ఏపీలో అధికార పార్టీ వైసీపీ ప్లీనరీ సమావేశాలకు రంగం సిద్ధం అవుతోంది. జూలై 8, 9 తేదీల్లో పార్టీ ప్లీనరీని భారీ ఎత్తున నిర్వహించేలా వైసీపీ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు పార్టీ ప్లీనరీని నిర్వహించాలని సీఎం జగన్ వైసీపీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. ఇంకా నెలరోజులు మాత్రమే సమయం ఉండటంతో వైసీపీ ప్లీనరీని ఎక్కడ నిర్వహించాలి అనే విషయంపై వైసీపీ నేతలు సమాలోచనలు చేస్తున్నారు. పార్టీ ప్రారంభించి పదేళ్లు పూర్తి కావడం, సీఎంగా జగన్ మూడేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకోవడం వంటి కీలక పరిణామాల నేపథ్యంలో ఈ దఫా పార్టీ ప్లీనరీని ఘనంగా నిర్వహించే దిశగా పార్టీ కసరత్తులు మొదలుపెట్టింది.
Sajjala: రాజీనామా చేసి ఎన్నికలకు వచ్చే దమ్ము.. చంద్రబాబుకు ఉందా?
అయితే కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్యలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సమీపంలో ప్లీనరీని నిర్వహించేందుకు వైసీపీ అధిష్టానం సన్నాహాలు చేస్తోంది. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో కమిటీల పునర్ వ్యవస్థీకరణపై హైకమాండ్ ఫోకస్ పెట్టింది. అటు అనుబంధ విభాగాల్లో మార్పులు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు కీలక నేతలతో అనుబంధ విభాగాల ఇంఛార్జ్ విజయసాయిరెడ్డి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్లీనరీలో కీలకమైన రాజకీయ దిశానిర్దేశం చేయాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
