Site icon NTV Telugu

KotamReddy Sridhar Reddy: నేను ప్రభుత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు

Kotamreddy Sridhar Reddy

Kotamreddy Sridhar Reddy

KotamReddy Sridhar Reddy: తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌తో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇటీవల కాలంలో ప్రభుత్వం, అధికారులపై కోటంరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కోటంరెడ్డిని సీఎం జగన్ పిలిపించగా.. ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. అనంతరం వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉన్న సమస్యలనే తాను మాట్లాడానని.. తాను ప్రస్తావించిన సమస్యలను పరిష్కరించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారన్నారు. తన నియోజకవర్గంలో గడప గడపకు కార్యక్రమం వెనుకబడి ఉందని.. వేగం పెంచాలని సీఎం జగన్ సూచించారని కోటంరెడ్డి తెలిపారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 141 రోజులు, మరోసారి 105 రోజులు గడప గడపకు కార్యక్రమం చేశానని.. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పలు దఫాలు ప్రతి గడపను టచ్ చేశానని ఎమ్మెల్యే కోటంరెడ్డి వివరించారు. తర్వాత అనారోగ్య కారణాల వల్ల గడప గడపకు కార్యక్రమ సమయాన్ని కాస్త తగ్గించాల్సి వచ్చిందన్నారు. నెమ్మదిగా అయినా కచ్చితంగా తిరగాలని సీఎం సూచించారన్నారు. పొట్టిపాలెం బ్రిడ్జ్, ఇళ్ళ స్థలాలు, దర్గా నిర్మాణం, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, గురుకుల పాఠశాల వంటి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లినట్లు కోటంరెడ్డి తెలిపారు. తాను ఎక్కడా ప్రభుత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదన్నారు. అధికారుల సహాయ నిరాకరణపైనే తాను మాట్లాడానని చెప్పారు.

Read Also: Ashu Reddy: అమ్మడి అందాల ఆరబోతకు హద్దే లేదే

సీఎంతో తాను మాట్లాడిన కాన్ఫిడెన్షియల్ విషయాలు బయటకు చెప్పటం కరెక్ట్ కాదని.. తాను బహిరంగ సభలోనో, మీడియా సమావేశంలోనో మాట్లాడలేదని.. జిల్లా అభివృద్ధి సమావేశంలోనే తాను ఒక ఎమ్మెల్యేగా స్థానిక సమస్యలను ప్రస్తావించినట్లు కోటంరెడ్డి వివరించారు. తన ఆరాటం, పోరాటం ప్రజా సమస్యల పరిష్కారం కోసమే అని.. వీటిని రాజకీయ కోణంలో చూడవద్దని.. మానవీయ కోణంలో చూడాలని సూచించారు. తనకు రాజకీయ వారసత్వం లేదన్నారు. కొన్ని కుటుంబాలు తన గొంతు కోయటానికి ప్రయత్నం చేశాయని.. భవిష్యత్తులోనూ ప్రజా సమస్యలపై తన పోరాటం కొనసాగుతుందన్నారు. పార్టీ క్రమశిక్షణ లైన్ దాటకుండా ప్రజా సమస్యల కోసం పోరాడటం తప్పు కాదన్నారు. ఆశ లేకపోతే శ్వాస కూడా పీల్చుకోలేమన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారని.. నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమస్యలు పరిష్కారం అవుతాయని వంద శాతం నమ్మకం ఉందన్నారు.

Exit mobile version