కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..

Bajaj Wego

Bajaj Wego

Bajaj Wego Electric Auto: బజాజ్ ఆటోకు చెందిన ‘వెగో’ (Wego) ఎలక్ట్రిక్ త్రీ వీలర్‌ సరికొత్త రికార్డులు సృష్టించింది. ఒక్కసారి ఛార్జింగ్‌తో ఏకంగా 394.2 కిలోమీటర్లు ప్రయాణించి రికార్డు నెలకొల్పింది. అంతేకాకుండా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 4,023 కిలోమీటర్ల యాత్రను తొమ్మిది రోజుల్లో పూర్తి చేసింది. ఈ రెండు ఘనతలకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు పొందినట్లు కంపెనీ తెలిపింది.

తమిళనాడులోని నామక్కల్ నుంచి తిరునెల్వేలి వరకు జరిగిన ప్రయాణంలో బజాజ్ వెగో ఈ రికార్డును సాధించింది. ఎలక్ట్రిక్ త్రీ వీలర్ విభాగంలో ఒక్కసారి ఛార్జింగ్‌తో అత్యధిక దూరం ప్రయాణించిన వాహనంగా నిలిచింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన Wego P9018 మోడల్‌కు 296 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ఉంది. అయితే రికార్డు ప్రయాణంలో 394.2 కిలోమీటర్లు కవర్ చేసింది. అంటే ప్రకటించిన రేంజ్ కంటే అదనంగా 98.2 కిలోమీటర్లు దూరం ప్రయాణించింది. అయితే ఈ ప్రయాణంలో వాహనంపై ఉన్న లోడ్, సగటు వేగం, ఛార్జింగ్ విధానం వంటి వివరాలను కంపెనీ వెల్లడించలేదు.

ఈ బజాజ్ వెగో మరో రికార్డును కూడా సొంతం చేసుకుంది. 2026 అక్టోబర్ 27న జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ లాల్ చౌక్ నుంచి ప్రారంభమైన యాత్ర నవంబర్ 5న తమిళనాడులోని కన్యాకుమారిలో ముగిసింది. మొత్తం తొమ్మిది రోజుల్లో 4,023 కిలోమీటర్ల దూరాన్ని ఈ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ పూర్తి చేసింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ మార్గాన్ని పూర్తి చేసిన తొలి ఎలక్ట్రిక్ త్రీ వీలర్‌గా నిలిచినట్లుగా కంపెనీ తెలిపింది.

బజాజ్ వెగో P9018ను రూ.4,41,247 ఎక్స్‌షోరూమ్ ధరతో విడుదల చేసింది. ఇందులో 17.7 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. కంపెనీ ప్రకటించిన సర్టిఫైడ్ రేంజ్ 296 కిలోమీటర్లు. ఈ మోడల్‌లో టూ-స్పీడ్ ట్రాన్స్‌మిషన్, 36 శాతం గ్రేడబిలిటీ ఉన్నాయి. బ్యాటరీకి ఐదేళ్ల వారంటీని కూడా అందిస్తోంది. బ్యాటరీ సామర్థ్యం, బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్, రీజెనరేటివ్ బ్రేకింగ్, వాహన డిజైన్ కారణంగా మెరుగైన రేంజ్ సాధ్యమవుతుందని కంపెనీ గతంలో పేర్కొంది. ఈ రికార్డులతో వెగో సామర్థ్యాన్ని బజాజ్ మరోసారి నిరూపించింది.