Chery Tiggo: విరిగిన యాక్సిల్.. ఊడిపోయిన చక్రాలు! భారత్ మార్కెట్లోకి రాకముందే చైనా కార్ల బ్రాండ్ పరువు గాల్లోకి..

Chery Tiggo Cross

Chery Tiggo Cross

Chery Tiggo: చైనాకు చెందిన ‘చెరీ’ (Chery) కంపెనీ భారత మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సన్నాహాలు జరుపుతోంది. జెఎస్‌డబ్ల్యూ (JSW Group) లాంటి దిగ్గజ కంపెనీతో చేతులు కలపాలని చూస్తోంది. ప్రణాళికలు భారీగానే ఉన్నాయి, మార్కెట్ కూడా చాలా పెద్దదే. కానీ చైనాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘చెరీ’ (Chery)కి ఇండియా దారి మాత్రం అంత సాఫీగా సాగేలా కనిపించడం లేదు. దీనికి ప్రధాన కారణం ఆ కంపెనీ కార్లకు సంబంధించి వరుసగా వెలుగు చూస్తున్న ప్రమాదాలే. ఇటీవలే మలేషియాలో చెరీ పాపులర్ కార్ ‘ఓమోడా 5’ (Omoda 5) యాక్సిల్ విరిగిపోయి చక్రాలు ఊడిపోయిన ఘటన ప్రపంచవ్యాప్తంగా కంపెనీ పరువు తీసింది. ఇప్పుడు తాజాగా అదే కంపెనీకి చెందిన మరో కారు ‘టిగ్గో క్రాస్’ (Tiggo Cross) విషయంలోనూ సరిగ్గా ఇదే తరహా ఘటన పునరావృతమైంది. నడుస్తున్న రోడ్డుపైనే యాక్సిల్ విరిగిపోవడం, చక్రాలు ఊడిపోవడంతో ఈ బ్రాండ్ భద్రతపై మళ్లీ తీవ్రమైన ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

సోషల్ మీడియాను ఊపేస్తున్న ఘటన..
ఈ ఘటన మలేషియాలో జరిగింది. అక్కడ చెరీ టిగ్గో క్రాస్ కారు ప్రమాదానికి గురికావడంతో చూస్తుండగానే ఆ ఎస్‌యూవీ (SUV)కి సంబంధించిన రెండు చక్రాలు వేరుపడిపోయాయి. రద్దీ రోడ్డుపై జరిగిన ఈ యాక్సిడెంట్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కొద్ది రోజులు తిరక్కుండానే చెరీ గ్రూప్‌ కార్ల వీల్స్ ఊడిపోతున్న రెండు వేర్వేరు ఘటనలు వెలుగులోకి రావడంతో ఈ బ్రాండ్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. అయితే, టిగ్గో క్రాస్ కారు చక్రాలు ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల ఊడిపోలేదని, కేవలం యాక్సిడెంట్ కారణంగానే అలా జరిగిందని కంపెనీ చెబుతోంది.

స్పందించిన చెరీ ఆటో మలేషియా..
ఈ ఘటనపై స్పందించిన చెరీ ఆటో మలేషియా (Chery Auto Malaysia) ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. తమ టీమ్ ఇప్పటికే బాధితుడిని సంప్రదించి అన్ని రకాలుగా సహాయం చేస్తోందని వెల్లడించింది. కంపెనీ చెప్పినదాని ప్రకారం.. రోడ్డు ప్రమాదం కారణంగానే కారు వీల్స్ ఊడిపోయాయి, ఫ్రంట్ బంపర్ (Front Bumper) డెమెజ్ అయింది తప్ప ఇందులో ఎలాంటి టెక్నికల్ లోపం లేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లేని వార్తలను షేర్ చేయవద్దని ప్రజలను కోరింది. అయితే, ఈ దుర్ఘటనకు సంబంధించి పూర్తి టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్‌ను మాత్రం చెరీ ఇప్పటివరకు పబ్లిక్ చేయలేదు.

ఇది మొదటి సారి కాదు..
ఇక, చెరీ కంపెనీ కార్లు ఇలా రోడ్డుపై విడిపోయి ప్రమాదాలకు గురికావడం ఇదేం కొత్త కాదు. కొద్ది రోజులకు ముందే మలేషియాలో ఆ కంపెనీకి చెందిన ‘ఓమోడా 5’ (Omoda 5) కారు విషయంలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. రన్నింగ్‌లో ఉన్న ఆ ఎస్‌యూవీ రియర్ యాక్సిల్ (Rear Axle) అకస్మాత్తుగా విరిగిపోయి చక్రాలు వేరుపడ్డాయి. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో అక్టోబర్‌లో మలేషియా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ (JPJ) ఓమోడా 5 పాత పెట్రోల్ మోడల్స్‌కు సంబంధించిన వెహికల్ టైప్ అప్రూవల్ (VTA)ను తాత్కాలికంగా రద్దు చేసింది. ఈ నిర్ణయం కారణంగా పూర్తి స్థాయి సేఫ్టీ ఎవాల్యుయేషన్ (Safety Evaluation) మరియు ఎంక్వైరీ పూర్తయ్యే వరకు కొత్త కార్ల రిజిస్ట్రేషన్ నిలిచిపోయింది. దీనితో అప్రమత్తమైన కంపెనీ.. ఓమోడా 5 సీ, హెచ్ మోడల్స్‌కు చెందిన మొత్తం 8,878 కార్లను రీకాల్ (Recall) చేస్తున్నట్లు ప్రకటించింది.

ఇండియా మార్కెట్లోకి ఎంట్రీ ప్లాన్స్.. 
చెరీ కంపెనీకి సంబంధించిన ఈ పరిణామాలు భారతీయ ఆటోమొబైల్ (Automobile) కస్టమర్లకు అత్యంత కీలకం. ఎందుకంటే చెరీ ఆటోమొబైల్స్ త్వరలోనే ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టాలని ప్లాన్ చేస్తోంది. ఈ చైనీస్ బ్రాండ్ మన దేశంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రముఖ భారతీయ దిగ్గజ సంస్థ అయిన జెఎస్‌డబ్ల్యూ గ్రూప్ (JSW Group)తో కలిసి భాగస్వామ్య చర్చలు జరుపుతోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 2026 చివరి నాటికి లేదా 2027 ప్రారంభంలో చెరీ కార్లు మన రోడ్లపైకి వచ్చే అవకాశాలున్నాయి. ఈ ప్రణాళిక కనుక సక్సెస్ అయితే, ఇండియన్ కార్ మార్కెట్లోకి మరో కొత్త చైనీస్ ఆటో బ్రాండ్ నేరుగా ప్రవేశించినట్లవుతుంది.