Blink Mobility Pod EV Car: భారతీయ నగరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారంగా, తక్కువ ఖర్చుతో సురక్షితమైన ప్రయాణాన్ని అందించాలనే లక్ష్యంతో బ్లింక్ మొబిలిటీ ఒక వినూత్న పాడ్ కారును రూపొందించింది. ఈ కారు చూడటానికి టాటా నానో ఈవీని గుర్తుకు తెచ్చేలా ఉండగా, పూర్తిగా ప్యూర్ ఎలక్ట్రిక్ వాహనంగా గ్రౌండ్ లెవల్ నుంచే అభివృద్ధి చేయడం దీని ప్రత్యేకత అని చెప్పాలి. ఈ పాడ్ కార్ ముందు భాగంలో ఫ్యూచరిస్టిక్ హెక్సాగోనల్ డీఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు ఉన్నాయి. 12 అంగుళాల స్టీల్ వీల్స్, వెనుక భాగంలో స్టైలిష్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్లతో ఇది చాలా కాంపాక్ట్‌గా కనిపిస్తుంది. చిన్న పరిమాణం వల్ల సిటీ రోడ్లపై, రద్దీగా ఉండే గల్లీల్లో కూడా సులభంగా నడిపేలా డిజైన్ చేశారు.
Read Also: Secunderabad: ‘సికింద్రాబాద్ బచావో’!.. నగరంలో పొలిటికల్ వార్..
ఇక, బ్లింక్ మొబిలిటీ వెనుక ఐఐటీ ఢిల్లీ పూర్వ విద్యార్థులు, టెస్లా లాంటి అంతర్జాతీయ సంస్థల్లో పని చేసిన సాంకేతిక నిపుణులు ఉండటంతో ఈ కారులో అత్యాధునిక టెక్నాలజీని వినియోగించారు. నికేష్ బిష్త్ సంస్థ స్థాపకుడిగా ఉండగా, టెస్లాలో సైబర్ ట్రక్, రోబో టాక్సీ ప్రాజెక్టులపై పని చేసిన అంకిత్ కుమార్ సీటీఓగా వ్యవహరిస్తున్నారు. ఈ పాడ్ కార్‌లోని ప్రధాన ఆకర్షణ బ్యాటరీ స్వాపింగ్ సౌకర్యం కలదు. ఇక, ఛార్జింగ్ కోసం గంటల కొద్దీ వేచి చూడాల్సిన అవసరం లేకుండా, ఖాళీ అయిన బ్యాటరీని ఐదు నిమిషాల్లోనే మార్చుకునే ఛాన్స్ ఉంటుంది. దీంతో వాహన ధర కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉందని కంపెనీ చెబుతోంది. బ్యాటరీని ఒక సర్వీస్‌లా అందించడంతో కారు ధర ఆటో రిక్షా స్థాయికి, అంటే సుమారు రూ.2 నుంచి రూ.3 లక్షల వరకు లభించే అవకాశం ఉంది.
Read Also: Biker Stunts In Front Police Jeep: బీహార్ హైవేపై బైక్ స్టంట్లు.. పోలీస్ వాహనం ముందే విన్యాసాలు
అయితే, ఫీచర్ల పరంగా కూడా బ్లింక్ మెబిలిటి పాడ్ కారు ఆకట్టుకుంటోంది. డ్రైవర్ అలసటను గుర్తించే స్మార్ట్ ఏఐ సిస్టమ్, ప్రమాదం జరిగే అవకాశం ఉంటే హెచ్చరించే కొలిషన్ అవాయిడెన్స్ టెక్నాలజీ ఇందులో ఉన్నాయి. స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫారమ్ వల్ల లోపల ఎక్కువ స్థలం లభించగా, ఒక బ్యాటరీ సెట్‌తో సుమారు 250 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ వెల్లడిస్తోంది. ఇటీవల బ్లింక్ మొబిలిటీ రూ.4.3 కోట్ల ప్రీ-సీడ్ నిధులను సమీకరించింది. ఈ నిధులను ప్రొడక్ట్ అభివృద్ధి, బ్యాటరీ స్వాపింగ్ నెట్‌వర్క్ ఏర్పాటుతో పాటు పైలట్ ప్రాజెక్టుల కోసం వినియోగించనున్నారు.
అలాగే, నగరాల్లో రోజువారీ ప్రయాణాలు చేసే సామాన్యుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ కారును అభివృద్ధి చేస్తున్నారు. కాగా, రతన్ టాటా కలల ప్రాజెక్ట్ అయిన నానో కారులా, బ్లింక్ పాడ్ కూడా అందుబాటు ధరతో సామాన్యులకు సురక్షితమైన ఫోర్-వీలర్ ప్రయాణాన్ని అందించాలనే లక్ష్యంతో ముందుకు సంస్థ వస్తోంది. బ్యాటరీ స్వాపింగ్ సౌకర్యంతో వచ్చే ఈ పాడ్ కార్ భారతీయ ఆటోమొబైల్ రంగంలో ఒక గేమ్ ఛేంజర్‌గా మారే ఛాన్స్ ఉందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
