Bharat Mobility Expo 2027: కార్ల ప్రియులకు పండుగే.. భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2027 తేదీలు ఖరారు..!

Bharat Mobility Expo 2027

Bharat Mobility Expo 2027

Bharat Mobility Expo 2027: భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2027 తేదీలు ఖరారయ్యాయి. కార్ల ప్రేమికులకు పండుగలాంటి ఈ మెగా ఆటోమొబైల్ ఈవెంట్‌కు ముహూర్తం సెట్ అయింది. కార్ల ప్రియులకు, ఆటో పరిశ్రమలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకునే వారికి ఇది నిజంగానే ఓ పెద్ద పండుగ వాతావరణాన్ని తీసుకొస్తుంది. గతంలో ‘ఆటో ఎక్స్‌పో’గా పిలిచే ఈ ప్రతిష్టాత్మక ప్రదర్శనను ఈసారి ‘భారత్ మొబిలిటీ ఎక్స్‌పో’ పేరుతో నిర్వహిస్తున్నారు. ఈ మెగా ఈవెంట్ 2027 ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 9 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో చాలా వైభవంగా జరగనుంది. సాధారణ ప్రజల కంటే ముందుగా, అంటే ఫిబ్రవరి 2, 3 తేదీల్లో మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శనను కేటాయించే అవకాశం ఉంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఈ ప్రదర్శనలో కేవలం రాబోయే కొత్త కార్లే కాకుండా, ఆటోమొబైల్ కంపెనీలు తయారుచేస్తున్న ఫ్యూచర్ ప్రొడక్ట్స్, భవిష్యత్ టెక్నాలజీలు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మోడళ్లను ప్రదర్శిస్తాయి. ఈ క్రమంలోనే పలు కంపెనీలు కొత్త వాహనాలను నేరుగా మార్కెట్లోకి లాంచ్ చేయడానికి కూడా సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం ఈ సంవత్సరం చివరి త్రైమాసికంలో ఉండటంతో, వాహన తయారీ సంస్థలన్నీ వచ్చే కొత్త క్యాలెండర్ ఇయర్ కోసం ప్రణాళికలను వేగవంతం చేశాయి. 2027లో భారత మార్కెట్లోకి ఎలాంటి మోడళ్లను తీసుకరావాలి అనే దానిపై కార్ మేకర్స్ దృష్టి పెట్టారు. ఈ వ్యూహాలకు సంబంధించిన పూర్తి స్వరూపం మనకు ఫిబ్రవరిలో జరగబోయే మొబిలిటీ ఎక్స్‌పోలోనే స్పష్టంగా కనిపించనుంది.

ఈ భారీ ఎక్స్‌పోలో ఏయే కంపెనీలు పాల్గొంటాయనేది ఇంకా పూర్తిగా వెల్లడి కానప్పటికీ.. మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్, మహీంద్రా, టయోటా, ఎంజీ, కియా, జెఎస్‌డబ్ల్యూ మోటార్స్, మెర్సిడెస్ బెంజ్ వంటి దిగ్గజ సంస్థలు పాల్గొనే అవకాశం ఉంది. ఈ ప్రదర్శనలో మారుతి సుజుకికి చెందిన 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎమ్‌పివి, నెక్స్ట్ జనరేషన్ హ్యుందాయ్ క్రెటా, టయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్, హ్యుందాయ్ నేయిరా, రెనో బ్రిజర్, రెనో బిగ్‌స్టర్ వంటి అనేక ఆకర్షణీయమైన కొత్త కార్లు మెరవనున్నాయి. ప్రస్తుతానికి కేవలం ఈవెంట్ తేదీలు మాత్రమే ఖరారయ్యాయని, పాల్గొనే కంపెనీలు, ఇతర వివరాలు త్వరలోనే వెల్లడవుతాయని గమనించాలి.