Andhra Pradesh: ఏపీ వ్యాప్తంగా సెప్టెంబర్ 1న 62.70 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ జరగనుంది. ఈ పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ.1,594.66 కోట్ల మొత్తాన్ని విడుదల చేసింది. రాష్ట్రంలోని 2.66 లక్షల మంది వలంటీర్లు పింఛన్లను పంపిణీ చేయనున్నారు. ఐదు రోజుల్లోగా వంద శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. పింఛన్ల అందజేతలో అక్రమాలకు తావులేకుండా అధికారులు బయోమెట్రిక్, ఐరిస్ విధానాన్ని అమలు చేస్తున్నారు.
కాగా అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని సీఎం జగన్ అధికారులకు పదే పదే సూచిస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక.. ప్రతి నెలా ఒకటో తేదీనే వాలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి మరీ పెన్షన్లు అందిస్తోన్న సంగతి తెలిసిందే. మరోవైపు వినాయక చవితి సందర్భంగా సీఎం జగన్ ప్రత్యేకంగా వినాయకచవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘విజ్ఞానం, వినయం, సకల శుభాలకు ప్రతీక గణనాథుడు. విఘ్నాలను తొలగించి అభీష్టాలను నెరవేర్చే పూజ్యుడు విఘ్నేశ్వరుడు. ఆయన చల్లని ఆశీస్సులతో ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యాలు చేకూరాలని, ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటూ.. మీఅందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.
