, రియర్ బంపర్లలో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. ముందు వైపు ఉన్న జెటూర్ లోగో స్థానంలో ‘కాంబ్యాట్’ బ్యాడ్జిని అమర్చనున్నారు. రోడ్లపై దీని లుక్ అదిరిపోయేలా ఉండేందుకు 20 అంగుళాల అల్లాయ్ వీల్స్, వీల్ ఆర్చ్ క్లాడింగ్, రూఫ్ రెయిల్స్, వెనక వైపు స్పేర్ వీల్ మౌంట్, వర్టికల్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు ఇస్తున్నారు. భారత మార్కెట్లో ఈ సరికొత్త జెఎస్‌డబ్ల్యూ కాంబ్యాట్ ఎస్‌యూవీ ధర సుమారు రూ.35 లక్షల నుంచి రూ.40 లక్షల మధ్య ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.