NTV Telugu Site icon

Draupadi Murmu: రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకి జగన్ సపోర్ట్

Jagan 1 (1)

Jagan 1 (1)

ఏపీ పర్యటనకు వచ్చిన రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో అధికార ఎన్డీఏ అభ్యర్థి ద్రౌప‌ది ముర్ముకు ఏపీలో ఘ‌న స్వాగ‌తంతో పాటు ఘ‌న స‌త్కారం ల‌భించింది. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో త‌న‌కు మ‌ద్దతు ఇవ్వాలంటూ ఏపీలోని ప్రజా ప్ర‌తినిధుల‌ను కోరేందుకు ఏపీకి వ‌చ్చిన ముర్ముకు గ‌న్నవ‌రం ఎయిర్ పోర్టులో వైసీపీ, బీజేపీ నేత‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం ఆమె కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డితో క‌లిసి తాడేప‌ల్లిలోని సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఈ సంద‌ర్భంగా ముర్ముకు స‌తీస‌మేతంగా సీఎం జ‌గ‌న్ స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం ఆమెను చీర సారెతో వారు స‌త్కరించారు. వెంక‌టేశ్వరస్వామి చిత్రప‌టాన్ని ఆమెకు అందించారు. అనంత‌రం ముర్ముతో క‌లిసి ఆమె కారులోనే జ‌గ‌న్ వైసీపీ ఎమ్మెల్యేల వ‌ద్దకు వెళ్లారు. వైసీపీ ప్రజా ప్ర‌తినిధుల‌ను స్వయంగా జ‌గ‌న్‌… ముర్ముకు ప‌రిచయం చేశారు.

ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైయస్‌.జగన్‌ను కలిసి… తేనీటి విందులో పాల్గొన్నారు ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి శ్రీమతి ద్రౌపది ముర్ము. ఆమెకు వేదఆశీర్వచనం ఇచ్చి, ప్రసాదాలు అందించారు దుర్గామల్లేశ్వరస్వామి దేవస్ధానం వేదపండితులు. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.ప్రధాని నరేంద్ర మోడీ తరఫున సీఎం వైఎస్‌ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు వైఎస్సార్‌సీపీ మద్దతు పలకడం సంతోషం. అందరితో చర్చించాకే ద్రౌపది ముర్మును అభ్యర్థిగా ప్రకటించామన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా తొలిసారి గిరిజన మహిళకు అవకాశం లభించింది. పార్టీలకు అతీతంగా ముర్ముకు అందరం మద్దతు పలకాలన్నారు.అంతకుముందు జగన్ మాట్లాడారు. సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించిప ప్రభుత్వం వైసీపీ అన్నారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున మొత్తం 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు, తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులంతా ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని, ఓటేయాలని సీఎం జగన్‌ కోరారు. ‘‘రాష్ట్రపతి అభ్యర్థిగా తొలిసారి గిరిజన మహిళకు అవకాశం లభించింది. మొదటి నుంచి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపిస్తూ వస్తోంది. కాబట్టి, సహృదయంతో పార్టీ నిర్ణయాన్ని బలపర్చాల’ని పార్టీ ప్రతినిధులను సీఎం జగన్‌ కోరారు.

అంతేకాదు ఒక్క ఓటు కూడా వృథా కాకూడదని, జులై 18న మాక్‌ పోలింగ్‌ కూడా నిర్వహిస్తామని, మాక్‌పోలింగ్‌లో పాల్గొన్న తర్వాతే ఓటింగ్‌కు వెళ్లాలని సభ్యులకు సూచించారు. ఎంపీల తరపున విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డిలు బాధ్యతలు తీసుకుంటారని, అలాగే విప్‌లు, మంత్రులు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.ద్రౌపది ముర్ముని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై వుందన్నారు. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఓటు వేయాలని, మాక్ పోలింగ్ లో పాల్గొనాలని జగన్ సూచించారు. తనకు మద్దతు తెలిపిన తెలుగు ప్రజలకు ద్రౌపది ముర్ము ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు కవులను, స్వాతంత్ర్య సమరయోధులను ఆమె గుర్తుచేసుకున్నారు. జై వందేమాతరం, జై ఆంధ్రప్రదేశ్ అన్నారు ద్రౌపది ముర్ము.

Revanth Reddy : భారీ వర్షాలపై సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ..