Honda City facelift: హోండా కార్స్ ఇండియా భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి సరికొత్త 2026 హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ (2026 Honda City facelift) మోడల్‌ను లాంచ్ చేసింది. దీంతో పాటు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తమ హైబ్రిడ్ ఎస్‌యూవీ ‘హోండా జెడ్ఆర్-వి ఇ:హెచ్ఈవి’ (Honda ZR-V e:HEV) ని కూడా భారత్‌లో మొదటిసారిగా ప్రదర్శించింది. తమ కంపెనీని మరింత ప్రీమియం స్థానంలో నిలబెట్టడానికి, హైబ్రిడ్ టెక్నాలజీ, స్పోర్టీ డిజైన్లపై ప్రత్యేక దృష్టి పెట్టడానికి ఈ రెండు మోడళ్లు ఒక కొత్త మైలురాయి అని హోండా పేర్కొంది. అప్‌డేట్ చేసిన హోండా సిటీ సరికొత్త స్టైలింగ్, అదనపు ఫీచర్లతో రాగా.. జెడ్ఆర్-వి మోడల్ హోండా కంపెనీకి సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీగా భారత్‌లోకి అడుగుపెట్టింది.
గ్లోబల్ మార్కెట్‌లో హోండాకు ఉన్న టాప్-3 కీలక మార్కెట్లలో భారతదేశం ఒకటి అని హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్, సీఈఓ తకాషి నకాజిమా తెలిపారు. 2020లో లాంచ్ అయిన ఐదో తరం హోండా సిటీ సెడాన్‌కు ఇది రెండో ప్రధాన మిడ్-సైకిల్ అప్‌డేట్. ఈ సరికొత్త హోండా సిటీ మునుపటి కంటే 11 మిమీ అదనపు పొడవుతో మొత్తం 4,594 మిమీ పొడవును కలిగి ఉంది. దీని ఫ్రంట్ లుక్‌ను పూర్తిగా మార్చేశారు. ఇందులో సరికొత్త బయో-ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, గ్రిల్‌తో కనెక్ట్ అయ్యే ఎల్ఈడీ లైట్ బార్, స్ప్లిట్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లాంప్స్ (DRLs), కొత్త మ్యాట్రిక్స్-మెష్ గ్రిల్ డిజైన్‌ను ఇచ్చారు. బంపర్‌ను సైతం పెద్ద ఎయిర్ ఇన్‌టేక్స్, ఏరోడైనమిక్ డీటెయిలింగ్‌తో మరింత షార్ప్‌గా డిజైన్ చేశారు. పక్కల భాగంలో కొత్తగా డిజైన్ చేసిన 16-ఇంచుల డ్యూయల్-టోన్ ఏరో బ్లేడ్ అలాయ్ వీల్స్, వెనుక వైపు జెడ్-ఎడ్జ్ ఎల్ఈడీ టైల్ లాంప్స్, రీడిజైన్ చేసిన బంపర్ గార్నిష్, స్పోర్టీ ట్రంక్ లిప్ స్పాయిలర్‌ను అమర్చారు. అలాగే కలర్ ఆప్షన్లలో కొత్తగా ‘క్రిస్టల్ బ్లాక్ పర్ల్’ షేడ్‌ను తీసుకొచ్చారు.
