Site icon NTV Telugu

వైఎస్‌ఆర్‌ లైఫ్ టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డుల ప్రకటన

YSR Life Achievement Awards

YSR Life Achievement Awards

వైఎస్సార్ లైఫ్‌టైమ్‌ ఎచీవ్‌మెంట్‌, వైఎస్సార్ అచీవ్‌మెంట్‌ అవార్డులను ప్రకటించింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వ్యక్తులకు ఈ అవార్డులకు ఎంపిక చేశారు.. రాష్ట్ర ప్రభుత్వం తరపున అవార్డుల హైపవర్ స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు, రాష్ట్ర కమ్యూనికేషన్ల సలహాదారు జీవీడీ కృష్ణమోహన్ ఈ అవార్డుల జాబితాలను ప్రకటించారు. మొత్తంగా వివిధ రంగాలకు చెందిన 63 మందికి అవార్డులు ఇవ్వనున్నారు.. వివిధ రంగాల్లోని ఎనిమిది సంస్థలకు లైఫ్ టైమ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డులు దక్కగా.. రైతు విభాగంలో కడియం నర్సరీ వ్యవస్థాపకుడు స్వర్గీయ పల్లా వెంకన్నకు లైఫ్ టైమ్ ఎచీవ్‌మెంట్‌ అవార్డుకు ఎంపిక చేశారు.. కళాకారుల విభాగంలో ఐదుగురికి లైఫ్‌టైమ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డులు ఇవ్వగా.. రచయితల విభాగంలో ఏడుగురికి, పాత్రికేయుల విభాగంలో ఎనిమిది మందికి లైఫ్ టైమ్ ఎచీవ్‌మెంట్‌ అవార్డులు వచ్చాయి..

మొత్తంగా 11 మంది రైతులు, 21 మంది కళాకారులకు, ఏడుగురు రచయితలకు, 8 మంది చొప్పున పాత్రికేయులు, కోవిడ్ వారియర్లకు అవార్డులకు ఎంపిక చేశారు.. 31 మందిని లైఫ్‌టైమ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డులకు, 32 మందిని ఎచీవ్‌మెంట్‌ అవార్డులకు ఎంపిక చేసింది సర్కార్.. వచ్చే 14వ తేదీన అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహించనున్నారు.. వైఎస్సార్ లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డు కింద రూ.10 లక్షల నగదు, వైఎస్సార్ కాంస్య ప్రతిమ, మెడల్, శాలువ బహుకరించనుండగా.. వైఎస్సార్ ఎచీవ్‌మెంట్ అవార్డు కింద రూ. 5 లక్షల నగదు, వైఎస్సార్ కాంస్య ప్రతిమ, మెడల్, శాలువ బహుకరిస్తారు. వైఎస్సార్ లైఫ్ టైమ్ ఎచీవ్‌మెంట్‌ అవార్డులను ఇవ్వాలని 2019లోనే సీఎం వైఎస్‌ జగన్ నిర్ణయించారని తెలిపారు కమ్యూనికేషన్ సలహాదారు జీవీడీ కృష్ణమోహన్.. మట్టిలో మాణిక్యాలను వెలికి తీసే ప్రయత్నం చేశామని.. పూర్తి పారదర్శకతతో అవార్డులను ఎంపిక చేశామని.. సామాన్యుల్లో ఉన్న అసామాన్యులను గుర్తించే ప్రయత్నం చేశామని.. సంస్ధలకు.. వ్యక్తులకూ అవార్డులు ప్రకటించామని వెల్లడించారు.

Exit mobile version