Honda ALPHA Electric SUV: హోండా కార్స్ ఇండియా తన తొలి స్వదేశీ తయారీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి ‘హోండా ఆల్ఫా’ (Honda ALPHA) అనే పేరును అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 2, 2026న ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని భారత్‌లో ప్రపంచవ్యాప్తంగా తొలిసారి ఆవిష్కరించనుంది. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే.. ఈ కారుతోనే భారత్‌లో హోండా కొత్త హెచ్ మార్క్ (H Mark) లోగోను కూడా పరిచయం చేయనుంది. అంతేకాకుండా ఈ మోడల్‌కు భారత్ గ్లోబల్ తయారీ కేంద్రంగా వ్యవహరించనుంది.
0 ఆల్ఫా కాన్సెప్ట్ ఆధారంగా తయారీ
2025 జపాన్ మొబిలిటీ షోలో హోండా తొలిసారిగా 0 ఆల్ఫా కాన్సెప్ట్ ప్రోటోటైప్‌ను ప్రదర్శించింది. దాని ఆధారంగానే ప్రస్తుతం ప్రొడక్షన్ వెర్షన్‌ను సిద్ధం చేస్తోంది. గ్రీకు వర్ణమాలలోని మొదటి అక్షరం ఆల్ఫా నుంచి ఈ పేరును తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. కొత్త ప్రారంభానికి ప్రతీకగా ఈ పేరును ఎంపిక చేసినట్లు తెలిపింది. ఇతర అంతర్జాతీయ మార్కెట్ల కంటే ముందుగా ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ భారత్‌లోనే అందుబాటులోకి రానుంది.
ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మరో ప్రత్యేకత కొత్త హెచ్ మార్క్ లోగో. హోండా కార్స్ ఇండియా తన అధికారిక కమ్యూనికేషన్‌లో ఈ కొత్త లోగోను తొలిసారిగా పరిచయం చేసింది. 1963లో తొలిసారి ప్రవేశపెట్టిన హోండా ఆటోమొబైల్ హెచ్ లోగోకు కాలానుగుణంగా పలు మార్పులు జరిగాయి. తాజాగా రూపొందించిన డిజైన్ కంపెనీ కొత్త ఆలోచనలు, సాంకేతిక పరివర్తనకు ప్రతీకగా నిలుస్తుందని హోండా వెల్లడించింది. భారత్‌లో ఈ కొత్త లోగోతో రాబోయే తొలి మోడల్‌గా ఆల్ఫా నిలవనుంది.
భారత రోడ్లపై
హోండా 2026 మార్చిలో రాజస్థాన్‌లోని తపుకరా తయారీ కేంద్రం నుంచి 0 ఆల్ఫా పరీక్షలను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా హైవేలు, నగర రహదారులు, గుంతలతో కూడిన మార్గాలు, విభిన్న వాతావరణ పరిస్థితుల్లో ఈ ఎస్‌యూవీని పరీక్షిస్తోంది. ఛార్జింగ్ మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశాలపైనా ప్రత్యేకంగా పరిశీలనలు నిర్వహిస్తోంది. గతంలో పరీక్షల సమయంలో కనిపించిన ప్రోటోటైప్‌లో పెద్ద ల్యాండ్‌స్కేప్ టచ్‌స్క్రీన్, ప్రత్యేక డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లు గుర్తించారు. అయితే ప్రొడక్షన్ మోడల్‌లో వచ్చే ఫీచర్లు, పూర్తి ఇంటీరియర్ వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
హోండా అమ్మకాలు
2026లో హోండా ఇప్పటికే పలు కొత్త మోడళ్లను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. మే నెలలో సిటీ ఫేస్‌లిఫ్ట్, జూలైలో జెడ్‌ఆర్-వీ హైబ్రిడ్, అక్టోబర్‌లో ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్‌ను పరిచయం చేసింది. ఇప్పుడు డిసెంబర్‌లో ఆల్ఫా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది. అక్టోబర్ 2026లో కంపెనీ దేశీయ విక్రయాలు 7,609 యూనిట్లకు చేరాయి. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 19 శాతం వృద్ధి నమోదైంది. సెప్టెంబర్‌తో పోలిస్తే 70.41 శాతం పెరిగాయి. అయితే ఎగుమతులు 88.53 శాతం తగ్గి 473 యూనిట్లకు పరిమితమయ్యాయి. దీంతో మొత్తం అమ్మకాలు 8,082 యూనిట్లుగా నమోదయ్యాయి.

