Mahindra Bolero, Bolero Neo: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా (Mahindra) అత్యంత ప్రజాదరణ పొందిన యుటిలిటీ వాహనాలైన బొలెరో (Bolero, Bolero Neo)ల 2025 అప్‌డేటెడ్ వెర్షన్‌లను భారత మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేసింది. ఈ రెండు మోడళ్లలోనూ బయట, లోపల అనేక మార్పులు చేసినప్పటికీ.. ఇంజిన్, మెకానికల్ సెటప్‌లో మాత్రం ఎటువంటి మార్పులు చేయకపోవడం గమనించదగిన విషయం. ఈ లాంచ్ సందర్భంగా మహీంద్రా ఇప్పటివరకు దేశీయ మార్కెట్‌లో 1.68 మిలియన్ల (16.8 లక్షలు) బోలెరో యూనిట్లను విక్రయించినట్లు ప్రకటించింది.
2025 Mahindra Bolero విషయానికి వస్తే.. దీని ప్రారంభ ధర (B4 వేరియంట్) రూ. 7.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. కొత్తగా చేర్చబడిన టాప్ ఎండ్ వేరియంట్ B8 ధర రూ. 9.69 లక్షలుగా నిర్ణయించారు. ఇతర వేరియంట్లు B6 (రూ. 8.69 లక్షలు), B6(O) (రూ. 9.09 లక్షలు) ధరలకు లభిస్తాయి. ఈ మోడల్‌లో ఇదివరకు 1.5-లీటర్ mHawk75 డీజిల్ ఇంజిన్ కొనసాగించారు. ఇది గరిష్టంగా 75bhp శక్తిని, 210Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బొలెరో తన ఐకానిక్ రూపకల్పనను నిలుపుకుంది. అయితే, కొత్తగా ఐదు స్లాట్‌లతో కూడిన గ్రిల్, కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్ మరియు ఫాగ్ ల్యాంప్స్‌ను ఇందులో చేర్చారు. ముఖ్యంగా, దీనికి ‘స్టీల్త్ బ్లాక్’ (Stealth black) అనే కొత్త రంగును జోడించడం ద్వారా మరింత అగ్రెసివ్ లుక్ వచ్చింది. ఇక కారు లోపల భాగంలో లెథరెట్ అప్‌హోల్‌స్టరీతో రిఫ్రెష్డ్ క్యాబిన్ ఉంది. సీట్లలో గాలి ప్రసరణ కోసం మెష్ డిజైన్ ప్యాటర్న్‌ను ఇచ్చారు. డ్రైవర్ సౌలభ్యం కోసం స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, 17.8 cm ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్‌ను ఇందులో పొందుపరిచారు.
Happy Divorce: “కొడుకుకు తల్లి పాలాభిషేకం, కేక్ కటింగ్”.. విడాకుల సెలబ్రేషన్ వీడియో వైరల్..
ఇక 2025 Mahindra Bolero Neo విషయానికి వస్తే.. ఇందులో కూడా పాత మోడల్ నుంచి వచ్చిన 1.5-లీటర్ mHawk డీజిల్ ఇంజిన్ ఉంది. ఇది 100 bhp శక్తిని, 260 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఇక దీని ప్రారంభ ధర (N4 వేరియంట్) రూ. 8.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. కొత్తగా చేర్చబడిన టాప్ ఎండ్ వేరియంట్ N11 ధర రూ. 9.99 లక్షలుగా నిర్ణయించారు. ఇతర వేరియంట్లు N8 (రూ. 9.29 లక్షలు), N10 (రూ. 9.79 లక్షలు) ధరలకు లభిస్తాయి. బొలెరో నియో పాత మోడల్‌ను పోలి ఉన్నప్పటికీ, కొత్తగా నిలువు స్లాట్‌లతో డిజైన్ చేసిన గ్రిల్, కొత్త R16 అల్లాయ్ వీల్స్‌ను పొందింది. ఈ మోడల్‌కు కొత్తగా ‘జీన్స్ బ్లూ’ (Jeans Blue) రంగును కూడా కొత్తగా తీసుక వచ్చారు. బొలెరో నియో క్యాబిన్ కూడా లెథరెట్ అప్‌హోల్‌స్టరీ, మెష్ ప్యాటర్న్‌లతో కొత్తగా చేయబడింది. టాప్ ఎండ్ వేరియంట్‌లకు ‘లూనార్ గ్రే’ (Lunar grey) థీమ్, మిగితా వేరియంట్‌లకు ‘మోచా బ్రౌన్’ (Mocha brown) థీమ్ ఇవ్వడం ద్వారా ప్రీమియం లుక్ వచ్చింది. ఈ అప్‌డేట్‌లో రియర్ వ్యూ కెమెరా, పెద్ద 22.9 cm ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ వంటి కీలక ఫీచర్లు కూడా లభించనున్నాయి.