కారు లోపలి భాగం (ఇంటీరియర్) విషయానికి వస్తే.. పాత డ్యూయల్-టోన్ బ్లాక్, ఐవరీ థీమ్‌నే కొనసాగిస్తూనే కొన్ని అప్‌గ్రేడ్స్ చేశారు. ఇందులో వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన కొత్త 10.1-ఇంచుల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అమర్చారు. డ్యాష్‌బోర్డ్‌పై కొత్త డార్క్ ఐరన్ 3D-ప్యాటర్న్ గార్నిష్‌తో పాటు యాంబియంట్ లైటింగ్‌ను జోడించారు. ఇంకా 360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ముందు వెనుక ప్రయాణికుల కోసం యూఎస్‌బీ టైప్-సి చార్జింగ్ పోర్టులు, వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వైర్‌లెస్ చార్జింగ్, 8-స్పీకర్ల ఆడియో సిస్టమ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ రియర్ సన్‌షేడ్ వంటి ప్రీమియం ఫీచర్లను ఇందులో అందించారు. భద్రత కోసం హోండా సెన్సింగ్ ఎడాస్ (ADAS) ఫీచర్లు అయిన కొలిజన్ మిటిగేషన్ బ్రేకింగ్ సిస్టమ్ (CMBS), లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ (ఇ:హెచ్ఈవి వేరియంట్‌లో లో-స్పీడ్ ఫాలోతో), రోడ్ డిపార్చర్ మిటిగేషన్, ఆటో హై బీమ్ లీడ్ కార్ డిపార్చర్ నోటిఫికేషన్ వంటి అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఇంజన్ పరంగా చూస్తే ఈ కారులో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇది పెట్రోల్ స్ట్రాంగ్-హైబ్రిడ్ ఆప్షన్లలో లభిస్తుంది. 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ i-VTEC పెట్రోల్ ఇంజన్ 121bhp పవర్, 145Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్టెప్ సీవీటీ (CVT) ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. మాన్యువల్ వేరియంట్ లీటరుకు 17.77 కిమీ, సీవీటీ వేరియంట్ లీటరుకు 17.97 కిమీ మైలేజ్ ఇస్తాయని హోండా క్లెయిమ్ చేసింది. ఇక సిటీ ఇ:హెచ్ఈవి (e:HEV) స్ట్రాంగ్-హైబ్రిడ్ వెర్షన్ సెల్ఫ్-చార్జింగ్ టూ-మోటార్ హైబ్రిడ్ సిస్టమ్‌తో వస్తుంది. ఇది e-CVT గేర్‌బాక్స్‌తో జత చేయబడి 126bhp పవర్, 253Nm టార్క్‌ను అందిస్తుంది. ఇది లీటరుకు ఏకంగా 27.26 కిమీల అత్యుత్తమ మైలేజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. ఈ హైబ్రిడ్ సిస్టమ్ డ్రైవింగ్ పరిస్థితులకు అనుగుణంగా ఈవీ (EV), హైబ్రిడ్ ఇంజన్ డ్రైవ్ మోడ్స్‌లోకి ఆటోమేటిక్‌గా మారిపోతుంది. హోండా కంపెనీ దీని లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌పై 8 ఏళ్లు లేదా 1.6 లక్షల కిమీల వారంటీతో పాటు హైబ్రిడ్ సిస్టమ్ కాంపోనెంట్స్ మీద కొత్తగా 5 ఏళ్లు లేదా 1 లక్ష కిమీల వారంటీని ఇస్తోంది.
వేరియంట్ల విషయానికి వస్తే.. పెట్రోల్ మాన్యువల్ వెర్షన్ SV, V, ZX ZX+ ట్రిమ్స్‌లో లభించనుండగా, సీవీటీ (CVT) ఆప్షన్ మాత్రం V, ZX ZX+ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఇక సిటీ హైబ్రిడ్ (e:HEV) వెర్షన్ మాత్రం కేవలం టాప్-ఎండ్ ZX+ ట్రిమ్‌లో మాత్రమే లభిస్తుంది. ప్రస్తుతం ఈ కార్లు భారతదేశంలోని అన్ని హోండా డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉన్నాయి, డెలివరీలు కూడా వెంటనే ప్రారంభం కానున్నాయి. దీంతో పాటే హోండా ప్రదర్శించిన సరికొత్త జెడ్ఆర్-వి ఇ:హెచ్ఈవి (ZR-V e:HEV) భారతదేశంలో కంపెనీకి కొత్త ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీగా నిలవనుంది. అంతర్జాతీయంగా ప్రీమియం స్పోర్టీ ఎస్‌యూవీగా పేరుతెచ్చుకున్న ఈ మోడల్ షార్ప్ స్టైలింగ్, ప్రీమియం ఇంటీరియర్స్ హోండా అడ్వాన్స్‌డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ ఎస్‌యూవీలో 2.0-లీటర్ ఇ:హెచ్ఈవి స్ట్రాంగ్-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను ఉపయోగించారు. 2022లో అంతర్జాతీయంగా లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 8 లక్షలకు పైగా జెడ్ఆర్-వి యూనిట్లు అమ్ముడయ్యాయి. అయితే భారతదేశంలో ఈ ఎస్‌యూవీ లాంచ్ టైమ్‌లైన్ లేదా ధరల వివరాలను హోండా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ, ఇది ఒక ప్రీమియం మోడల్‌గా మార్కెట్లోకి రానుందని, ప్రారంభంలో దీనిని కంప్లీట్ బిల్ట్ యూనిట్ (CBU) రూపంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
