MLA Arava Sridhar Controversy : రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. తనను లైంగికంగా వేధించారని ప్రభుత్వ మహిళా ఉద్యోగి ఆరోపించారు. విష్ చేయడానికి కాల్ చేస్తే.. నంబర్ తీసుకున్నారని తెలిపారు. తాను, తన కొడుకు ఉంటామని తెలుసుకున్నారన్నారు. రెండ్రోజుల తర్వాత తన న్యూడ్స్ అడిగారని, వీడియో కాల్స్ చేయాలని బలవంతం పెట్టారని వాపోయారు. కాదనడంతో బెదిరింపులకు దిగారు. కలుస్తావా.. లేదా అని వేధించడం మొదలుపెట్టారని మహిళా ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేసారు. అయితే, ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై ఆరోపణలు చేసిన మహిళపై జనవరి 7న కేసు నమోదైందని ఎమ్మెల్యే తల్లి ప్రమీల తెలిపారు. సివిల్స్ అస్పిరంట్ అని నమ్మించి తన కొడుకుతో ఆర్థికసాయం పొందిందన్నారు. ఆపై కుట్రపూరితంగా వేధిస్తోందని కోడూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసానన్నారు. దీనిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసారన్నారు ఎమ్మెల్యే తల్లి.
మొత్తంగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.. ఫేస్‌బుక్ పరిచయం ఆసరాగా మహిళా ఉద్యోగికి వేధింపులు వచ్చాయని.. ఏడాదిన్నరగా బెదిరిస్తూ తనపై అత్యాచారం చేశాడని.. తనను లొంగదీసుకుని వేధించారని మీడియాకెక్కింది ప్రభుత్వ ఉద్యోగి.. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వేధింపుల చిట్టా బయట పెట్టిన ఆ మహిళా ఉద్యోగి.. సమాజంలో ఇబ్బందులు వస్తాయని తెలిసినా తన ఆవేదన వ్యక్తం చేస్తున్నానని తెలిపారు.. జూన్ 14.. 2024లో ఎమ్మెల్యే శ్రీధర్‌కు ఫేస్‌బుక్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన సదరు మహిళా ఉద్యోగితో.. మొదటి రోజు రెండు మూడు గంటలు మాట్లాడి.. నాతో బలవంతంగా పరిచయం చేసుకున్నారు.. నా నెంబర్ తీసుకుని ఆయన నెంబర్ నాకు ఇచ్చారు.. భర్త ఉద్యోగరీత్యా దూరంగా ఉండటంతో ఆసరాగా తీసుకుని టచ్‌లోకి వచ్చాడని మహిళా ఉద్యోగి ఆరోపిస్తుంది..
ఇక, పరిచయమైన రెండు రోజుల తరువాత నుంచి న్యూడ్ వీడియో కాల్స్ చేయడం.. బలవంతంగా చూడాలని వత్తిడి తెచ్చారని ఆరోపిస్తోంది సదరు మహిళా ఉద్యోగి.. ఇందుకు అంగీకరించక పోవడంతో బెదిరించారని వాపోయింది.. ఉద్యోగ రీత్యా ఇబ్బందులు పెడతానని భయపెట్టాడని.. నేరుగా కలవాలని ఫోర్స్ చేస్తే.. 20 రోజులు తప్పించుకుని తిరిగానని మహిళా ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేసింది.. అయితే, జులై 9న కలిసానని.. ఆయనే నేరుగా వచ్చి కారులో తీసుకుని వెళ్లారన్న బాధితురాలు తాను విడుదల చేసిన వీడియోలో పేర్కొంది..
అయితే, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక ఆరోపణలపై స్పందించిన ఎమ్మెల్యే తల్లి ప్రమీల.. నా బిడ్డ అమయాయకుడు అని స్పష్టం చేసింది.. ఒకే కులం కావడం వల్ల తరచు రావడం వెళ్ళడం జరుగుతుండేది అని.. సాయం కోసం మా ఇంటికి రాత్రి వేళల్లో వచ్చి టార్చర్ పెట్టేది అని.. మా కొడుకు అమాయకుడు అని చెప్పుకొచ్చారు.. మా కొడుకును అబాసుపాలు చేసింది.. మా కోడుకును వేధిస్తుండడంతో రైల్వేకోడూరు పోలీసులకు గతంలో ఫిర్యాదు చేశా అని గుర్తు చేసుకున్నారు.. మా కుమారుడికి ఉన్న మంచి పేరును దురుద్దేశంతో చెడగొట్టాలని ప్లాన్ చేసింది అని మండిపడ్డారు.. మహిళ వెనుక వైసీపీ లేదా ఇతురులు ఎవరైనా ఉండి నడిపిస్తున్నారనే అనుమానం ఉంది.. ఒక ఆడ పిల్ల జీవితం నాశనం చేయకూడదు అనే ఉద్దేశంతో కొంత కాలం ఓపికతో ఉన్నాం అని వెల్లడించారు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తల్లి ప్రమీల..
మరోవైపు.. ప్రజా ప్రతినిధులే మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నారంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉదో చెప్పాల్సిన పనిలేదన్నారు మాజీ మంత్రి రోజా. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచకపర్వంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఇక, రాష్ట్రంలో మహిళలు, మహిళా ఉద్యోగులకు రక్షణ లేకుండా పోయిందన్నారు మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మహిళా ఉద్యోగిపై చేసిన అత్యాచారమే ప్రత్యక్ష సాక్ష్యమన్నారు . దీనిపై ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, హోంమంత్రి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మరోవైపు.. ఈ దారుణానికి సంబంధించి మీ కూటమి రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ని అరెస్ట్ చేసే దమ్ముందా ? లేదా అని హోంమంత్రి అనితను ప్రశ్నించారు వరుదు కళ్యాణి. ఈ బాధితురాలికి న్యాయం చేసే బాధ్యత మీకు ఉందా..లేదా అని కొశ్చన్ చేశారు. ఇక, ఎవరైనా మహిళల జోలికి వస్తే అదే చివరి రోజు అని మాట్లాడిన సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలన్నారు మాజీ మంత్రి విడదల రజిని. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదన్నది నిజమన్నారు.
