Site icon NTV Telugu

ప్రత్యేక హోదాపై వెంటనే చర్చ జరపాలి : విజయసాయిరెడ్డి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై రాజ్యసభలో వెంటనే చర్చ చేపట్టాలని వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నాయకులు వి.విజయసాయి రెడ్డి రాజ్యసభ చైర్మన్‌కు ఈరోజు నోటీసు ఇచ్చారు. సభా నియమ నిబంధనలలోని రూల్‌ 267 కింద ఆయన ఈ నోటీసును ఇచ్చారు. రాజ్యసభలో ఈరోజు నిర్వహించే ఇతర వ్యవహారాలన్నింటిని పక్కన పెట్టి రూల్‌ 267 కింద ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై చర్చను ప్రారంభించాలని ఆయన నోటీసులో కోరారు.

read also : తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా బక్కని నర్సింహులు

ఈ అంశం ఎందుకు అత్యంత ప్రధాన్యతతో కూడుకున్నదో విజయసాయి రెడ్డి తన నోటీసులో క్లుప్తంగా వివరిస్తూ రాష్ట్ర విభజన సందర్భంగా అప్పటి ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్‌కు పలు హామీలను ప్రకటించారు. అందులో రాష్ట్రానికి ప్రత్యేక హోదా అతి ప్రధానమైనది. ప్రధానమంత్రి ఇచ్చిన హామీని మార్చి 1, 2014లో జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశం చర్చించి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఆమోదించింది. కానీ ఇది జరిగి ఏడేళ్ళు కావస్తున్న కేంద్ర మంత్రి మండలి ఈ హామీని నెరవేర్చలేదు. కాబట్టి ఈరోజు సభా కార్యక్రమాలన్నింటినీ సస్పెండ్‌ చేసి సభలో తక్షమే ఈ అంశంపై చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలని విజయసాయి రెడ్డి రాజ్యసభ చైర్మన్‌కు నోటీసులో విజ్ఞప్తి చేశారు.

Exit mobile version